రూ. 1.5 లక్షల కోట్లు... 75 కంపెనీలు
నిధుల వేట కోసం భారీ క్యూ..
ఈ ఏడాది ఇప్పటికే లిస్టింగ్స్; రూ.64,000 కోట్లకు పైగా సమీకరణ
2021 నాటి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే చాన్స్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి.
గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది.
సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!!
Comments
Please login to add a commentAdd a comment