బీఎస్‌ఎన్‌ఎల్‌కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం! | Murala Taranath Article On Govt May Hold 35 8 Stake In Voda Idea And Bsnl Privatisation | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!

Published Fri, Jan 21 2022 12:58 AM | Last Updated on Fri, Jan 21 2022 12:59 AM

Murala Taranath Article On Govt May Hold 35 8 Stake In Voda Idea And Bsnl Privatisation - Sakshi

వొడాఫోన్‌– ఐడియా కంపెనీలో కేంద్రం 35.8% వాటా పొందుతుందని, అలాగే టాటా టెలీలో కేంద్రం 9.5% వాటా పొందుతుందని ఆయా కంపెనీలు ప్రకటించాయి. టాటా టెలీ మహారాష్ట్ర కూడా తమ కంపెనీ కేంద్రానికి వాటా ఇస్తోందని పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రైవేటు టెలికాం కంపెనీలు లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ చార్జీలు కలిపి దాదాపు రూ.1,60,000 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని 10 ఏళ్లలో వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు, స్పెక్ట్రమ్‌ చార్జీలపై వడ్డీ చెల్లింపును ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు, బ్యాంకు రుణాలపై బ్యాంకు గ్యారెంటీ తగ్గింపు వంటి రాయితీలు కేంద్రం ఇచ్చింది. వొడాఫోన్‌–ఐడియా స్పెక్ట్రమ్‌ వడ్డీ రూపంలో దాదాపు రూ. 16,000 కోట్లు చెల్లించాలి. ఈ వడ్డీని చెల్లించలేమని, 2021 ఆగస్ట్‌ 14 నాటి షేరు రేటు ప్రకారం కేంద్రానికి 35.8% వాటా ఇవ్వాలని వొడాఫోన్‌ ఐడియా బోర్డు నిర్ణయించింది. ఇదే ప్రకారం టాటా టెలీ కంపెనీ తాము చెల్లించాల్సిన రూ.850 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి 9.5% వాటాను కేంద్రానికి కేటాయించాలని నిర్ణయించారు. 

 కేంద్రం ఈ విషయంపై వివరణ ఇస్తూ... టెలికాం కంపెనీలకు వాటాల కేటాయింపు కోసం ఎలాంటి డబ్బు చెల్లించడం లేదనీ, కేవలం వడ్డీ రూపంలో తమకు చెల్లించాల్సిన డబ్బును వాటా లుగా మార్చడానికి అంగీకరించామనీ, టెలికాం రంగంలో ఒకటి, రెండు కంపెనీలు ఉంటే గుత్తాధి పత్యం ఏర్పడి ధరలు పెరుగుతాయనీ, దాని నివారణకు ఈ చర్య అవసరమని పేర్కొన్నారు. ఆయా టెలికాం కంపెనీలకు ఉన్న అప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఆ విధంగా టెలికాం కంపెనీల నుండి హామీ పొందామని కమ్యూనికేషన్‌ మంత్రి తెలిపారు. వొడాఫోన్‌–ఐడియా టెలికాం కంపెనీలో కేంద్రానికి 35.8% వాటా ఉండగా, వొడాఫోన్‌కు 28.5%, ఆదిత్య బిర్లాకు 17.8% వాటాలు ఉంటాయి. ఆ రకంగా వొడాఫోన్‌ – ఐడియాలో కేంద్రానికి మెజా రిటీ వాటాలు లభిస్తాయి. కానీ మెజారిటీ వాటా కేంద్రానికి ఉన్నా ఆ కంపెనీని పాత యాజ మాన్యమే నిర్వహిస్తుందని కమ్యూనికేషన్లమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో వొడాఫోన్‌ – ఐడియాకు దాదాపు రూ. 1.95 లక్షల కోట్లు అప్పు ఉండటం గమనార్హం. 

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ద్రోహం
అప్పుల్లో ఉన్న  ప్రైవేటు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వెనుకాడని కేంద్రం... సొంత కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 3జీ స్పెక్ట్రమ్‌ ఇచ్చేందుకు దాదాపు 3 ఏళ్ళు ఆలస్యం చేసింది. దీనివల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు 4జీ స్పెక్ట్రమ్‌ ఇవ్వకుండా సాకులు చెబుతోంది. ప్రైవేటు టెలికాం కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు పెట్టని ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం భారత్‌లో తయారైన 4జీ టెక్నాలజీని మాత్రమే వాడాలని నిబంధనలు పెట్టింది. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశ వ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ నిర్మించడానికి భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్కు లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి రూ. 20000 కోట్ల విలువైన పనిని అప్పగించింది. ఇప్పుడు దీనిని పబ్లిక్‌ ప్రైవేటు పార్టిసిపేషన్‌ పేరుతో ప్రైవేటుకు అప్పగించి, బీబీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలిపేసి రూ.20000 కోట్ల కాంట్రా క్టును రద్దు చేసి నష్టం కలిగించింది.  బీబీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ నిర్వహణ భారం బీఎస్‌ఎన్‌ఎల్‌పై పడుతుంది. ఇది అదనపు భారం. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న 78,568 మంది ఉద్యోగు లను 2020 జనవరి 31న వీఆర్‌ఎస్‌పై ఇంటికి పంపిన కేంద్రం, కంపెనీకి వచ్చే నష్టాలకు ఉద్యో గుల ఖర్చే కార ణంగా చెప్పింది. నిజానికి దానికి ఉన్న అప్పు రూ. 30,000 కోట్లు మాత్రమే. వొడా ఫోన్‌ ఐడియాకు ఉన్న అప్పు దాదాపు రూ. 1,95,000 కోట్లు. అక్కడ మాత్రం నష్టాలకు, అప్పు లకు ఉద్యోగులను కారణంగా చూపకుండా లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒకే టెలికాం రంగంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకని, అందుకే ఎంటీఎన్‌ఎల్‌ నిర్వహణ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్ప గించామని పేర్కొన్న  కేంద్రం, ప్రైవేటు టెలికాం కంపెనీలలో వాటాలు తీసుకోవడానికి సిద్ధపడింది.

మరో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని కమ్యూనికేషన్ల మంత్రి పేర్కొన్నప్పటికీ, బీఎస్‌ఎన్‌ఎల్‌లో వ్యూహాత్మక భాగస్వామి చేరికకు, ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతోందా అన్న అనుమానం మాత్రం కలుగుతోంది. కేంద్రం సావర్న్‌ గ్యారెంటీతో రూ. 8,500 కోట్లు బాండ్ల రూపంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సమీకరించింది. బాండ్ల రూపంలో రుణం సమీరించారు కనుక నిబంధనల ప్రకార ం బీఎస్‌ఎన్‌ఎల్‌ను స్టాక్‌ ఎక్చేంజి బోర్డు ఆఫ్‌ ఇండియాలో లిస్ట్‌ చేయడం ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.

వ్యాసకర్త: మురాల తారానాథ్‌ 
 టెలికాం రంగ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement