అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్‌డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమాతోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు.
భారతదేశంలో అర్థిక రంగం కుదేలైపోయిందని, ఎన్నడూ లేనంత చీకట్లోకి మనం వెళ్లిపోయామని, ఇదంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల వల్లనే జరిగిందనీ ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు సానుభూతిపరులుగా వ్యవహరించే విశ్లేషకులు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ, వీడియోల్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ, అడిగిన వారికీ, అడగని వారికీ అందరికీ చెప్పాలని తహతహలాడుతున్నారు. మబ్బులు కమ్మినంత సేపూ సూర్య, చంద్రులు కనిపించరు. అలాగని వారు అసమర్థులైపోతారా? మబ్బుల్ని కూడా పక్కకు తీయలేనివాళ్లు అని అనగలమా? ఈ దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వారు ఈ అపనిందలను మోయాల్సి వస్తోంది. కానీ, అసలు వాస్తవాలను కాంగీయులు, బీజేపీ అంటే గిట్టని విశ్లేషకులు ఎంతకాలం తొక్కిపెట్టగలరు? సోనియా గాంధీ పుట్టిన దేశం ఇటలీతో పాటు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మృతదేహాలను రోడ్లపైనే వదిలేశారు. శ్మశానాల్లో చోటు దొరక్క కొత్తకొత్త శ్మశానాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఖననం చేసిన మృతదేహాలను తీసేసి శ్మశానాలను ఖాళీ చేశారు. వేలాది మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో వైద్య సేవలు లభించక చనిపోయారు. వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు చనిపోయారు. ఇవన్నీ చాలవన్నట్లు అసలు కరోనాయే అబద్ధం, లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేయాలి అంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు.
అలాంటి పరిస్థితులేవీ భారతదేశంలో లేవు. దానికి ఏకైక కారణం సకాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ విధించడమే. లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా ప్రజల్లో ఆయన కల్పిం చిన నమ్మకమే కోట్లాది మందిని కాపాడింది. ప్రపం చవ్యాప్తంగా కరోనా పేషెంట్ల రికవరీ రేటు అధి కంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారత్‌లో వంద మందికి కరోనా సోకితే సగటున 76 మంది త్వరగా కోలుకుంటున్నారు. కరోనా మరణాలు అత్యంత తక్కువగా ఉన్న దేశం భారతదేశం. లాక్‌డౌన్ విధించడం వల్ల భారతదేశంలో లక్షలాది ప్రజలు చనిపోకుండా కాపాడారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కితాబు ఇచ్చింది. లాక్‌డౌన్‌ను ఎగతాళి చేసిన బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు సైతం తర్వాతి కాలంలో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో ఆ దేశం ఎన్నో ఇబ్బందులు పడుతోంది ఇప్పటికీ. అగ్రరాజ్య మైన బ్రిటన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ, భారతదేశం మాత్రం తక్షణం స్పందించి పీపీఈ కిట్లు సహా అన్ని అత్యవసర మౌలిక సదుపాయాలనూ సొంతంగా తయారు చేసుకోగలిగింది. ఇవన్నీ, వాస్తవాలు. కానీ వీటిపై ఎక్కడా చర్చ జరగదు. జీడీపీపై వస్తున్న విమర్శల్లో ఈ వాస్తవాలకు స్థానం లేదు.
జీడీపీ పతనం కేవలం భారతదేశానికే పరిమిత మైందా? కరోనా మహమ్మారి మనం ఎవ్వరం ఊహించని, వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి. ఇలాంటి విపత్తును ప్రస్తుత తరం ప్రజలెవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాలూ దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రకటించిన ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే అన్ని అగ్రరాజ్యాల్లోనూ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అమెరికాలో 9.5 శాతం తగ్గగా, యురోపియన్ యూనియన్‌లో 14.4 శాతం, ఇటలీలో 17.3 శాతం, ఫ్రాన్స్‌లో 18.9 శాతం, బ్రిటన్‌లో 21.7 శాతం, స్పెయిన్‌లో 22.1 శాతం తగ్గుదల నమోదైంది. ఈ విషయం మన విమర్శకులకు తెలియదా? తెలిసినా కావాలని అసత్యాలనే ప్రచారం చేస్తున్నారా?
ఆర్థికంగా ఇబ్బందికరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలని లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి ముందే చెప్పిన మాట గుర్తు లేదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద లక్షా 70 వేల కోట్ల ఉపశమనాన్ని కేంద్రం ప్రకటించింది. పేదలకు ఆహారాన్ని, నగదును అందించింది. మహిళలకు, వృద్ధులకు, రైతులకు నగదు బదిలీ చేసింది. నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఇవన్నీ వాస్తవాలు కాదా?
అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్‌డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమా తోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు. పేదలు, కార్మికులు, ఉద్యోగులకు ఉపశమనాన్ని కలిగించడం, ఉద్యోగాలను కాపాడటమే ధ్యేయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకునే దిశగా జరుగుతున్నాయి. ఆర్థిక రంగం ఎలాగైతే కిందకు పడిందో అదే రీతిలో పైకిలేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా తిరిగి పుంజుకున్న దేశంగా భారతదేశం నిలబడుతుంది. ఇది నేను చెబుతున్న మాట మాత్రమే కాదు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు చెబుతున్న మాట కూడా. సమర్థవంతమైన నాయకత్వం మనకు ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ఉంది. అసత్యాలను ఎంతగా ప్రచారం చేసినా సత్యమే జయిస్తుంది.
పురిఘళ్ల రఘురామ్
బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment