ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన బుధవారం..
►ఇన్వెస్టర్ల నుంచి రూ.2,200 కోట్లు
►ప్రారంభమైన ఐపీఓ
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన బుధవారం..యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,226 కోట్లు సమీకరించింది. ఈ ఆఫర్‌లో బ్లాక్‌రాక్, కెనడా పెన్షన్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదాభి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, హెచ్‌ఎస్‌బీసీ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కొటక్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ తదితర 69 యాంకర్ ఇన్వెస్టింగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి.
ఈ సంస్థలకు రూ. 700 ధరపై 3.18 కోట్ల షేర్లను ఎస్‌బీఐ లైఫ్ కేటాయించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్‌పీ పారిబా కాడ్రిఫ్‌ల మధ్య జాయింట్ వెంచర్ అయిన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేస్తున్న ఐపీఓలో ప్రమోటర్లు 12 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. రూ. 685–700 ప్రైస్‌బ్యాండ్‌తో ప్రారంభమైన ఐపీఓ సెప్టెంబర్ 22న ముగుస్తుంది. ఆఫర్ ద్వారా రూ. 8,400 కోట్లు సమకూరతాయని అంచనా.