Vodafone-Idea merger
-
వొడాఫోన్ భారీ ఎఫ్‌పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అదిరిపోయేలా 5జీ డౌన్‌లోన్ స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా 5జీ డౌన్లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్ నమోదైనట్టు ప్రకటించింది. ఎరిక్సన్తో కలిసి మహారాష్ట్రలోని పుణేలో నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గతంలో డౌన్లోడ్ స్పీడ్ 4 జీబీపీఎస్ నమోదైందని వివరించింది. చదవండి: 5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్ఎఫ్సీఎల్ జోడీ -
BSNL Vodafone Idea Merger: అప్పుల బరువుతో విలీనమా?
వొడాఫోన్–ఐడియా(వీఐ) కంపెనీని ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తే సమస్య పరి ష్కారం అవుతుందా? వీఐకి 2018లో చైర్మన్‌గా ఎన్నికైన ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమారమంగళం బిర్లా కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఐడియా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హిమాంషు కాపారియా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వొడాఫోన్–ఐడియా ఆర్థిక కష్టాలలో పడటం, మార్చి 2022 లోపు రూ. 24,000 కోట్లు కట్టాల్సి ఉండటం, కొత్త అప్పులు పుట్టకపోవడం, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వల్ల అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై ఎక్కువ పన్ను కట్టాల్సి రావడం వంటి కారణాల వల్ల రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు బిర్లా వెల్లడించారు. టెలికం రంగంలో ఒకటి, రెండు కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగితే వినియోగదారునికి అన్యాయం జరుగుతుందనీ, కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, వీఐ కంపెనీని బీఎస్ఎన్ఎల్లో కలపడం లేదా అప్పుల్ని ఈక్విటీలుగా మార్చడం, టెలికం శాఖకు కట్టాల్సిన వాయిదాలు చెల్లించే గడు వులు పెంచడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలనీ మొన్న జూన్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో కుమారమంగళం బిర్లా కోరారు. ఐడియా కంపెనీలో 2018లో విలీనమైన వొడాఫోన్ కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూపునకు 27 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 44 శాతం వాటాలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 7న కంపెనీ పేరును ‘వీఐ’గా మార్చారు. వొడాఫోన్‌కి దాదాపు రూ. 1,80,000 కోట్ల అప్పులున్నాయి. రాబోయే 10 ఏళ్లలో స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీల కింద రూ. 58,254 కోట్లు, ఏటా రూ. 7,854 కోట్లు చెల్లించాల్సి ఉంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్ వేసే ఆలోచనలో వొడాఫోన్ ఐడియా ఉంది. ఇదే జరిగితే ఆ ప్రభావం ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులపై ఉంటుంది. మరోవైపు ‘డీఓటీ’కి వెంటనే చెల్లించాల్సిన రూ. 8,292 కోట్లు చెల్లించడానికి మరో ఏడాది గడువు కావాలని వొడాఫోన్–ఐడియా కోరింది. బీఎస్ఎన్ఎల్లో వీఐ విలీనం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రతి టెలికం సర్కిల్లో కనీసం నాలుగు టెలికం కంపెనీలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనీ, లేకపోతే ఒకటి, రెండు కంపెనీల పెత్తనం కొనసాగి, టెలికం రంగమే కొందరి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనీ, బీఎస్ఎన్ఎల్కు 4జీ సర్వీసులు ఇంకా లేవు కనుక 4జీ సౌకర్యం కల్పిస్తున్న వీఐని వినియోగించుకుంటే రెండు కంపె నీలకూ మేలు జరుగుతుందని కొంతమంది టెలికం రంగ నిపుణులు సూచిస్తు న్నారు. ఈ ఆలోచనను బీఎస్‌ఎన్‌ఎల్‌లోని కొన్ని యూనియన్లు, అసోసి యేషన్లు సమర్థిస్తున్నాయి. కొన్ని నిజాలను పరిశీలిస్తే బీఎస్ఎన్ఎల్ అప్పు కేవలం రూ. 26,000 కోట్లు కాగా, వొడాఫోన్–ఐడియా అప్పు రూ. 1,80,000 కోట్లు. 2022లో జరుగబోయే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో మరింత అప్పు చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ పథకం ద్వారా 80 వేల మంది ఉద్యోగులను సాగనంపడం ద్వారా ఏటా 8 వేలకోట్ల ఖర్చును బీఎస్ఎన్ఎల్ తగ్గించుకుంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిం చారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. కానీ వొడాఫోన్– ఐడియా చైనాకు చెందిన హువవాయ్, జడ్టీయూ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం తోనే 4జీ ఇస్తోంది. కనుక వొడాఫోన్–ఐడియాతో బీఎస్ఎన్ఎల్ కలిసి పనిచేయ డానికి ఇది ఒక అడ్డంకి. పైగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో గతంలో విదేశీ సంచార నిగమ్ మొత్తం ప్రైవేటుపరం అయిన అనుభవాలు తెలుసు. కాబట్టి వొడాఫోన్–ఐడియాను బీఎస్ఎన్ఎల్లో కలిపే ఆలోచన ప్రభుత్వం చేయకూడదనే ఆశిద్దాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు ‘ మొబైల్: 94405 24222 -
వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్ క్వార్టర్లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. -
5వేల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి,ముంబై: వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనంతో దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతోంది. అయితే ఈ మెగా మెర్జర్ ఇరు సంస్థలకుచెందిన ఉద్యోగులపై వేటుకు దారి తీయనుంది. వోడాఫోన్-ఐడియా విలీనం ద్వారా ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో భారీ తొలగింపులు చోటు చేసుకోనున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, సామర్థ్యాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా రాబోయే నెలల్లో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవచ్చని నివేదించింది. ఇరు సంస్థల్లో కలిపి 21వేల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 5వేలమందిపై వేటుపడే అవకాశాలున్నాయని రిపోర్ట్ చేసింది. ఉమ్మడి సంస్థ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే సందర్భంలో రుణాలు మార్జిన్ ఒత్తిళ్లతో అనవసర ఉద్యోగులను భరించాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించడం ఈ అంచనాలకు ఊతమిచ్చింది. ముకేష్ అంబానీ యాజమాన్యం రిలయన్స్ జియో ప్రవేశం టెలికాం రంగాన్ని భారీగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో వోడాఫోన్, ఐడియా కంపనీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా, వోడాఫోన్ విలీనానికి ముందుకు వచ్చాయి. జియో ఎఫ్టెక్ట్‌తో కుదేలైన టెలికాం రంగం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను తగ్గించుకుంది. తాజాగా మరో 5వేలమందికి ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఈ విలీన ప్రక్రియకు ఎఫ్‌డీఐ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మెర్జర్‌కు ముందే ఇరు సంస్థలు (వోడాఫోన్, ఐడియా) తమ బకాయిలు క్లియర్ చేయవలసిందిగా టెలికాం శాఖ కోరినట్టు తెలుస్తోంది. అలాగే టెలికాం రంగంలో ఎఫ్‌డీల అనుమతి పై హోం మంత్రిత్వ శాఖ నుండి ఆమోదంకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)కు రెండు వారాల క్రితం పంపించామని , స్పందనకోసం వేచి ఉన్నామని టెలికాం విభాగం అధికారి తెలిపారు. కంపెనీలోఎఫ్‌డీఐఐ పరిమితిని 100 శాతం పెంచాలని ఐడియా కోరిన సంగతి తెలిసిందే. -
వొడాఫోన్–ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లా
న్యూఢిల్లీ: త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్–ఐడియా సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది. -
మెగా విలీనం: 40కోట్ల యూజర్లు, 80 కోట్ల రెవెన్యూలు
మెగా విలీనానికి ఓకే చెబుతూ ఐడియా సెల్యులార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఈ సంస్థ అవతరించబోతుంది. వైర్ లెస్ సబ్స్క్రైబర్లలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ గా నిలువబోతుంది. ఇన్ని రోజులు వొడాఫోన్ రెండో స్థానంలో, ఐడియా మూడో స్థానంలో ఉండగా.. టెలికాం లీడర్ గా భారత్ ఎయిర్ టెల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. ఇటీవలే టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఇటు ఎయిర్ టెల్ స్థానాన్ని దక్కించుకుని, రిలయన్స్ జియో దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వొడాఫోన్, ఐడియాలు విలీనానికి తెరలేపాయి. ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది. స్పెక్ట్రమ్ డూప్లికేషన్ అరికడుతూ నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ డీల్ ఎంతో సహకరించనుందట. ఖర్చులు తగ్గడంతో ఈ సంస్థకు ఈబీఐటీడీఏ మార్జిన్లు 250-350 బేసిస్ పాయింట్లు మెరుగుపడతాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ముఖ్యంగా నెట్ వర్క్, మార్కెటింగ్ వ్యయాలపై ఖర్చులు తగ్గుతాయన్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ చాలా గట్టి పునాదులను ఏర్పరుచుకుంది. ఐడియా ఎక్కువగా రూరల్ మార్కెట్ పై ఫోకస్ చేస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రెండింటి కలయికతో 205 మిలియన్ వొడాఫోన్ యూజర్లు, 190 మిలియన్ ఐడియా యూజర్లు ఒకటై మొత్తం 40 కోట్ల సబ్‌స్క్రైబర్ బేసిస్ తో విలీన సంస్థ ఏర్పడుతోంది. మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది. ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.