Subscriber Services
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
ఓటీటీ లవర్స్‌కు జియో సినిమా బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్‌ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్‌తో రూ.299 లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్స్క్రిప్షన్ హెచ్‌బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
యూజర్లకు షాక్.. మరింత కాస్ట్లీగా యూట్యూబ్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఆదాయమార్గాల్ని అన్వేషిస్తున్న యూట్యూబ్ పలు దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం ధరల్ని మరింత పెంచింది. పెంచిన ధరలతో యూట్యూబ్ కొన్ని దేశాల్లో మరింత కాస్ట్లీగా మారింది. వాటిల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఎక్కువ యాడ్స్ ఉంటే యూట్యూబ్‌కి ఆదాయం పెరుగుతుంది. అయితే, యూజర్లు యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు. దీంతో ఆదాయం తగ్గడంతో యాడ్ బ్లాకర్స్‌ని వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్ చేసేలా కొత్త మెకానిజంను తయారు చేసింది. ఈ టెక్నాలజీ రాకతో ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లను వినియోగించే వారికి ‘యాడ్ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని మెసేజ్‌లు పంపిస్తుంది. నవంబర్ 1 నుంచే అమలు తాజాగా, 9 టూ 5 గూగుల్ నివేదిక ప్రకారం.. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చీలీ,జర్మనీ, పోలాండ్, టర్కీ ఈ 7 దేశాలకు చెందిన యూజర్లకు యూట్యూబ్ మెయిల్స్ పంపింది. య్యూట్యూబ్‌లో ప్రీమియం ధరల్నిపెంచుతున్నట్లు ఆమెయిల్స్లో పేర్కొంది. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ సేవల్ని వినియోగిస్తున్న యూజర్లు మరో మూడు నెలల వరకు పాత సబ్స్క్రిప్షన్ ఛార్జీలను చెల్లించే అవకాశం కల్పిస్తూనే.. కొత్తగా వచ్చి చేరే పెయిడ్ యూజర్లు మాత్రం పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పింది. అయితే, పెంచిన ధరలు ఎంతనేది తెలియాల్సి ఉంది. భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ధరలు భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం ధరలు స్థిరంగానే ఉన్నాయి. సంస్థ ప్రస్తుతం చందాదారుల నుండి నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర రూ. 139, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ధర రూ. 399, ఏడాది సభ్యత్వానికి ధర రూ. 1,290ని వసూలు చేస్తుంది. తద్వారా యూజర్లు యూట్యూబ్‌లో వీడియోల్ని వీక్షించే సమయంలో ఎలాంటి యాడ్స్ డిస్ప్లే అవ్వవు. చదవండి👉 ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ -
Twitter Blue plans షురూ: ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే!
సాక్షి,ముంబై: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ ఇండియాలో బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ సేవల్ని లాంచ్ చేయగా తాజాగా ఇండియాలో కూడా మొదలు పెట్టింది .దీని ప్రకారం ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే ట్విటర్ చందాదారులు తమ ఖాతా ధృవీకరణకోసం ఈ బ్లూ టిక్ మార్క్‌ను పొందొచ్చు. ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం నిర్దేశిత చందా చెల్లించిన యూజర్లు ఎవరైనా బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. చందా చెల్లించిన అనంతరం ప్రొఫైల్ పక్కన బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూల్స్ ►బ్లూటిక్ మార్క్ పొందాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 ఖర్చు అవుతుంది. అలాగే వెబ్సైట్ సబ్స్క్రిప్షన్ కావాలంటే నెలకు రూ. 650 , సంవత్సరానికి రూ. 6800 చెల్లించాలి. ► బ్లూటిక్ మార్క్ పొందాలంటే దరఖాస్తు తేదీకి కనీసం 90 రోజులముందు ట్విటర్లో ఉండాలి. ► బ్లూటిక్కు సబ్‌స్క్రైబ్ చేసిన తర్వాత, ప్రొఫైల్ ఫోటో, డిస్ప్లే పేరు లేదా వినియోగదారు పేరుకు మార్పులు చేస్తే తిరిగి ఖాతా ధృవీకరించబడే వరకు వెరిఫికేషన్ మార్పు కోల్పోతారు. ఈ వ్యాలిడేషన్ సమయంలో ఎలాంటి మార్పులకు అనుమతి లేదు. ► వినియోగదారులు తమ ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ ముగియకముందే సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించాలి లేదా రద్దు చేసుకోవాలి. ఆటో రెన్యూవల్కి 24 గంటల ముందే రద్దు చేసుకోవాలి. లేదంటే ఇప్పటికే చెల్లించిన డబ్బు వాపసు లభించదు ► ప్రొఫైల్‌కు బ్లూ టిక్ మార్క్ వల్ల లాభాలు: చందాదారులు ట్వీట్లను రద్దు చేయడం, ట్వీట్లను సవరించడం, కొన్ని ఫీచర్లకు ముందస్తు యాక్సెస్, చాట్లలో ప్రాధాన్యత కలిగిన ర్యాంకింగ్‌లతో పాటు ఎక్కువ , అధిక నాణ్యత గల వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి అనేక సేవలను పొందుతారని ట్విటర్ వెల్లడించింది. ముఖ్యంగా ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటిక్ సబ్స్క్రైబర్లు మిగిలిన వారితో పోలిస్తే దాదాపు సగం ప్రకటనలనుంచి కూడా విముక్తి. అంతిమంగా ప్రీమియం ఫీచర్ల ద్వారా యూజర్లకు మరింత సౌలభ్యమైన సేవలను అందించడమే లక్ష్యం అని ట్విటర్ పేర్కొంది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అమెరికా కెనడా, జపాన్, ఇండోనేషియా, న్యూజిలాండ్, బ్రెజిల్,యూఏ సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రేలియాదేశాల్లో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అమల్లోఉంది. -
యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు!
చాట్ జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు గుబులు పుట్టించేలా వినియోగించడానికి అందుబాటులోకి రాకుండానే కేవలం రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. యూజర్లు వినియోగిస్తే రెండేళ్లలో గూగుల్‌ను దాటేస్తుందని టెక్ నిపుణుల అంచనా. ఈ తరుణంలో చాట్ జీపీటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, భారీగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల్ని అర్జించేందుకు ట్విటర్ తరహాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చాట్ జీపీటీ సంస్థ కాదు సాఫ్ట్వేర్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. ఈ సంస్థ కోఫౌండర్, సీఈవో సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ నిర్వహణ ఖర్చులు కంటి నీరు (eye-watering) తెప్పిస్తున్నాయి. యూజర్లు చేసే ఒక్కో చాట్‌కు కొన్ని సెంట్స్ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని భద్రంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్నాం. ఇది సరిపోదన్నట్లుగా మైక్రోసాఫ్ట్ మరో 10 బిలియన్ల పెట్టుబడులు పెట్టబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెరసీ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ట్విటర్ తరహాలో యూజర్లకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆల్ట్ మాన్ తెలిపారు. చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో పెయిడ్ వెర్షన్ సర్వీసుల్ని యూజర్లకు అందించనుంది. 'ప్రో' వెర్షన్‌తో చాట్‌జీపీటీ సేవల్ని యూజర్లకు అందిస్తే తద్వారా మాతృసంస్థ ఓపెన్ఏఐకి ఆదాయాన్ని అర్జించవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం పెయిడ్ వెర్షన్ ప్రారంభ దశలో ఉండగా..పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిన వెంటనే పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందించనుంది. -
ఎలాన్ మస్క్‌కు ఎంత కష్టం..ఎంత కష్టం, ట్విటర్‌ను అమ్మేస్తా..కొంటారా!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ భవిష్యత్ గందర గోళంలో పడింది. తాను కొనుగోలు చేసిన ధరకే ట్విటర్‌ను అమ్మేస్తానంటూ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ సంస్థలో ఏం జరుగుతుందో అర్ధం గాక ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో బిలియనీర్ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. కొనుగోలు అనంతరం బాస్ అవతారమెత్తిన మస్క్ ఆ సంస్థలో సమూల మార్పులు చేశారు. వాటిలో ఉద్యోగుల తొలగింపు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్ని వినియోగం లోకి తేవడం వంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆ సంస్థ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో తానెంతకైతే కొనుగోలు చేశానో .. మీరు కూడా అంతే మొత్తం చెల్లించి ట్విటర్‌ను సొంతం చేసుకోండి’ అంటూ పెట్టుబడి దారులకు మస్క్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే నివేదికలపై ట్విటర్ ప్రతినిధులు స్పందించలేదు. -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!
యూజర్లకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ షాకివ్వనుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఫ్యూయల్ కాస్ట్ పెరగడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో పాటు వేర్ హౌస్ షార్టేజ్ వంటి కారణాల్ని చూపిస్తూ కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని 43శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెజాన్ ప్రైమ్ ధరలు భారీగా పెరగనున్నాయి. పలు నివేదికల ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ధరల్ని పలు దేశాల్లో భారీగా పెరగనున్నాయి. పెరగనున్న దేశాల్లో భారత్ లేకపోవడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏడాది కాలం పాటు పెరగనున్న సబ్ స్క్రిప్షన్ ధరలు ఒక్కసారి చూస్తే ఫ్రాన్స్‌లో 43శాతం, ఇటలీలో 49.90శాతం, స్పెయిన్‌లో 39శాతం, యూకేలో 95శాతం, జర్మనీ లో 89.90 శాతం వరకు ఉండనున్నాయి. భారత్‌లో ఎప్పుడు పెరిగాయంటే ఇతర దేశాల్లో అమెజాన్ దాని సబ్ స్క్రిప్షన్ ధరల్ని పెంచినా భారత్‌లో మాత్రం పెంచలేదు. చివరిసారిగా మనదేశంలో గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభ దర రూ.129 నుంచి రూ.179కి పెంచింది. మూడు నెలల సబ్స్క్రిప్షన్ రూ.459, ఏడాదికి రూ.1499కి చేసింది. -
యూజర్లకు బంపరాఫర్..10రూపాయలకే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్!
మీరు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ను వినియోగిస్తున్నారా? ఇందుకోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. రూరల్ ఏరియాల్లో ఉండే యూజర్లు కేవలం 10 రూపాయిలు చెల్లించి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీని వీక్షించే సౌలభ్యం కలగనుంది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'పే నియర్ బై' సాచెట్ సబ్స్క్రిప్షన్ పేరుతో ప్రతి ఒక్క యూజర్లకు రూ.10కే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ..పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో "చాటింగ్, కంటెంట్,సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ డేటా ఒకేలా వినియోగిస్తున్నారు.రూరల్,సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో పోలిస్తే షాపింగ్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్, మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వినియోగంలో పట్టణ జనాభా ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. అందుకే రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ భారత్ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రూరల్ ఏరియా యూజర్లకు రూ.10కే ఒక మూవీని వీక్షించేలా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొని రానున్నాం. ఇందుకోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే తక్కువకే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. -
Netflix: నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్! ఐదేళ్ల తర్వాత..
Netflix India cuts prices across its streaming plans: భారత్‌లో యూజర్ల కోసం సబ్ స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్‌ను సవరిస్తూ.. తక్కువ ధరకే ప్యాకేజీలను అందించబోతోంది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య రేస్ రసవత్తరంగా మారనుంది. 199 రూపాయల బేసిక్ ప్లాన్‌ను.. కేవలం రూ. 149కే అందించనున్నట్లు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. అంతేకాదు మిగతా ప్యాకేజీలకు సైతం సవరణలు ఇచ్చింది. 2016లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అడుగుపెట్టగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత సబ్ స్క్రిప్షన్ ప్లాకేజీ రేట్లను తగ్గించడం విశేషం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ 149రూ. ప్లాన్‌ను.. 199కి పెంచిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ అదే మంత్లీ ప్లాన్‌ను 50రూ. మేర తగ్గించడం విశేషం. ►మొబైల్ ప్లాన్‌లో భాగంగా.. 149రూ. సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లో సింగిల్ మొబైల్ ఫోన్, ట్యాబ్‌లలో 480p(852×480 pixels) రెజల్యూషన్‌తో వీడియోలను వీక్షించొచ్చు. ►ఇక బేసిక్ ప్లాన్‌లో 199రూ. సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లో సింగిల్ మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీలలో ఒకేసారి చూడొచ్చు. ఇంతకు ముందు ఈ ఆఫ్షన్ 499రూ. ఉండేది. ►స్టాండర్డ్ ప్లాన్ 1080p క్వాలిటీతో 499రూ. (ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్‌ల్లో సైతం వీక్షించొచ్చు), .. ఇది ఇంతకు 649రూ. ప్లాన్‌లో అందించింది నెట్‌ఫ్లిక్స్. ►ప్రీమియం ప్లాన్‌లో బెస్ట్ 4కే ఫ్లస్ హెడ్‌డీఆర్ క్వాలిటీ కోసం 649రూ. ప్యాకేజీలు ఉన్నాయి. ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి నాలుగు వేర్వేరు డివైజ్‌లలో వీక్షించొచ్చు. Aap @aliaa08 se convince ho gaye ya hum aur bole? 👀#HappyNewPrices are here, which means you can now watch Netflix on any device at ₹199 and on your mobile at ₹149! pic.twitter.com/zdHrPlTJhi — Netflix India (@NetflixIndia) December 14, 2021 ఇప్పటికే ఉన్న యూజర్లకు అప్‌గ్రేడ్ ఫీచర్‌ను ఇవాళ్టి(మంగళవారం, డిసెంబర్ 14 2021) అందించనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు, మీరు బేసిక్ ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉంటే, మీరు అప్‌గ్రేడ్‌ను తిరస్కరించవచ్చు మరియు కొత్త ప్లాన్‌ను తగ్గింపు ధరలకు పొందవచ్చు. క్వాలిటీ స్ట్రీమింగ్ సర్వీస్ ఓటీటీగా పేరున్న నెట్‌ఫ్లిక్స్.. అధిక ప్యాకేజీల పట్ల ఇంతకాలం యూజర్లలో అసంతృప్తి ఉండేది. అయితే తాజా నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరికొందరు యూజర్లు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక సరిగ్గా అమెజాన్ ధరల పెంచిన టైంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. చదవండి: నెట్‌ప్లిక్స్ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..! -
ఓటీటీ యూజర్లకు శుభవార్త...!
ఓటీటీ యూజర్లకు డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్తను అందించింది. యూజర్లను పెంచుకోవడం కోసం డిస్నీ+హాట్‌స్టార్ తాజాగా కొత్త సబ్స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఈ సబ్స్క్రిప్షన్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ప్రస్తుతం వీఐపీ సేవలను సంవత్సరానికి రూ. 399 అందిస్తుండగా, డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియమ్ సేవలను రూ. 1499కు అందిస్తోంది. తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ రూ.499లకు కొత్త మొబైల్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సేవలను పొందవచ్చును. కాగా ఈ కొత్త ప్లాన్ కేవలం ఒక్క యూజర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో హెచ్డీలో వీడియోలను చూడవచ్చును. డిస్నీ+హాట్‌స్టార్ మరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ. 899ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌తో ఇద్దరు యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్ సేవలను ఒకేసారి పొందవచ్చును. మూడో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర సంవత్సరానికి రూ. 1,499 ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఒకేసారి నలుగురు యూజర్లు ఒకేసారి వీడియోలను చూడవచ్చును. అంతేకాకుంగా 4కే స్ట్రీమింగ్ కూడా మద్దతు ఇస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న వీఐపీ ప్లాన్ రూ. 399, నెలకు రూ. 299 డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. -
యాపిల్ సంచలనం : ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీస్
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెరతీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాల కనుగుణంగానే గేమింగ్, న్యూస్, టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకు వస్తామని ప్రకటించింది. ప్రధానంగా యాపిల్ ఆర్కేడ్ పేరుతో వీడియో గేమ్ సర్వీసులను ఆవిష్కరించింది. సబ్స్క్రిప్షన్ ద్వారా పనిచేసే ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీసని యాపిల్ ప్రకటించింది. 100కుపైగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవ్వన్నీ కేవలం యాపిల్ డివైస్‌లకు మాత్రమే ప్రత్యేకం. -
యూట్యూబ్ మ్యూజిక్ సేవలు కాస్ట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే పాపులర్ మ్యూజిక్ సర్వీసులను అందిస్తున్న యూ ట్యూబ్ కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రకటించింది. ఆన్లైన్ మ్యూజిక్ సెక్టార్లో పెరుగుతున్న పోటీని క్యాష్ చేసుకునే వ్యూహంలో ఈ నెల 22న దీన్ని అధికారికంగా లాంచ్ చేయనుంది. ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలో మార్కెట్లను ఏలుతున్న ఆపిల్ మ్యూజిక్, స్పాటీఫై, సావన్ లాంటి సంస్థలకు పోటీగా తాజా యూ ట్యూబ్ మ్యూజిక్, యూ ట్యూబ్ ప్రీమియం అనే రెండు సర్వీసులను లాంచ్ చేయనుంది. తద్వారా ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్నసేవలను సభ్యత్వ ఆధారిత సేవలుగా మారుస్తోంది. మ్యూజిక్ సేవలను రీబ్రాండింగ్ చేయడ ద్వారా ప్రత్యర్థి సంస్థలకు సవాల్ విసురుతోంది. యూట్యూబ్ సంస్థ తీసుకు వస్తున్న యూ ట్యూబ్ మ్యూజిక్‌లో కేవలం ఆడియో మాత్రమే ప్లే అయ్యే విధంగా ప్లాన్ చేసింది. దీంతో బ్యాండ్‌విడ్త్ ఆదా అవుతుందని సంస్థ భావిస్తోంది. అలాగే కేవలం యూట్యూబ్ లో ఉన్న వీడియోలు మాత్రమే కాదు, ఇతర పెద్ద మ్యూజిక్ కంపెనీల నుండి మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం కోసం యూట్యూబ్ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది. అంటే ఆ పాటలన్నింటిని ఈ సర్వీస్ ద్వారా ప్లే చేసుకుని వినవచ్చన్నమాట. అయితే ఇందుకు సబ్‌స్క్రైబ్ చేసువాల్సి ఉంటుంది. నెలకు సుమారు 680 రూపాయలు(10-12 డాలర్లు) ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక యూ ట్యూబ్ వీడియోను యాడ్ ఫ్రీగా వీక్షించాలనుకునే వారినుద్దేశించి తీసుకొస్తున్న మరో ఆప్షన్ ప్రీమియం సర్వీసు. ఈ సర్వీసు కూడా సబ్స్క్రిప్షన్ ఆధారంగానే పనిచేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మెక్సికో, దక్షిణ కొరియాలో ఈ సేవలను మొదటగా ప్రారంభిస్తుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఆవిష్కరించనుంది. -
అందరికీ ఆసరా ‘స్వావలంబన్’
18-60 ఏళ్ల వారు చేరితే వృద్ధాప్యంలో పింఛను ఎన్పీఎస్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ యోగేశ్వరరావు వెల్లడి మాకవరపాలెం : వృద్ధాప్యంలో ఆసరా కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్’ పథకంలో అన్ని వర్గాల వారూ చేరవచ్చని న్యూ పింఛన్ సబ్‌స్క్రైబర్ సర్వీసెస్ (ఎన్పీఎస్) రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ పి.యోగేశ్వరరావు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటివరకు 50 వేల మంది ఈ పథకంలో చేరారని వెల్లడించారు. మాకవరపాలెం మండల కేంద్రంలోని కొత్తవీధిలో బుధవారం స్వావలంబన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో అన్ని మండలాల్లోనూ కార్యాలయాలు ప్రారంభించామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ ఆర్నెల్లలో ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వారు చేరవచ్చని వివరించారు. వారు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే కేంద్రం మరో రూ.వెయ్యి వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. అరవయ్యేళ్లు పూర్తయిన తరువాత వారికి పింఛను అందజేస్తామన్నారు. అలాగే రూ. 200 చెల్లిస్తే హెల్త్ కార్డు ఇస్తామని, దీంతో ఏడాది పాటు రూ. 2 లక్షల వరకు ఆ కుటుంబంలోని వారు వైద్యం చేయించుకోవచ్చని వివరించారు. ఈ హెల్త్‌కార్డు పథకానికి 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసువారు అర్హులన్నారు. ఈ పథకాల్లో చేరదలచినవారు మండల కేంద్రాల్లోని ‘స్వావలంబన్’ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. అలాగే ఈ పథకాలపై నియమితులైన డివిజినల్ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. అలాగే గృహ వినియోగానికి 40 శాతం, వ్యవసాయ అవసరానికి 30 శాతం రాయితీపై సోలార్ ఇన్వెర్టర్లు అందజేస్తామని ఆయన చెప్పారు. స్థానిక డీవో ఆర్.బంగార్రాజు, నిర్వాహకుడు ఆర్.నాని, సర్పంచ్ ఇనపసప్పల మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.