First Cry
-
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్‌క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్‌క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్‌హోల్డర్‌గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్‌క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్‌క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్‌క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
ఫస్ట్‌క్రై నష్టాలు పెరిగాయ్.. ఏకంగా ఆరు రెట్లు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో బ్రెయిన్‌బీస్ సొల్యూషన్ లిమిటెడ్ నికర నష్టాలు భారీగా పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 486 కోట్లను తాకాయి. ఫస్ట్‌క్రై బ్రాండ్ ఓమ్నిచానల్ బిజినెస్ నిర్వాహక కంపెనీ అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 79 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రెట్టింపునకుపైగా ఎగసి దాదాపు రూ. 5,633 కోట్లకు చేరింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం 2021–22లో రూ. 2,401 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. వెరసి సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులున్న స్టార్టప్.. ఫస్ట్‌క్రై రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించిన స్టార్టప్‌ల జాబితాలో తాజాగా చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,568 కోట్ల నుంచి రూ. 6,316 కోట్లకు పెరిగాయి. కాగా.. కంపెనీ ఇటీవల పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో 90 కోట్ల డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీలో 40 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్ సంస్థ ఫస్ట్‌క్రైలో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 310 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్‌తో ఫస్ట్‌క్రై వేల్యుయేషన్‌ను 3.5–3.75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. 900 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ గతంలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు ఇంకా 800–900 మిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్‌క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్‌బ్యాంక్ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఫస్ట్ క్రై చేతికి ‘బేబీఓయే’
డీల్ విలువ రూ.361 కోట్లు న్యూఢిల్లీ: చిన్నారుల ఉత్పత్తుల విభాగంలో ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ ఫస్ట్‌క్రై, ఇదే రంగంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన ‘బేబీఓయే’ను సొంతం చేసుకోనుంది. చిన్నారుల ఉత్పత్తుల విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న ఫస్ట్‌క్రై ఈ డీల్‌తో మరింత బలమైన సంస్థగా అవతరించనుంది. బేబీఓయేను నగదు, స్టాక్స్ రూపంలో కొనుగోలు చేసేందుకు ఫస్ట్‌క్రై అంగీకరించిందని, ఈ డీల్ విలువ సుమారు రూ.361 కోట్లు అని ఎంఅండ్ఎం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలియజేసిన సమాచారంలో పేర్కొంది. డీల్ రూపం ఇలా... ఈ డీల్‌లో భాగంగా ఫస్ట్‌క్రై... మహీంద్రా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.354.6 కోట్ల విలువైన వాటాలను జారీ చేయనుంది. అలాగే రూ.7.5 కోట్ల నగదు చెల్లించనుంది. దీనికి అదనంగా ఫస్ట్‌క్రైకి చెందిన బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.226 కోట్ల మేర నిధులను మహీంద్రా గ్రూపుతోపాటు, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రైవేటు ఈక్విటీ ఫండ్ అడ్వెక్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు అయిన ఐడీజీ వెంచర్స్ తదితరుల నుంచి సమీకరిస్తుంది. బేబీఓయేకు ప్రస్తుతం 120 దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఫ్రాంచైజీ రూపంలో ఉన్నవి. ఇక ఫస్ట్‌క్రైకు దేశవ్యాప్తంగా 180 స్టోర్స్ ఉన్నాయి. ఈ రెండూ ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఇక తాజా డీల్ అనంతరం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆధ్వర్యంలోని దుకాణాలన్నింటినీ ఫస్ట్‌క్రై కింద ఫ్రాంచైజీ రూపంలో నిర్వహిస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో బేబేఓయేను మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.