public offer
-
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
సెప్టెంబర్ మాసం... ఐపీఓల వర్షం!
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్‌లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్‌కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్‌తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల వెల్లువ... ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి. 2024 ఆగస్ట్‌లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. లిస్టింగ్‌లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్‌్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్‌కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్‌్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్‌లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్‌లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
ఎఫ్‌పీవోకు అదానీ ఎంటర్ప్రైజెస్ సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు రంగం సిద్ధం చేసింది. ఇందుకు రూ. 3,112 నుంచి రూ. 3,276 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇది తాజా ధరతో పోలిస్తే 10–15 శాతం తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 64 డిస్కౌంట్ ప్రకటించింది. రిటైలర్లు కనీసం 4 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై ఇదే గుణిజాల్లో దరఖాస్తు చేయవచ్చు. ఇష్యూ ద్వారా రూ. 20,000 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎఫ్‌పీవోగా నిలవనుంది. ఆఫర్ ఈ నెల 27న ప్రారంభమై 31న ముగియనుంది. నిధుల వినియోగమిలా: ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,869 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలపై అదానీ ఎంటర్ప్రైజెస్ వెచ్చించనుంది. మరో రూ.4,165 కోట్లను ఎయిర్‌పోర్టులు, రోడ్, సోలార్ ప్రాజెక్టు సంబంధ అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, రహదారుల అభివృద్ధి, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, డిజిటల్, మైనింగ్ డిఫెన్స్, తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించిన సంగతి తెలిసిందే. 7 విమానాశ్రయాలు ఏఈఎల్ ప్రస్తుతం నవీముంబైలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టుసహా ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలలో ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. రహదారులు తదితర మౌలిక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌పై 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 30కల్లా కంపెనీ రూ. 40,023 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి ఉంది. ఎఫ్‌పీవో వార్తల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 1.5% నీరసించి రూ. 3,585 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్‌కి యాంకర్
►ఇన్వెస్టర్ల నుంచి రూ.2,200 కోట్లు ►ప్రారంభమైన ఐపీఓ న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన బుధవారం..యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,226 కోట్లు సమీకరించింది. ఈ ఆఫర్లో బ్లాక్‌రాక్, కెనడా పెన్షన్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదాభి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్ఎస్బీసీ, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కొటక్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ తదితర 69 యాంకర్ ఇన్వెస్టింగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. ఈ సంస్థలకు రూ. 700 ధరపై 3.18 కోట్ల షేర్లను ఎస్బీఐ లైఫ్ కేటాయించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్పీ పారిబా కాడ్రిఫ్ల మధ్య జాయింట్ వెంచర్ అయిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేస్తున్న ఐపీఓలో ప్రమోటర్లు 12 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. రూ. 685–700 ప్రైస్‌బ్యాండ్‌తో ప్రారంభమైన ఐపీఓ సెప్టెంబర్ 22న ముగుస్తుంది. ఆఫర్ ద్వారా రూ. 8,400 కోట్లు సమకూరతాయని అంచనా. -
ఇందుకేనా డి–మార్ట్ దూకుడు!!
రిటైల్‌లో లిస్టెడ్ కంపెనీలు చాలా తక్కువ ♦ మెరుగైన నిర్వహణ సామర్థ్యం డి–మార్ట్ సొంతం ♦ ఈ విషయంలో ఫ్యూచర్ రిటైల్ వెనుకంజ... ♦ అందుకే ఇంత భారీ వాల్యుయేషన్: విశ్లేషకులు ముంబై: డి–మార్ట్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. పబ్లిక్ ఆఫర్‌తో ఇన్వెస్టర్లకు సిరుల పంట పండించిన ఈ సంస్థ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో హాట్ టాపిక్. డి–మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ధర మార్కెట్లో లిస్టింగ్ రోజే 100 శాతం పైగా ఎగబాకిన సంగతి తెలిసిందే. ఆఫర్ ధర రూ.299 కాగా... ప్రస్తుతం ఈ షేరు రూ.635 వద్ద ఉంది. ఈ షేరుకు ఇంత అధిక విలువ (వాల్యుయేషన్) సమంజసమేనా అన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల మదిని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే, పటిష్ట నిర్వహణ సామర్థ్యమే డి–మార్ట్ దూకుడుకు ప్రధాన కారణమని.. ఇదే రంగంలో పాతుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లోని సంస్థాగత రిటైల్ సంస్థలకు ఆద్యుడిగా పేరొందిన ప్యూచర్ రిటైల్ అధినేత కిశోర్ బియానీ... డి–మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ నుంచి చాలా నేర్చుకోవాలని కూడా పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్యూచర్ రిటైల్‌తో పోలిస్తే... దేశవ్యాప్తంగా బిగ్‌బజార్‌తో సహా విభిన్న బ్రాండ్లతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్... పరిమాణంలో చాలా పెద్దదే అయినా, నిర్వహణ సామర్థ్యంలో మాత్రం డి–మార్ట్‌కు ఆమడ దూరంలో ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తిని మోర్గాన్ స్టాన్లీ దీనికి ఉదాహరణగా చూపిస్తోంది. వార్షికంగా డి–మార్ట్‌కు ఇది 14 సార్లు ఉండగా.. ఫ్యూచర్ రిటైల్‌కు మాత్రం కేవలం రెండు సార్లే ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. దీనిప్రకారం... డి–మార్ట్ తన స్టోర్లలో ఉండే సరుకులను ఏడాదికి 14 సార్లు... అంటే ప్రతి 26 రోజులకు ఒకసారి క్లియర్ చేసి మళ్లీ నింపుతుండగా.. ఫ్యూచర్ రిటైల్ మాత్రం ఏడాదికి రెండు సార్లు... అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నింపుతోంది. ఇక నిర్వహణ మార్జిన్ విషయానికొస్తే.. ఫ్యూచర్ రిటైల్ది 3.2 శాతం మాత్రమే. డి–మార్ట్ 7.9 శాతంతో దూసుకెళ్తోంది. ప్రధానంగా అద్దెల వ్యయం భారీగా పెరిగిపోవడం ఫ్యూచర్ రిటైల్ మార్జిన్లు ఆవిరయ్యేలా చేస్తోంది. అదే డి–మార్ట్ విషయానికొస్తే.. చాలా వరకూ సొంత స్టోర్లను కలిగి ఉండటం లాభిస్తోంది. రిటైల్ స్టోర్‌లో ప్రతి చదరపు మీటర్‌కు ఫ్యూచర్ రిటైల్ ఆదాయం రూ.13,000 మాత్రమే కాగా, డి–మార్ట్ ఏకంగా రూ.24,000 చొప్పున ఆర్జిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ 244 నగరాలు, పట్టణాల్లో 300కు పైగా బిగ్‌బజార్, ఫుడ్‌బజార్, ఎఫ్‌బీబీ తదితర స్టోర్లను నిర్వహిస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.11,500 కోట్లు కాగా.. కేవలం 45 నగరాల్లో 118 స్టోర్లను మాత్రమే నిర్వహిస్తున్న డి–మార్ట్ మార్కెట్క్యాప్ దీనికి అందనంత ఎత్తులో రూ.40,000 కోట్ల పైకి ఎగబాకడం విశేషం. అన్నింటా ముందంజే... 2016 డిసెంబర్ చివరి నాటికి డి–మార్ట్ రుణ భారం రూ.1,409 కోట్లుగా ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 0.74 శాతం. ఇప్పుడు ఐపీఓ ద్వారా సమీకరించిన రూ.1,870 కోట్ల నిధుల్లో రూ.1,080 కోట్లను రుణాలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోనుంది. అంటే రుణ భారం భారీగా తగ్గి.. లాభదాయకత మరింత జోరందుకుంటుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్ వరకూ కంపెనీ రూ.301 కోట్ల నికర లాభం, రూ. 8,800 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ డెట్ టు ఈక్విటీ 0.6 శాతంగా ఉంది. ఇక ఇన్వెస్టర్లకు అత్యంత కీలకమైన రిటర్న్ ఆన్ ఈక్విటీలో (ఆర్ఓఈ–పెట్టుబడిపై రాబడి) కూడా డి–మార్ట్ 21.1 శాతంతో చాలా ముందుంది. ఫ్యూచర్ రిటైల్ ఆర్ఓఈ 15.5 శాతమే. ఇక ఫ్యూచర్ రిటైల్ ప్రస్తుత షేరు ధర రూ.243 ప్రకారం 32 రెట్ల పీఈతో ట్రేడవుతోంది. డి–మార్ట్ పీఈ చాలా అధికంగా (77 రెట్లు) ఉన్నప్పటికీ... వృద్ధి జోరు, సమర్థమైన వ్యాపార విధానం(మోడల్) వంటివి లెక్కలోకి తీసుకుని చూస్తే ఈ ప్రీమియం సమర్థనీయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర రంగాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. విమానయాన రంగంలో సమర్థమైన నిర్వహణ కలిగిన ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) అంత్యంత గరిష్టంగా 17 పీఈని కలిగి ఉంది. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు ఉన్న జెట్ ఎయిర్వేస్ పీఈ 9 మాత్రమే. దీనిప్రకారం.. ఫ్యూచర్ రిటైల్ కచ్చితంగా తన వ్యాపార నిర్వహణను మెరుగుపరుచుకోకపోతే... డి–మార్ట్‌తో వేల్యుయేషన్ పరంగా పోటీపడటం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకింత మక్కువ.. డి–మార్ట్ ప్రస్తుత షేరు ధర ప్రకారం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) అత్యంత భారీ స్థాయిలో 77 రెట్లుగా ఉంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే 77 రెట్ల అధిక రేటుకు ట్రేడవుతున్నట్లు లెక్క. ఈ స్థాయిలో ఇన్వెస్టర్లు ఈ షేరును కొనడం చాలా రిస్కుతో కూడుకున్నదేనని.. స్వల్పకాలానికి తక్కువ లాభాలకు మాత్రమే ఆస్కారం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. చాలా మంది నిపుణులు మాత్రం ప్రస్తుత ధర కంటే దిగువకు ఇప్పుడప్పుడే ఈ షేరు పడిపోయే అవకాశాలు చాలా తక్కువనేనని చెబుతున్నారు. అయితే, తక్షణం మరింత భారీ స్థాయిలకు కూడా వెళ్లకపోవచ్చని.. కంపెనీ ప్రస్తుత షేరు ధర స్థాయికి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) చేరుకునేవరకూ ఒక శ్రేణిలో (రేంజ్ బౌండ్) కదలాడవచ్చనేది వారి అభిప్రాయం. కొద్ది కాలం క్రితం అధిక వాల్యుయేషన్లతో ఐపీఓలకు వచ్చి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చిన థైరోకేర్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్ వంటి డయాగ్నోస్టిక్ కంపెనీలను వారు ఉదహరిస్తున్నారు. డి–మార్ట్ వంటి కంపెనీల అధిక వాల్యుయేషన్‌కు ప్రధానంగా ఆయా రంగాల్లో చాలా తక్కువ కంపెనీలు ఉండటం... నిర్వహణ పనితీరు చాలా బాగుండటం వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు ఓపిక తక్కువగా ఉంటుందని.. అందుకే వారు కొద్దిగా షేరు ధర పెరగ్గానే విక్రయించేందుకు సిద్ధపడతారు. అదే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా ఇలాంటి షేర్లను కొనుగోలు చేస్తుండటం వల్ల రేటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతూ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రాదు’ అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై
రూ. 2,000 కోట్ల సమీకరణపై దృష్టి ముంబై: డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సన్నద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు, యాజ మాన్యం, అండర్‌రైటల్లు మొదలైన వారు భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లయిన టాటా సన్స్, టెమాసెక్‌లకు ప్రస్తుతమున్న షేర్లను విక్రయంచడంతో పాటు కొత్తగా మరిన్ని షేర్లను జారీ చేయనున్నట్లు వివరించాయి. మోర్గాన్ స్టాన్లీ, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ సంస్థలు ఈ ఇష్యూని నిర్వహించనున్నాయి. టాటా గ్రూప్‌నకు సంబంధించి చివరిగా టీసీఎస్ 2004లో లిస్టయింది. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత టాటా స్కై లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. టాటా గ్రూప్‌లో లిస్టయిన కంపెనీల జాబితాలో ఇది 30వది కానుంది. గ్రూప్ చైర్మన్‌గా 2012లో వచ్చిన సైరస్ మిస్త్రీ చొరవతో టాటా స్కై ఐపీవో అంశం తెరపైకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల లాభం రూ. 1,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. టాటా స్కైలో టాటా సన్స్‌కు 51%, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కి చెందిన ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు 30%, సింగపూర్‌కి చెందిన టెమాసెక్‌కు 10%, టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు 9% వాటాలు ఉన్నాయి. -
సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూ: వొడాఫోన్
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్.. భారత్‌లోని తమ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రణాళికల్లో ఉంది. పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) జారీకి సరైన సమయం కోసం వేచిచూస్తున్నామని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో చెప్పారు. మంగళవారమిక్కడ గ్రూప్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ప్రస్తుతానికైతే మేం మా నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరడం, బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణపైనే అత్యధికంగా దృష్టిపెడుతున్నాం. కచ్చితంగా ఏదో ఒకరోజు ఐపీఓకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి నేనేమీ వ్యతిరేకం కాదు. మంచి సమయం చూసి లిస్టింగ్ నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని కొలావో పేర్కొన్నారు. కాగా, ఐటీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కూడా కొలావో కలిశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు, ఇందులో ప్రైవేటు రంగం భాగస్వామ్యం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసులో రూ.3,200 కోట్ల పన్ను చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి వొడాఫోన్‌కు ఇటీవలే ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాఖలు చేసిన ఈ కేసులో బాంబే హైకోర్టు వొడాఫోన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయకూడదని మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, హచిసన్ నుంచి వొడాఫోన్ వాటా కొనుగోలుకు సంబంధించిన కేసులో మాత్రం రూ.11,200 కోట్లకు పైగా పన్ను చెల్లింపు వివాదం ఇంకా కొలిక్కిరాలేదు.