మున్ముందు ఈ గొంతు వినిపించేనా? | Taranath Murala Article On Central Attitude Towards Telecom Company BSNL | Sakshi
Sakshi News home page

మున్ముందు ఈ గొంతు వినిపించేనా?

Published Thu, Jul 22 2021 12:22 AM | Last Updated on Thu, Jul 22 2021 12:22 AM

Taranath Murala Article On Central Attitude Towards Telecom Company BSNL - Sakshi

సొంత సంతానం మీద సవతి తల్లి ప్రేమ చూపడం అనే వ్యక్తీకరణ మీరు ఎప్పుడైనా విన్నారా? టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో కేంద్ర వైఖరికి ఇది సరిగ్గా సరిపోతుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కొత్త భావాలు పురుడు పోసుకుంటున్నాయి. కానీ అది మాత్రం పాత కంపెనీల ఉసురు తీస్తోంది. ప్రైవేటు టెలికం కంపెనీలు పాపం అప్పులు చెల్లించలేవని వారి కోసం తెగ బాధపడుతున్న కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు తానుగా చెల్లించాల్సిన బకాయిలు తీర్చే పుణ్యం మాత్రం కట్టుకోవడం లేదు. ఓ వైపు ప్రైవేటు కంపెనీలు 5జీ సేవలకు ఉరకలు ఎత్తుతుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో మాత్రం 4జీ సేవలకు పచ్చజెండా ఊపడానికే కేంద్రానికి చేతులు రావడం లేదు. ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొత్తగా టెలికం శాఖ బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రి గారు అయినా ఆ పాత ధోరణిని వదిలించుకుంటారేమో చూడాలి.

టెలికం రంగంలోకి 5జీ సేవలు రాబోతున్న తరుణంలో, ఇదివరకే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌(భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌), ఎంటీఎన్‌ఎల్‌ (మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌) మనుగడపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు లేవనీ, అప్పులు కూడా పుట్టడం లేదని చెప్పే ప్రైవేటు టెలికం కంపెనీలు ఓ వైపు; మరోవైపు డీఓటీ నుండి సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు రావాలన్న డిమాండ్లు, దాదాపుగా రెండేళ్లుగా ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియని స్థితిలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు; బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల భూముల అమ్మకం ద్వారా లక్ష కోట్లు ఆర్జించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశల నేపథ్యంలో కొత్త టెలికం మంత్రి బాధ్యతలు చేప ట్టారు. తన ముందున్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారాలు వెతకాల్సి ఉంది.

ప్రైవేటుపై ప్రత్యేక ప్రేమ
ప్రైవేటు టెలికం కంపెనీలు తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ చార్జీల లాంటివి చెల్లించలేక పోతున్నామనీ, కనుక తమకు ఈ పన్నులు చెల్లించడానికి మరింత గడువు కావాలనీ కోరుతున్నాయి. తగ్గుతున్న తమ ఆదాయాలు, నిర్వహణ ఖర్చుల్లో పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి అయ్యే ఖర్చులు దీనికి కారణంగా అవి చెబుతున్నాయి. ఇటీవల వొడా ఫోన్‌ ఐడియా సంస్థ తమకు పెట్టుబడులు కూడా రావడం లేదనీ, రుణం తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అడ్డంకులు ఉన్నాయనీ వాపో యింది. మొత్తం టెలికం కంపెనీల అప్పు ఆరు లక్షల కోట్ల రూపా యలు కాగా, అందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్పు కేవలం దాదాపుగా రూ. 25,000 కోట్లు మాత్రమే ఉండటం గమనించాలి. కానీ గౌరవ సుప్రీంకోర్టు, టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల బకాయిలను మూడునెలల్లో చెల్లించాలని తీర్పు ఇస్తే, కేంద్ర ప్రభుత్వమే ఒక పిటిషన్‌ వేసి టెలికం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని కనుక బకాయిలు చెల్లించడానికి 10 ఏళ్ల కాలపరిమితి ఇవ్వాలని వేడుకుంది. దీనికి కోర్టు అనుమతించింది. 

2జీ సేవల కోసం కోర్టుకు
ప్రైవేటు టెలికం కంపెనీలపై ఇంత ప్రేమ కురిపించిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 1–10–2000 నాడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటు చేసిన సమయంలో దానికి మహారత్న స్టేటస్‌ ఇస్తామనీ, గ్రామీణ సర్వీసుల నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామనీ, గ్రామీణ టెలికం సర్వీ సుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామనీ, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తామే ముందు ఉంటామనీ రాత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అనంతర కాలంలో తాను ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కింది. అన్ని టెలికం కంపెనీలకు సమాన హక్కులు ఉండాలన్న ప్రైవేటు టెలికం కంపెనీల ఒత్తిడికి తలవొగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల నిర్వహణకు ఇచ్చే ఏడీసీ చార్జీలను (యాక్సెస్‌ డెఫిసిట్‌ చార్జెస్‌), గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల అభివృద్ధికి ఇచ్చే యూఎస్‌ఓ (యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌) ఫండ్‌ నుండి ఇచ్చే నిధులను కూడా నిలిపివేసింది. అలాగే 2జీ మొబైల్‌ సర్వీసులు ప్రారంభించడానికి ప్రైవేటు టెలికం కంపెనీలకు 1994లో అనుమతి ఇవ్వగా, బీఎస్‌ ఎన్‌ఎల్‌ మాత్రం ఢిల్లీ కోర్టుకు వెళ్లి, కోర్టు తీర్పు ప్రకారం ప్రారం భించవలసి వచ్చింది.

ఐదో తరంలో 4జీ కోసం పోరు
2006 నాటికి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండవ స్థానంలో ఉండగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సంస్థపై కుట్రలు ప్రారంభమ య్యాయి. 3జీ టెండరుకు అడ్డంకులు సృష్టించారు. చైనా పరికరాల వినియోగంపై నిషేధం పేరుతో రెండేళ్ల పాటు ఆటంకాలు కల్పించి పోటీలో వెనుకబడేలా చేశారు. ఇప్పుడు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టెండర్‌ విషయంలో ఇదే పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోంది. 5జీ సర్వీసుల కోసం ప్రైవేటు టెలికం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ ట్రయల్‌ కోసం అనుమతులు ఇచ్చి, బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం ఇవ్వలేదు. 23–10–2019న కేంద్ర క్యాబినెట్‌ సంస్థకు 4జీ స్పెక్ట్రమ్‌ ఇచ్చినా ఇప్పటిదాకా అమలులోకి రాలేదు. మరోవైపు రిలయన్స్‌ జియో ఇటీ వలి తమ వార్షిక సమావేశంలో 5జీ సౌకర్యం ఉన్న ఫోన్‌ కేవలం 2,000 రూపాయలకే అందుబాటులోకి తెస్తామనీ, తమ 5జీ నెట్‌వర్క్‌ విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామనీ ప్రక టించింది.

కాంట్రాక్ట్‌ దిశగా...
31–1–2020 నాడు బీఎస్‌ఎన్‌ఎల్‌లో అమలైన వాలంటరీ రిటైర్మెంట్‌ పథకంలో 79,518 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు సంస్థలో ఇంకా కేవలం 62,000 మంది ఉద్యోగులే ఉన్నారు. సంస్థలో దేశవ్యాప్తంగా కాంట్రాక్టు మేనేజ్‌మెంట్‌ విధానం అమలు చేయడం ద్వారా, అన్ని ఆఫీసులు, కస్టమర్‌ సర్వీసు సెంటర్లు, ఫాల్టు రిపేర్లు లాంటివి ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా, రాబోయే రోజుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వ ప్రయత్నం.

బకాయిలు చెల్లిస్తే నిల్వలే
బీఎస్‌ఎన్‌ఎల్‌కు డీఓటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌) నుండి గ్రామీణ ఫోన్ల నిర్వహణ కోసం 13,789 కోట్ల రూపాయలు రావాలి. వైమాక్స్‌ స్పెక్ట్రమ్‌ సరెండర్‌ వల్ల రూ. 5,850 కోట్లు, సీడీఎంఏ (కోడ్‌ డివిజన్‌ మల్టిపుల్‌ యాక్సెస్‌) స్పెక్ట్రమ్‌ సరెండర్‌ వల్ల రూ. 2,472 కోట్లు, భారత్‌ నెట్‌ పథకం అమలు కింద రూ.1,051 కోట్లు, ఉద్యో గుల లీవు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 2,998 కోట్లు... ఇలా దాదాపు 29,540 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కు బకాయి ఉంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రభు త్వానికి చెల్లించాల్సిన బకాయిలు కట్టడానికి ఇబ్బందులు పడుతు న్నాయని కోర్టులో చెప్పిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు మాత్రం ఉద్యోగులే కారణమనీ, వారు అధికంగా ఉన్నారనీ పేర్కొంది. తాను దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్న సంగతి మాత్రం చెప్పలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్పు రూ. 25,000 కోట్లు. ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ. 30,000 కోట్లు చెల్లిస్తే సంస్థ నగదు నిల్వలోకి వస్తుంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ఒకవైపు 5జీ సేవలు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్న దశలో, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం 4జీ సర్వీసుల కోసం పోరాటం చేయాల్సి రావడాన్ని గమనించాలి. 4జీ బస్సు మిస్‌ కానివ్వనని పార్లమెంటులో అప్పటి సమాచార మంత్రి ఇచ్చిన హామీ ఏమైందో అర్థం కాదు. రైల్వే, టెలికం, ఐటీ శాఖలు ఒకే మంత్రికి ఇవ్వడం ఇదే ప్రథమం. గతంలో వీటికి విడివిడిగా మంత్రులు ఉండేవారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగే పనులను విజయవంతంగా గుజరాత్‌ రాష్ట్రంలో అమలు చేసిన కొత్త టెలికం మంత్రి, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే శాఖల్లో ఏమేమి మార్పులు చెయ్యడానికి పూనుకుంటారో, ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఏమిటో రాబోయే రోజుల్లో చూడాలి.


మురాల తారానాథ్‌ 
వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు
మొబైల్‌ : 94405 24222

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement