
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే.
భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.
395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది.
7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి.
అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది.
రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.
భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.
అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.
– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401
(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment