అదే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ద్వైపాక్షిక చర్చలు
కీలక రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్‌లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్‌లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు.
వేగం పుంజుకున్న పరస్పర సహకారం
భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు.
త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం
భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు.
4 అవగాహనా ఒప్పందాలు
సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు.
సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన
సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉగ్రవాదం పెను ముప్పు
ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి.
Comments
Please login to add a commentAdd a comment