న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్‌ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది.
విదేశీ ఇన్వెస్టర్లకు చోటు
నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.
నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్‌ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment