follow-on public offer
-
అదానీ గ్రూప్ ఎఫ్‌పీవో సక్సెస్ అవుతుంది : జుగేశిందర్ సింగ్
న్యూఢిల్లీ: గత వారం ప్రారంభమైన ఫాలో ఆన్ ఆఫర్(ఎఫ్‌పీవో) విజయవంతమవుతుందని డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ సీఎఫ్‌వో జుగేశిందర్ సింగ్ తాజాగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్‌పీవో ధరలో లేదా షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేపట్టబోమని తెలియజేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో గత వారం చివర్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అయితే రూ. 20,000 కోట్ల సమీకరణకు అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన ఎఫ్‌పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీవో ధర లేదా షెడ్యూల్‌ను సవరించే యోచనలేదంటూ సీఎఫ్‌వో స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల కౌంటర్లు అమ్మకాలతో డీలా పడ్డాయి. షేర్ల ధరల్లో పెరుగుదల, ఖాతాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కోనున్నట్లు ఇప్పటికే అదానీ గ్రూప్ తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించినట్లు సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ నివేదికలో ఎలాంటి పరిశోధనా సంబంధ అంశాలూ లేవని స్పష్టం చేశారు. పూర్తిగా ఆధారరహిత ఆరోపణలు చేసినట్లు వివరించారు. సక్సెస్ ఎందుకంటే అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276. మార్కెట్ల పతనంతో వారాంతాన షేరు రూ. 2,762 వద్ద ముగిసింది. అయినప్పటికీ ఎఫ్‌పీవో సక్సెస్ కాగలదంటూ ఎఫ్‌పీవో సింగ్ పేర్కొన్నారు. ఇందుకు కారణాలు ఇలా వివరించారు. బ్యాంకర్లు, ఇన్వెస్టర్లుసహా వాటాదారులంతా ఎఫ్‌పీవోపై విశ్వాసంతో ఉన్నారు. గత బుధవారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. ఓపెన్ మార్కెట్లో షేరు తక్కువ ధరకు చేరినప్పటికీ తగినన్ని షేర్లు(ఫ్రీఫ్లోట్) అందుబాటులో లేవు. రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే తగిన మోతాదులో లభించే వీలుంది. వ్యూహాత్మక పెట్టుబడిదారులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీవో ద్వారా తగిన పరిమాణంలో షేర్లు అందుబాటులోకి వస్తాయి. లిక్విడిటీతోపాటు ఫ్రీఫ్లోట్‌ను పెంచేందుకే ఎఫ్‌పీవోకు తెరతీశారు. నిజానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు విలువరీత్యా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ పలు రంగాల సంస్థలకు చేయూత(ఇన్క్యుబేటర్)గా నిలుస్తోంది. ఎయిర్‌పోర్టులు, రహదారులు, నూతన ఇంధన ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, మైనింగ్ బిజినెస్ తదితరాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు హైడ్రోజన్ తదితర ఆధునిక బిజినెస్‌లలో విస్తరిస్తోంది. ఇందుకు రానున్న దశాబ్ద కాలంలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. 2025–2028 మధ్య కాలంలో బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలకు సైతం తెరతీసింది. వెరసి షేరు ధరలో తాత్కాలిక ఆటుపోట్లవల్ల కంపెనీ దీర్ఘకాలిక విలువలో మార్పులు సంభవించబోవంటూ సింగ్ స్పష్టం చేశారు. -
ఎఫ్‌పీవోకు అదానీ ఎంటర్ప్రైజెస్ సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు రంగం సిద్ధం చేసింది. ఇందుకు రూ. 3,112 నుంచి రూ. 3,276 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇది తాజా ధరతో పోలిస్తే 10–15 శాతం తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 64 డిస్కౌంట్ ప్రకటించింది. రిటైలర్లు కనీసం 4 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై ఇదే గుణిజాల్లో దరఖాస్తు చేయవచ్చు. ఇష్యూ ద్వారా రూ. 20,000 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎఫ్‌పీవోగా నిలవనుంది. ఆఫర్ ఈ నెల 27న ప్రారంభమై 31న ముగియనుంది. నిధుల వినియోగమిలా: ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,869 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలపై అదానీ ఎంటర్ప్రైజెస్ వెచ్చించనుంది. మరో రూ.4,165 కోట్లను ఎయిర్‌పోర్టులు, రోడ్, సోలార్ ప్రాజెక్టు సంబంధ అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, రహదారుల అభివృద్ధి, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, డిజిటల్, మైనింగ్ డిఫెన్స్, తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించిన సంగతి తెలిసిందే. 7 విమానాశ్రయాలు ఏఈఎల్ ప్రస్తుతం నవీముంబైలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టుసహా ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలలో ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. రహదారులు తదితర మౌలిక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌పై 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 30కల్లా కంపెనీ రూ. 40,023 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి ఉంది. ఎఫ్‌పీవో వార్తల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 1.5% నీరసించి రూ. 3,585 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ
ఈ నెల 26న ఏజీఎం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని, మొత్తం బ్యాంక్ మూలధనంలో ప్రభుత్వ వాటా 51 %కి తగ్గకుండా ఉండేలా ఈ నిధులు సమీకరిస్తామని వివరించింది. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్‌లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్‌జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్సీ, ఆర్‌ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్‌ఎస్‌కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్‌యూలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.