టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం? | Taranath Murala Article On Telecom Sector Subsidy | Sakshi
Sakshi News home page

టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?

Published Mon, Sep 20 2021 1:32 AM | Last Updated on Mon, Sep 20 2021 5:43 AM

Taranath Murala Article On Telecom Sector Subsidy - Sakshi

టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? 

పూర్వరంగం
1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్‌డ్‌ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్‌ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్‌డ్‌ లైసెన్స్‌ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్‌ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. 

ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్‌డ్‌ లైసెన్స్‌ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్‌ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే  రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్‌ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది.  సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. 

రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్‌ఎస్‌ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం.  

తాజాగా కల్పించిన రాయితీలేమిటి?
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్‌ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్‌ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్‌ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్‌ సర్కిల్‌ ప్రకారం కాకుండా యావత్‌ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్‌ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్‌ వాపస్‌ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న  వొడాఫోన్‌–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది.      
               
ప్రజలకు ఏం ఉపయోగం?    
  
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్‌ పేరుతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్‌ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్‌–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు.          
                  
1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే  బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్‌ నెట్‌ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం.


మురాల తారానాథ్‌ 
వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement