ఏఐ, చిప్ డిజైన్, డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ కంపెనీల కొనుగోలు
ఆదాయాలు, వేల్యుయేషన్లు పెంచుకోవడమే లక్ష్యం
టెక్నాలజీ అంతరాన్ని పూడ్చుకునే వ్యూహం...
ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీ ఊపందుకోవడంతో చిప్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి.
ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్ లాజిక్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్‌లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
జోరుగా.. హుషారుగా...
గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ యాజ్–ఎ–సర్విస్ (సాస్) స్టార్టప్ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్ ఐటీ ఇంజినీరింగ్ సర్విసుల సంస్థ సైయంట్ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్ అజిమత్ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్ పరిశ్రమలో సైయంట్ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.
ఇక మరో మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్‌మెంట్ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్‌ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్‌లో 20 శాతం ఇన్ఫోసిస్‌కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్ ఈ ఏడాది జూలైలో చిప్ డిజైన్ స్టార్టప్ ఎక్సెల్‌మ్యాక్స్ టెక్నాలజీస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్ కూడా యూఎస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంపాక్టివ్‌ను కైవసం చేసుకుంది.
బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లకు ఇది దన్నుగా నిలుస్తోంది.
తాజా కొనుగోళ్లు ఇలా...
⇒ యాక్సెంచర్ – ఎక్సెల్‌మ్యాక్స్ (చిప్ డిజైన్)
⇒ ఇన్ఫోసిస్ – గెలాక్స్‌ఐ (స్పేస్ టెక్)
⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్)
⇒ జోరియంట్ – మ్యాపిల్‌ల్యాబ్స్ (క్లౌడ్ మేనేజ్‌మెంట్)
⇒ సైయంట్ – అజిమత్ ఏఐ (సెమీకండక్టర్)
⇒ పర్సిస్టెంట్ సిస్టమ్స్ – ఆర్కా (డేటా ప్రైవసీ)
Comments
Please login to add a commentAdd a comment