BSNL Vodafone Idea Merger: అప్పుల బరువుతో విలీనమా? | Taranath Murala Article On BSNL Vodafone Idea Merger | Sakshi
Sakshi News home page

BSNL Vodafone Idea Merger: అప్పుల బరువుతో విలీనమా?

Published Wed, Aug 11 2021 12:38 AM | Last Updated on Wed, Aug 11 2021 12:38 AM

Taranath Murala Article On BSNL Vodafone Idea Merger - Sakshi

వొడాఫోన్‌–ఐడియా(వీఐ) కంపెనీని ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేస్తే సమస్య పరి ష్కారం అవుతుందా? వీఐకి 2018లో చైర్మన్‌గా ఎన్నికైన ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమారమంగళం బిర్లా కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఐడియా కంపెనీలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న హిమాంషు కాపారియా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వొడాఫోన్‌–ఐడియా ఆర్థిక కష్టాలలో పడటం, మార్చి 2022 లోపు రూ. 24,000 కోట్లు కట్టాల్సి ఉండటం, కొత్త అప్పులు పుట్టకపోవడం, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వల్ల అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూపై ఎక్కువ పన్ను కట్టాల్సి రావడం వంటి కారణాల వల్ల రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు బిర్లా వెల్లడించారు. 

టెలికం రంగంలో ఒకటి, రెండు కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగితే వినియోగదారునికి అన్యాయం జరుగుతుందనీ, కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, వీఐ కంపెనీని బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలపడం లేదా అప్పుల్ని ఈక్విటీలుగా మార్చడం, టెలికం శాఖకు కట్టాల్సిన వాయిదాలు చెల్లించే గడు వులు పెంచడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలనీ మొన్న జూన్‌లో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబాకు రాసిన లేఖలో కుమారమంగళం బిర్లా కోరారు. ఐడియా కంపెనీలో 2018లో విలీనమైన వొడాఫోన్‌ కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూపునకు 27 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 44 శాతం వాటాలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌ 7న కంపెనీ పేరును ‘వీఐ’గా మార్చారు. 

వొడాఫోన్‌కి దాదాపు రూ. 1,80,000 కోట్ల అప్పులున్నాయి. రాబోయే 10 ఏళ్లలో స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీల  కింద రూ. 58,254 కోట్లు, ఏటా రూ. 7,854 కోట్లు చెల్లించాల్సి ఉంది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ వేసే ఆలోచనలో వొడాఫోన్‌ ఐడియా ఉంది. ఇదే జరిగితే ఆ ప్రభావం ఎస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకులపై ఉంటుంది. మరోవైపు ‘డీఓటీ’కి వెంటనే చెల్లించాల్సిన రూ. 8,292 కోట్లు చెల్లించడానికి మరో ఏడాది గడువు కావాలని వొడాఫోన్‌–ఐడియా కోరింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఐ విలీనం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రతి టెలికం సర్కిల్‌లో కనీసం నాలుగు టెలికం కంపెనీలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనీ, లేకపోతే ఒకటి, రెండు కంపెనీల పెత్తనం కొనసాగి, టెలికం రంగమే కొందరి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనీ, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ సర్వీసులు ఇంకా లేవు కనుక 4జీ సౌకర్యం కల్పిస్తున్న వీఐని వినియోగించుకుంటే రెండు కంపె నీలకూ మేలు జరుగుతుందని కొంతమంది టెలికం రంగ నిపుణులు సూచిస్తు న్నారు. ఈ ఆలోచనను బీఎస్‌ఎన్‌ఎల్‌లోని కొన్ని యూనియన్లు, అసోసి యేషన్లు సమర్థిస్తున్నాయి. 

కొన్ని నిజాలను పరిశీలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్పు కేవలం రూ. 26,000 కోట్లు కాగా, వొడాఫోన్‌–ఐడియా అప్పు రూ. 1,80,000 కోట్లు. 2022లో జరుగబోయే 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో మరింత అప్పు చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ పథకం ద్వారా 80 వేల మంది ఉద్యోగులను సాగనంపడం ద్వారా ఏటా 8 వేలకోట్ల ఖర్చును బీఎస్‌ఎన్‌ఎల్‌ తగ్గించుకుంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయం ప్రకారం 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయిం చారు. కానీ ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం ప్రకారం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్‌ ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. కానీ వొడాఫోన్‌– ఐడియా చైనాకు చెందిన హువవాయ్, జడ్టీయూ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం తోనే 4జీ ఇస్తోంది. కనుక వొడాఫోన్‌–ఐడియాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కలిసి పనిచేయ డానికి ఇది ఒక అడ్డంకి. పైగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)లో వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో గతంలో విదేశీ సంచార నిగమ్‌ మొత్తం ప్రైవేటుపరం అయిన అనుభవాలు తెలుసు. కాబట్టి వొడాఫోన్‌–ఐడియాను బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలిపే ఆలోచన ప్రభుత్వం చేయకూడదనే ఆశిద్దాం.


మురాల తారానాథ్‌ 
వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు ‘ మొబైల్‌: 94405 24222

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement