అంబేడ్కర్‌ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు! | Katti Padma Rao Comment on Provisions of the Constitution of India | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు!

Published Sat, Feb 4 2023 3:47 AM | Last Updated on Sat, Feb 4 2023 3:47 AM

Katti Padma Rao Comment on Provisions of the Constitution of India - Sakshi

సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండా పోతోంది. అతి కొద్దిమందిగా ఉన్న అత్యధిక సంపన్నులను ఒక వైపు, అత్యధికులైన అతి పేదలను మరొక వైపు చూస్తున్నాం. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమానతలూ తొలగాలని అంబేడ్కర్‌ అన్నారు. అలాగే దేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే రాజ్యాంగ లక్ష్యమని బాబాసాహెబ్‌ స్పష్టంగా ప్రకటించారు. ఆ మార్గంలో నడవడం మన పాలకుల ధర్మం.

భారతదేశాన్ని ఎందరో పరిపాలించారు. వారందరికీ భారతదేశం అర్థం కావాలని ఏమీ లేదు. ఆర్యులకు, యవనులకు, కుషానులకు, అరబ్బులకు, మొఘలు లకు, బ్రిటిష్‌ వాళ్ళకు కూడా భారతదేశం అర్థం అయ్యిందని చెప్పలేం. వారంతా మూలవాసుల్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారే. సామరస్యమూ, శాంతి, ప్రేమతో కూడిన మూలవాసుల భావన లను ధ్వంసం చేసే క్రమంలో వారంతా భారత చరిత్ర వక్రీకరణకు కారణం అయినవారే. ప్రస్తుత పాలకులు సైతం మన పూర్వ పాల కుల్లా నిజమైన సంస్కృతీ వికాసం మతవాదుల్లో ఉందనే నమ్ము తున్నారు. నిజానికి ఆ వికాసం హేతువాదులు, భౌతికవాదులు, అంబేడ్కర్‌ వాదులు, లౌకికవాదుల్లో వుంది. అసలు భారతదేశానికి మొదటి దర్శనం చార్వాక దర్శనం, రెండవ దర్శనం జైన దర్శనం, మూడు బౌద్ధ దర్శనం, నాలుగు సాంఖ్య దర్శనం. ఇవన్నీ నిరీశ్వర వాద దర్శనాలే. బౌద్ధ దర్శనం సాంఘిక సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. అది మూలవాసుల నుండి జనించింది. మాన వాళి పట్ల దయార్ధ్ర దృష్టితో మెలగడం కరుణ అనీ, సాటి వారి పట్ల సౌహార్ద్ర దృష్టిని కలిగి ఉండటమే మైత్రి అనీ, ఈ సౌశీల్య విధానాలు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పాటించాలనీ బుద్ధుడు ప్రబోధించాడు. వ్యక్తి నిర్మలత్వానికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధుని సిద్ధాంతాలు.. అప్పటి వరకు వైదిక సంస్కృతి ఆచరణలోకి తీసుకు వచ్చిన మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వ్యక్తి స్వార్థాన్ని, దుష్ట ప్రవర్తనను ఖండించి నూత్న సామాజిక దృక్పథాన్ని కలిగించాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండే భారతదేశం బౌద్ధ సంస్కృతిలో నడిచింది.

భారత రాజ్యాంగంలో అంబేడ్కర్‌ ఈ బౌద్ధ సూత్రాలనే పొందు పరిచారు. ఆ ప్రకారం.. ఏ మతానికి చెందిన పాలకులైనా ఆ మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలిగాని, దాన్ని రాజ్యం మీద రుద్దకూడదు. అయితే మతం, మతస్వేచ్ఛ గురించి చర్చించుకునే క్రమంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే లౌకిక భావంతో వ్యవహ రించాల్సిన ప్రభుత్వాలే మతతత్వాన్ని ప్రేరేపిస్తుండటం! మరోవైపు సుసంపన్నమైన దేశంగా పరిగణన పొందుతున్న మన నేలలో ఆకలి చావులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుల, మత, అసమానతలు నిరంతరం వృద్ధి చెందుతున్నాయనీ; అణచివేతలు, గృహహింస విపరీతంగా పెరిగిపోతున్నాయనీ సామాజిక సర్వేలు చెపుతున్నాయి. ఇదే సమ యంలో కార్పొరేట్‌ పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని కొన్ని శక్తులు యథేచ్ఛగా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్ని టినీ ప్రైవేటు వ్యక్తులకు అధీనం చేయడం వల్ల భారతదేశంలో దళిత బహుజన యువకులకు ఉద్యోగ వసతి గగన కుసుమం అయింది. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం మూలాన కాదు.

వ్యవసాయ ఉత్పత్తి ధరలు విప రీతంగా పడిపోవడం వల్ల. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతులు రుణగ్రస్థులయ్యారు. లక్షలాదిమంది జీవన వ్యవస్థలు కుంటుపడ్డాయి. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. ఈ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడటానికి బదులు పాలకులు వ్యవసాయ రంగం కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య (డబ్ల్యూటీఓ) షరతులు కూడ మన దేశ రైతాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. అధికార పార్టీ తన సంఖ్యాబలంతో పార్ల మెంటరీ కమిటీల పరిశీలనలు, పార్లమెంటరీ ప్రొసీజర్లు లేకుండానే చట్టాలకు దారి ఏర్పచుకుంటోంది. ముఖ్యమైన చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా గందరగోళాల మధ్యనే ఆమోదం పొందుతున్నాయి. అందుకే పార్లమెంట్‌లో అంతర్గత నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్‌ పట్ల తన జవాబుదారీతనం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. నూట పదకొండుమంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంట్‌లో సామాజిక న్యాయాన్ని సాధించటంలో నిరంతరం విఫలం అవుతున్నారు. మహిళా ఎంపీల హక్కుల పోరాట స్వరాలు నిష్ఫలం అవుతున్నాయి.  

సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండాపోతోంది. పేదలకు భూమి పంపకం లేదు. గిరిజనుల భూములకు రక్షణ లేదు. ఆదివాసుల జీవన ప్రమా ణాలు, విద్యా వైద్య వసతులు నానాటికీ కుంటుపడుతున్నాయి. రక్తలేమితో బాధపడుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది. గర్భవతులకు, వితంతువులకు సంరక్షణ లేదు. ఆర్థిక సామాజిక, రాజకీయ అంత రాలు ఎక్కువవుతున్నాయి. అతి కొద్ది మందిగా ఉన్న అత్యధిక సంపన్నులు ఒకవైపు, అత్యధికులైన అతి పేదలు మరొక వైపు అన్నట్లుగా ఉంది. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమా నతలూ తొలగాలని చెబుతూ అంబేడ్కర్‌... శ్రామికవర్గం హక్కులు, ప్రాతినిధ్యం, సాధికారతల గురించి చాలా నిశితమైన వివరణల్ని 1943 సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక సమ్మేళనంలో వ్యక్తపరిచారు. అందులోని చాలా అంశాల ఉల్లంఘన నేడు మనకు దృశ్యీకృతం అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కింద అత్యధికుల అభీష్టం మేరకు శాసన, పాలనా విధానాలు అమల వుతున్నాయి. 


ఎవరైతే సంఘానికి ఆర్థిక నిర్మాణాన్ని దేశ సామాజికత ఆధారంగా రూపకల్పన చేయదలిచారో... వారు ప్రాథమిక ఆవశ్యకతను విస్మరించకుండా తమ లక్ష్యాన్ని పూర్తిచేయాలని గుర్తుంచుకోవాలి. సంఘ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్దేశించాలన్న ప్రతిపాదన నిర్వివాదాంశం. ఆర్థిక నిర్మాణ విధానం ఎలా ఉండాలన్నదే మిగిలి ఉన్న ప్రశ్న. దానిని ఈ మూడు విధానాల నుండి ఎంపిక చేయాలి.
1. పెట్టుబడిదారీ విధానం, 2. సోషలిజం, 3. కమ్యూనిజం. మరి శ్రామికుల ఎంపిక ఎలా ఉండాలి? శ్రామికులు పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోలేరు, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకుంటే శ్రామికులు వారి స్వేచ్ఛను కోల్పో తారు. అందుకే వారి భవితవ్యానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ,
సంతోషాలు పొందడంలో ప్రజాస్వామ్య దేశాలు అవలంబించవలసిన మార్గాలు ఏంటంటే... ప్రభుత్వ అధికారాన్ని రాజకీయ రంగంలో తక్కువగా జోక్యం చేసుకోనివ్వడం; చాలా శక్తిమంతమైన వ్యక్తుల ఆధిక్యతను అణచటానికి సాధారణ శాసనాధికారాన్ని మేల్కొల్పి, తక్కువ శక్తిమంతమైన ఆర్థికరంగంపై అసంబద్ధమైన ఇబ్బందులను విధించకుండా ఉండడం.    

ఈ విధమైన అంబేడ్కర్‌ ఆలోచనలు రాను రాను భారతీయ సమాజాన్ని పున ర్నిర్మించడానికి అత్యవసరం అవుతున్నాయి. ఆయన రాజ్యాంగ రచనకు ముందూ, వెనుకా అన్ని తరగతుల ప్రజల జీవన ప్రమాణాలను దర్శించారు. ‘‘భారతదేశానికి అనేక మతాలు వచ్చాయి, అనేక మతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. అయితే ఏ మతా ధిపత్యంలోకీ భారతదేశం వెళ్లకూడదు. భారతదేశం లౌకిక రాజ్యంగానే మనగలగాలి. భారతదేశంలో ప్రతీ పౌరుడు ఒకే సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను రూపొందించిన రాజ్యాంగం అన్ని దిశలా ప్రతిఫలిస్తుంది’’ అని అంబేడ్కర్‌ భావించారు. రాజ్యాంగ రూపకల్పన కృషిలో అంబేడ్కర్‌ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే ఈ రాజ్యాగం లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ మార్గంలో నడుద్దాం.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement