Procedure Of Appointment Of High Court Judges, Know Details Inside - Sakshi
Sakshi News home page

మారువేషంలో కొలీజియంలోకా?

Published Sat, Jan 21 2023 12:28 AM | Last Updated on Sat, Jan 21 2023 9:03 AM

Procedure of Appointment of High Court Judges - Sakshi

అసలంటూ ప్రస్తుతం ఉనికిలోనే లేని ‘శోధన, మూల్యాంకన కమిటీ’లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారువేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయ మూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల కోసం ‘శోధన, మూల్యాంకన కమిటీ’ (సెర్చ్‌ కమ్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ)ని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చర్చించేముందుగా మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ అనేది ఉనికిలో లేదని గమనించాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకూ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజయం సిఫార్సు చేస్తుంది.

శోధన, మూల్యాంకన కమిటీ అవసరం ఇప్పుడు ఉందా? సమాధానం నిశ్చయాత్మకంగా అవును అన్నట్లయితే, అలాంటి కమిటీ పొందిక ఎలా ఉండాలి అనేది మరో ప్రశ్న. హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే తాను పనిచేసే హైకోర్టులో ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియ మించే సందర్భంలోనే సుప్రీంకోర్టులో రాష్ట్రాల భౌగోళిక ప్రాతి నిధ్యాన్ని లెక్కిస్తారు. కాబట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రాతి పదిక ఇప్పటికే స్పష్టంగా ఉంది. కాబట్టి, కొత్తగా శోధన, మూల్యాంకన కమిటీ అవసరం లేదని తెలుస్తున్నది. దీనికి బదులుగా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి చేసే నియామకాలకు ప్రాతిపదిక అవసరం.

పరిధి ప్రాతిపదికను పరిగణించే అవకాశం పైన చెప్పినట్టుగా పరిమితం. కాబట్టి కేంద్ర మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ ఈ సంప్రదాయానికి చేసే జోడింపు పెద్దగా లేదనే చెప్పాలి. ఇక జడ్జీల పనితీరు మూల్యాంకనం కూడా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల విధి. సుప్రీంకోర్టుకు నియమించాల్సిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల బాగోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చక్కగా మూల్యాంకన చేయగలరు. దీన్ని పక్కనబెడితే, న్యాయ నిర్ణయాలు చాలా తరచుగా సుప్రసిద్ధ న్యాయ పత్రికల్లో తీవ్రమైన విద్యాత్మక విమర్శలకు గురవుతుంటాయి. న్యాయమూర్తుల మూల్యాంకనకు ఇది సుపరిచితమైన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధన, మూల్యాంకన కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారు వేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి.

స్పష్టంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికా రాల విభజన సూత్రాన్ని న్యాయమంత్రి తాజా సూచన ధ్వంసం చేస్తుంది. ఈ అధికారాల విభజన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల్లో న్యాయవ్యవస్థ మాత్రమే, ప్రభు త్వాన్ని ఎన్నుకున్న మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రతితులనాత్మకంగా ప్రభుత్వ పనితీరు పట్ల నిరోధ సమతౌల్యాన్ని అందించగలదు. ప్రభుత్వ పనితీరుకు నిరోధ సమతౌల్యంగా ఉండాల్సిన న్యాయ మూర్తుల నియామక కమిటీలో అదే ప్రభుత్వం భాగమైతే, ప్రభుత్వ ఇతర విభాగాలను తనిఖీ చేసే కోర్టు విధిని అది ధ్వంసం చేస్తుంది. ఇది ‘కోళ్ళగూటిలోకి నక్కను స్వయంగా ఆహ్వానించడమే’ అవుతుంది. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ మంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. 

సుప్రీంకోర్టు ద్వారా ప్రకటితమైన చట్టాన్ని మార్చడానికి రెండు సుపరిచిత మార్గాలు ఉన్నాయి. మొదటిది, సముచితమైన శాసనం ద్వారా న్యాయస్థానం అన్వయించిన తీర్పు ప్రాతిపదికనే మార్చి వేయడం. రెండో మార్గం ఏమిటంటే, విస్తృత ధర్మాసనం ద్వారా ఆ తీర్పును తోసిపుచ్చడానికి ప్రయత్నించడం. ప్రభుత్వం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికీ పూనుకోలేదు. బదులుగా, భారత ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయ త్నంలో,  మొత్తంగా న్యాయవ్యవస్థ చట్టబద్ధతనే రద్దుపరిచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూండటం గమనార్హం.

న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తూ ఉన్నట్లయితే, న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తోసిపుచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఏదీ అడ్డుకోలేదు. అయితే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేపట్టడం లేదు. అసలు అలాంటి చట్టాన్ని రూపొందించే అవసరాన్నే ప్రభుత్వం పరిగణించలేదు. ఎందుకంటే, ప్రభు త్వంతో సంప్రదింపుల తర్వాతే నియామకాలను చేపడుతున్న పక్షంలో అలాంటి న్యాయమూర్తులతో ప్రభుత్వం ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ వస్తోంది. రాష్ట్రపతి ఆదేశంతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గానీ, న్యాయమూర్తులను గానీ కొలీజియం సిఫార్సు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాగే కొలీజియం చేసిన ఏ సిఫారసు అయినా ప్రభుత్వానికి అసౌకర్యంగా మారి వ్యతిరేకించిన పక్షంలో అలాంటి సూచనలను న్యాయవ్యవస్థ వెనక్కు తీసుకోవడం కూడా జరిగేది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్నికైన జస్టిస్‌ ఎన్వీ రమణ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎంపికైన చివరి న్యాయమూర్తి కావడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే నియ మితులవుతూ వచ్చారు.

అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ఎంపిక ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని ఇక్కడ సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. ముఖ్యంగా, హైకోర్టుల నియామకాల కోసం ప్రాతిపదిక గురించి న్యాయ మంత్రి తాజా లేఖ పేర్కొనడం లేదు. సమస్య ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. న్యాయమూర్తులను నియమించే దశలోనే శోధన, మూల్యాంకనకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే న్యాయమూర్తులతో కూడిన కమిటీనే దాన్ని చేపట్టాలి. న్యాయమూర్తుల నియామకాలకు నిర్దిష్ట ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికను ముందుగానే ప్రకటించి ప్రచురించాలి.

అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిని న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి సరైన మార్గం ఏదంటే, ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంటున్న న్యాయమూర్తుల నియామక వ్యవస్థను అధిగమించడం. దానికిగానూ సంబంధిత అభ్యర్థులు తమ ఆసక్తిని వ్యక్తపర్చడానికీ, స్వయంగా నామినేషన్‌ దాఖలు చేయడానికీ అనుమతించాలి. అప్పుడు మాత్రమే జడ్జీల నియమాకానికి చెందిన పరిగణన పరిధి విస్తృతం అవుతుంది. ప్రజలకు బహిరంగంగా తెలుస్తుంది కూడా. స్వీయ నామినేషన్‌ వ్యవస్థ మాత్రమే వర్గం, కులం, జాతి, లైంగిక ధోరణికి సంబంధించిన వైవిధ్యతకు హామీ ఇస్తుంది. ధర్మాసనంలో మనం చూడవలసిన బహుళత్వం, వైవిధ్యం గురించి అర్థం చేసు కోవడానికి అది వీలు కలిగిస్తుంది.

ఇందిరా జైసింగ్‌ 
వ్యాసకర్త సీనియర్‌ న్యాయవాది,
భారత మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement