ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్‌ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్‌ఎన్‌ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్‌లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్‌టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.
ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్‌టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్‌లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్‌ఎన్‌ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.
ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?
జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment