న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్.. భారత్‌లోని తమ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రణాళికల్లో ఉంది. పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) జారీకి సరైన సమయం కోసం వేచిచూస్తున్నామని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో చెప్పారు. మంగళవారమిక్కడ గ్రూప్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ప్రస్తుతానికైతే మేం మా నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరడం, బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణపైనే అత్యధికంగా దృష్టిపెడుతున్నాం. కచ్చితంగా ఏదో ఒకరోజు ఐపీఓకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి నేనేమీ వ్యతిరేకం కాదు. మంచి సమయం చూసి లిస్టింగ్ నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని కొలావో పేర్కొన్నారు. కాగా, ఐటీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కూడా కొలావో కలిశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు, ఇందులో ప్రైవేటు రంగం భాగస్వామ్యం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి.
ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసులో రూ.3,200 కోట్ల పన్ను చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి వొడాఫోన్‌కు ఇటీవలే ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాఖలు చేసిన ఈ కేసులో బాంబే హైకోర్టు వొడాఫోన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయకూడదని మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, హచిసన్ నుంచి వొడాఫోన్ వాటా కొనుగోలుకు సంబంధించిన కేసులో మాత్రం రూ.11,200 కోట్లకు పైగా పన్ను చెల్లింపు వివాదం ఇంకా కొలిక్కిరాలేదు.
సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూ: వొడాఫోన్
Published Wed, Feb 4 2015 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement