ఇందుకేనా డి–మార్ట్ దూకుడు!!
రిటైల్‌లో లిస్టెడ్ కంపెనీలు చాలా తక్కువ
♦ మెరుగైన నిర్వహణ సామర్థ్యం డి–మార్ట్ సొంతం
♦ ఈ విషయంలో ఫ్యూచర్ రిటైల్ వెనుకంజ...
♦ అందుకే ఇంత భారీ వాల్యుయేషన్: విశ్లేషకులు
ముంబై: డి–మార్ట్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. పబ్లిక్ ఆఫర్‌తో ఇన్వెస్టర్లకు సిరుల పంట పండించిన ఈ సంస్థ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో హాట్ టాపిక్. డి–మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ధర మార్కెట్లో లిస్టింగ్ రోజే 100 శాతం పైగా ఎగబాకిన సంగతి తెలిసిందే. ఆఫర్ ధర రూ.299 కాగా... ప్రస్తుతం ఈ షేరు రూ.635 వద్ద ఉంది. ఈ షేరుకు ఇంత అధిక విలువ (వాల్యుయేషన్) సమంజసమేనా అన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల మదిని తొలిచేస్తున్న ప్రశ్న.
అయితే, పటిష్ట నిర్వహణ సామర్థ్యమే డి–మార్ట్ దూకుడుకు ప్రధాన కారణమని.. ఇదే రంగంలో పాతుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లోని సంస్థాగత రిటైల్ సంస్థలకు ఆద్యుడిగా పేరొందిన ప్యూచర్ రిటైల్ అధినేత కిశోర్ బియానీ... డి–మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ నుంచి చాలా నేర్చుకోవాలని కూడా పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
ఫ్యూచర్ రిటైల్‌తో పోలిస్తే...
దేశవ్యాప్తంగా బిగ్‌బజార్‌తో సహా విభిన్న బ్రాండ్‌లతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్... పరిమాణంలో చాలా పెద్దదే అయినా, నిర్వహణ సామర్థ్యంలో మాత్రం డి–మార్ట్‌కు ఆమడ దూరంలో ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తిని మోర్గాన్ స్టాన్లీ దీనికి ఉదాహరణగా చూపిస్తోంది. వార్షికంగా డి–మార్ట్‌కు ఇది 14 సార్లు ఉండగా.. ఫ్యూచర్ రిటైల్‌కు మాత్రం కేవలం రెండు సార్లే ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. దీనిప్రకారం... డి–మార్ట్ తన స్టోర్లలో ఉండే సరుకులను ఏడాదికి 14 సార్లు... అంటే ప్రతి 26 రోజులకు ఒకసారి క్లియర్ చేసి మళ్లీ నింపుతుండగా.. ఫ్యూచర్ రిటైల్ మాత్రం ఏడాదికి రెండు సార్లు... అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నింపుతోంది. ఇక నిర్వహణ మార్జిన్ విషయానికొస్తే.. ఫ్యూచర్ రిటైల్‌ది 3.2 శాతం మాత్రమే.
డి–మార్ట్ 7.9 శాతంతో దూసుకెళ్తోంది. ప్రధానంగా అద్దెల వ్యయం భారీగా పెరిగిపోవడం ఫ్యూచర్ రిటైల్ మార్జిన్లు ఆవిరయ్యేలా చేస్తోంది. అదే డి–మార్ట్ విషయానికొస్తే.. చాలా వరకూ సొంత స్టోర్లను కలిగి ఉండటం లాభిస్తోంది. రిటైల్ స్టోర్‌లో ప్రతి చదరపు మీటర్‌కు ఫ్యూచర్ రిటైల్ ఆదాయం రూ.13,000 మాత్రమే కాగా, డి–మార్ట్ ఏకంగా రూ.24,000 చొప్పున ఆర్జిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ 244 నగరాలు, పట్టణాల్లో 300కు పైగా బిగ్‌బజార్, ఫుడ్‌బజార్, ఎఫ్‌బీబీ తదితర స్టోర్లను నిర్వహిస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.11,500 కోట్లు కాగా.. కేవలం 45 నగరాల్లో 118 స్టోర్లను మాత్రమే నిర్వహిస్తున్న డి–మార్ట్ మార్కెట్‌క్యాప్ దీనికి అందనంత ఎత్తులో రూ.40,000 కోట్ల పైకి ఎగబాకడం విశేషం.
అన్నింటా ముందంజే...
2016 డిసెంబర్ చివరి నాటికి డి–మార్ట్ రుణ భారం రూ.1,409 కోట్లుగా ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 0.74 శాతం. ఇప్పుడు ఐపీఓ ద్వారా సమీకరించిన రూ.1,870 కోట్ల నిధుల్లో రూ.1,080 కోట్లను రుణాలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోనుంది. అంటే రుణ భారం భారీగా తగ్గి.. లాభదాయకత మరింత జోరందుకుంటుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్ వరకూ కంపెనీ రూ.301 కోట్ల నికర లాభం, రూ. 8,800 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ డెట్ టు ఈక్విటీ 0.6 శాతంగా ఉంది. ఇక ఇన్వెస్టర్లకు అత్యంత కీలకమైన రిటర్న్ ఆన్ ఈక్విటీలో (ఆర్‌ఓఈ–పెట్టుబడిపై రాబడి) కూడా డి–మార్ట్ 21.1 శాతంతో చాలా ముందుంది. ఫ్యూచర్ రిటైల్ ఆర్‌ఓఈ 15.5 శాతమే. ఇక ఫ్యూచర్ రిటైల్ ప్రస్తుత షేరు ధర రూ.243 ప్రకారం 32 రెట్ల పీఈతో ట్రేడవుతోంది.
డి–మార్ట్ పీఈ చాలా అధికంగా (77 రెట్లు) ఉన్నప్పటికీ... వృద్ధి జోరు, సమర్థమైన వ్యాపార విధానం(మోడల్) వంటివి లెక్కలోకి తీసుకుని చూస్తే ఈ ప్రీమియం సమర్థనీయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర రంగాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. విమానయాన రంగంలో సమర్థమైన నిర్వహణ కలిగిన ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) అంత్యంత గరిష్టంగా 17 పీఈని కలిగి ఉంది. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు ఉన్న జెట్ ఎయిర్‌వేస్ పీఈ 9 మాత్రమే. దీనిప్రకారం.. ఫ్యూచర్ రిటైల్ కచ్చితంగా తన వ్యాపార నిర్వహణను మెరుగుపరుచుకోకపోతే... డి–మార్ట్‌తో వేల్యుయేషన్ పరంగా పోటీపడటం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎందుకింత మక్కువ..
డి–మార్ట్ ప్రస్తుత షేరు ధర ప్రకారం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) అత్యంత భారీ స్థాయిలో 77 రెట్లుగా ఉంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే 77 రెట్ల అధిక రేటుకు ట్రేడవుతున్నట్లు లెక్క. ఈ స్థాయిలో ఇన్వెస్టర్లు ఈ షేరును కొనడం చాలా రిస్కుతో కూడుకున్నదేనని.. స్వల్పకాలానికి తక్కువ లాభాలకు మాత్రమే ఆస్కారం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. చాలా మంది నిపుణులు మాత్రం ప్రస్తుత ధర కంటే దిగువకు ఇప్పుడప్పుడే ఈ షేరు పడిపోయే అవకాశాలు చాలా తక్కువనేనని చెబుతున్నారు. అయితే, తక్షణం మరింత భారీ స్థాయిలకు కూడా వెళ్లకపోవచ్చని.. కంపెనీ ప్రస్తుత షేరు ధర స్థాయికి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) చేరుకునేవరకూ ఒక శ్రేణిలో (రేంజ్ బౌండ్) కదలాడవచ్చనేది వారి అభిప్రాయం.
కొద్ది కాలం క్రితం అధిక వాల్యుయేషన్లతో ఐపీఓలకు వచ్చి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చిన థైరోకేర్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్ వంటి డయాగ్నోస్టిక్ కంపెనీలను వారు ఉదహరిస్తున్నారు. డి–మార్ట్ వంటి కంపెనీల అధిక వాల్యుయేషన్‌కు ప్రధానంగా ఆయా రంగాల్లో చాలా తక్కువ కంపెనీలు ఉండటం... నిర్వహణ పనితీరు చాలా బాగుండటం వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు ఓపిక తక్కువగా ఉంటుందని.. అందుకే వారు కొద్దిగా షేరు ధర పెరగ్గానే విక్రయించేందుకు సిద్ధపడతారు. అదే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా ఇలాంటి షేర్లను కొనుగోలు చేస్తుండటం వల్ల రేటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతూ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రాదు’ అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.