దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. కానీ ప్రతి మూడు పులుల్లో ఒకటి రిజర్వ్ ఫారెస్టుకు వెలుపల ఉండాల్సి వస్తోంది. ఇది మానవ–జంతు ఘర్షణలకు దారి తీస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల పులులు మాత్రమే కాక, అనేక జీవజాతులు కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయి. 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేర ఇతరులు చొరబడలేని స్థలం అవసరం. కానీ, మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో... అలాంటి సహజమైన అరణ్యాలను ఆశించడం ఆశావహమైన కోరిక మాత్రమే. వన్యప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేదికలు చెబుతున్నప్పటికీ మనం ఇప్పటికీ పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాము.
ఈ సంవత్సరం వార్తాయోగ్యమైన రెండు ఘటనలు జరిగాయి. ఒకటి – ప్రపంచంలోనే అత్యధిక జనాభా విషయంలో భారతదేశం చైనాను దాటేసింది. కేవలం 2 శాతం భూప్రాంతం కలిగిన దేశం 145 కోట్ల ప్రజలు లేదా విశ్వ మానవ జనాభాలో 18 శాతం మందికి ఆవాస ప్రాంతంగాఉంటోందని ఊహించండి. జనసాంద్రత రీత్యా, భారతదేశం... చైనా కంటే మూడు రెట్ల రద్దీతో ఉంటోంది. రెండు – భారతదేశంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణి రక్షణ పరిశ్రమ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏర్పడి ఈ ఏప్రిల్ నాటికి 50 ఏళ్లు దాటుతుంది. పెరుగుతున్న పులుల సంఖ్య విషయంలో రికార్డు అంచనాలు ఉన్నాయి. 2022 నాటి పెద్దపులుల జనాభా లెక్కలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పులుల సంఖ్య 3 వేలను దాటి ఉంటుందని ఒక అంచనా.
దేశంలో ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2014 నాటికి దేశంలో 2,226 పులులు ఉండగా, 2018లో వీటి సంఖ్య 2,967కి పెరిగిందని జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (ఎట్‌టీసీఏ) నివేదించింది. దేశంలో పులుల సంఖ్యలో అమాంతం 33 శాతం పెరుగుదల నమోదు కావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 2006లో పులుల జనాభా లెక్కల ప్రక్రియను శాస్త్రీయమైన బిగువుతో, కెమెరా ట్రాప్ టెక్నాలజీతో సరిదిద్దినప్పటి నుంచి నాలుగేళ్లకోసారి జరిపే పులుల జనాభా లెక్కల్లో సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి.
2006లో దేశంలో 1411 పులులు ఉండేవనీ, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పెరిగిందనీ ఎన్టీసీఏ అంచనా వేసింది. విజయవంత మైన పులుల పరిరక్షణ ఏర్పాట్లకు ఈ సంఖ్యలు సాక్ష్యంగా నిలుస్తు న్నప్పటికీ దీనిలో నాణేనికి మరో వైపు కూడా ఉంది. పులులు ఒంటరి జీవులు. వీటికి నిర్దిష్టంగా స్థలం అవసరం. పెద్దపులులు వాటితోపాటు సాధారణంగా వన్యప్రాణులు కూడా మానవులు గీసిన హద్దులు కానీ, మ్యాప్‌లను (జాతీయ పార్కులను, వన్యప్రాణి కేంద్రాలను లేదా టైగర్ రిజర్వ్‌లను) కానీ అర్థం చేసుకోవు. గత నెల అస్సాంలో, ఒక పులి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంబడి 120 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. ఒరాంగ్ నేషనల్ పార్కు నుంచి గౌహతిలోని ఉమానంద ద్వీపం వరకు అది నడిచివచ్చింది. 79 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న కీలకమైన ప్రాంతంలో ఉండే ఒరాంగ్, తనలో పెరుగుతున్న పులుల జనాభాకు తగినట్టు ఆశ్రయం ఇవ్వలేక కొట్టుమిట్టాడుతోంది. మానవుల ఆవాసానికి లోపలా, వెలుపలా పులులు తిరగడం రోజువారీ వ్యవహారం అయింది.
బిహార్ పశ్చిమ చంపారణ్ ప్రాంతంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ వంటి అతి పెద్ద రక్షిత ప్రాంతాలు కూడా ఇదే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దం క్రితం వాల్మీకి టైగర్ రిజర్వ్... పెద్ద పులుల సంరక్షణ మ్యాప్‌లో స్థానం కోల్పోయింది. కానీ బిహార్ అటవీ శాఖ, ఇతర లాభరహిత పరిరక్షణ సంస్థల ప్రయత్నాల కారణంగా ఇప్పుడది భారతదేశంలోనే అత్యుత్తమంగా పనిచేసే టైగర్ రిజర్వులలో ఒకటిగా నిలిచింది. 2021లో కన్జర్వేషన్ అస్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ (సీఏటీఎస్) గుర్తింపు పొందిన దేశంలోని 14 టైగర్ రిజ ర్వులలో ఒకటయ్యింది. పులుల పరిరక్షణలో ఉత్తమ ఆచరణలు, ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపు. అయితే ఈ విజయం అటు అటవీ శాఖకూ, ఇటు స్థానిక కమ్యూ నిటీకీ కొత్త తలనొప్పికి కారణమైంది. గత అక్టోబర్‌లో తొమ్మిది మంది ప్రజల హత్యకు కారణమైన మూడేళ్ల మగపులిపై కనిపిస్తే కాల్చివేత ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని కాల్చి చంపారు. జనవరి 10న ఈ ప్రాంతం నుంచే ఒక మైనర్ బాలికపై మరో పులి దాడి చేసిన ఘటన వార్తలకెక్కింది.
దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడంతో ప్రజలు పులులకు వ్యతిరేకంగా మారుతున్నారు. మన జాతీయ జంతువును కాపాడే మంచి పరిరక్షణ కృషికి వీరు వ్యతిరేకమవు తున్నారు. పెరుగుతున్న పులుల సంఖ్య పులుల పరిరక్షణ విజయానికి తిరుగులేని నిదర్శనం కాగా, అదే సమయంలో దానికి వ్యతిరేక పరి స్థితి కూడా రంగం మీదికొచ్చింది. ఎన్టీసీఏ అంచనా ప్రకారం చూసినప్పటికీ దేశంలోని ప్రతి మూడు పులుల్లో ఒకటి రక్షిత అభయా రణ్య ప్రాంతాల వెలుపల నివసిస్తున్నాయి. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం ఉన్న భారత్ అతిపెద్ద టైగర్ జనాభా కేంద్రంగా వెలుగుతోంది. 1973లో దేశంలో 9 టైగర్ రిజర్వులుఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 53కు పెరిగింది.
ఈ వెయ్యికిపైగా పులులను తరచుగా భారతదేశ నిరుపేద, నిరాశ్రయ పులులుగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడు దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండవచ్చు. కానీ వీటిలో ఎక్కువ భాగం మనుషులు నివసించే ప్రాంతాలే. ఇవి చిన్నవిగానూ, లేదా ముక్కచెక్కలైపోయిన అటవీ భాగాలుగా ఉంటూ వస్తున్నాయి. టైగర్ రిజర్వులు పులులకు, వన్యప్రాణులకు మాత్రమే సంబంధించినవని అందరూ ఊహిస్తుంటారు కానీ వాటిలో అనేక గ్రామీణ ఆవాసాలు ఉంటున్నాయి. వేలాది ప్రజలు, పశువులు ఉండటంతోపాటు రోడ్లు, రైలు పట్టాలు కూడా వీటిగుండా పోతుంటాయి. దీనికి పశ్చిమబెంగాల్ లోని బక్సా టైగర్ రిజర్వ్ ఒక మంచి నిదర్శనం అని చెప్పాలి.
కేంద్ర ప్రాంతంలో కనీసం 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేరకు ఇతరులు చొరబడకూడని స్థలం అవసరమవుతుందని రీసెర్చ్ డేటా సూచిస్తోంది. కానీ మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో, సహజమైన అరణ్యాలు కోరుకోవడం ఆశావహమైన కోరిక మాత్రమే. దానికి తోడుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రక్షిత ప్రాంతాలను అనుసంధానిస్తున్న అటవీ కారిడార్లు... మనుషులు, వన్యప్రాణుల మధ్య ఇరుకైన స్థలాన్ని మాత్రమే మిగుల్చుతున్నాయి. భారతదేశ స్థానిక ప్రజలు, వెనుకబడిన కమ్యూనిటీలు సాంస్కృతికంగా, సామా జికంగా, ఆర్థికంగా ఈ రిజర్వు ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ లోపల, వెలుపల నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న అటవీ ఏనుగులతో కూడా వ్యవహరించాలి. ఉమరియా జిల్లా (బాంధవ్‌గఢ్) ప్రజలకు తరతరా లుగా ఏనుగులతో తలపడిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మాత్రం మానవులు–పులులు, మానవులు–ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితులు రావడం వన్యప్రాణుల పరిరక్షణలో కీలకమైన సవాలుకు దారితీస్తోంది.
పెరుగుతున్న పులుల సంఖ్యలు మాత్రమే విజయానికి కొల బద్దగా ఉంటున్న సమాజంలో పులుల సంఖ్య క్షీణించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు. ప్రకృతి మనకు విధిస్తున్న పరిమితులను గుర్తించి మసులుకోవడం మనకు సాధ్యం కావడం లేదు. వన్య ప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేది కలు చెబుతున్నప్పటికీ మనం పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాం. పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఖడ్గమృగాల వంటి జీవుల సంఖ్య పట్ల మన ఆసక్తి పెరుగుతోంది. దేశంలో మరిన్ని ప్రాంతాలు శీఘ్రంగా నగరీకరణకు గురవుతుండడంతో... మన నగరాల అంచుల్లో, తగ్గిపోతున్న అడవుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఎస్టేట్‌లలో పులులు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒక్క పులులే కాదు... ఈ మారుతున్న ప్రపంచంలో తమ ఉనికి కోసం అనేక జీవజాతుల పరిస్థితీ అదే!
ఆనంద బెనర్జీ
వ్యాసకర్త రచయిత, ఆర్టిస్ట్, వన్యప్రాణి పరిరక్షణవాది
(‘ది హిందుస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment