![Adani Enterprises follow-on-public offer - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/19/ADANI.jpg.webp?itok=dGMZn0EM)
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు రంగం సిద్ధం చేసింది. ఇందుకు రూ. 3,112 నుంచి రూ. 3,276 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇది తాజా ధరతో పోలిస్తే 10–15 శాతం తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 64 డిస్కౌంట్ ప్రకటించింది. రిటైలర్లు కనీసం 4 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై ఇదే గుణిజాల్లో దరఖాస్తు చేయవచ్చు. ఇష్యూ ద్వారా రూ. 20,000 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎఫ్‌పీవోగా నిలవనుంది. ఆఫర్ ఈ నెల 27న ప్రారంభమై 31న ముగియనుంది.
నిధుల వినియోగమిలా: ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,869 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలపై అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెచ్చించనుంది. మరో రూ.4,165 కోట్లను ఎయిర్‌పోర్టులు, రోడ్, సోలార్ ప్రాజెక్టు సంబంధ అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, రహదారుల అభివృద్ధి, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ, డిజిటల్, మైనింగ్ డిఫెన్స్, తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించిన సంగతి తెలిసిందే.
7 విమానాశ్రయాలు
ఏఈఎల్ ప్రస్తుతం నవీముంబైలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుసహా ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలలో ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. రహదారులు తదితర మౌలిక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌పై 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 30కల్లా కంపెనీ రూ. 40,023 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి ఉంది.
ఎఫ్‌పీవో వార్తల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 1.5% నీరసించి రూ. 3,585 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment