న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్‌ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.
ఫస్ట్‌మెరిడియన్
సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
ఐఆర్‌ఎం ఎనర్జీ
పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్‌ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్‌జీ, సీఎన్‌జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది.
లోహియా కార్ప్
టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్‌టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది.
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
Published Wed, Mar 1 2023 4:23 AM | Last Updated on Wed, Mar 1 2023 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment