రూ. 18,000 కోట్ల సమీకరణ
18 నుంచి ఇష్యూ ప్రారంభం
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ.
కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్‌వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్‌తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది.
జీక్యూజీ, ఎస్‌బీఐ ఎంఎఫ్ ఆసక్తి..
ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్‌నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment