ఈ నెలలో 15కు పైగా పబ్లిక్ ఇష్యూలు
2010 నాటి 14 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యే చాన్స్...
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్‌లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.
వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్‌స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా.
ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్‌కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్‌తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల వెల్లువ...
ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి.
2024 ఆగస్ట్‌లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.
ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
లిస్టింగ్‌లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్‌్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్‌కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్‌్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్‌లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.
మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్‌లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment