Lohia
-
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఫస్ట్‌మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
బీజేపీ కూటమిలోకి శివ్‌పాల్ యాదవ్?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చిన్నాన్న, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శనివారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. దీంతో ఎస్పీ నేతృత్వంలోని విపక్ష కూటమికి బీటలు వారుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ శనివారం తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మార్చి 26న జరిగిన ఎస్పీ కొత్త ఎమ్మెల్యేల భేటీకి శివపాల్‌ను అఖిలేశ్ ఆహ్వానించలేదు. వారం క్రితం జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి శివపాల్ హాజరుకాలేదు. తర్వాత సీఎం యోగితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాంతో శివపాల్ బీజేపీ కూటమిలో చేరతారని వదంతులు ఎక్కువయ్యాయి. శివపాల్‌కు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
భారత్‌లోకి ‘యూఎం’ బైక్స్ త్వరలో
⇒ ప్రీమియం బైక్‌లతో మార్కెట్లోకి ఎంట్రీ ⇒ స్కూటర్లు, 125 సీసీ బైక్‌లు కూడా ⇒ లోహియా సీఈవో ఆయుష్ లోహియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న అమెరికా కంపెనీ యూఎం మోటార్ సైకిల్స్ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. తొలి మోడల్ దసరా-దీపావళికళ్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత 400 సీసీ రెనిగేడ్ క్రూయిజర్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌తో సహా 50 ప్రధాన నగరాల్లో షోరూంల ఏర్పాట్లలో కంపెనీ నిమగ్నమైంది. బైక్‌లు, స్కూటర్లు, క్రూయిజర్స్ను యూఎం మోటార్‌సైకిల్స్ 20కిపైగా దేశాల్లో విక్రయిస్తోంది. భారత్‌లో ఎంట్రీకై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోహియా ఆటో ఇండస్ట్రీస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ‘యూఎం లోహియా’ ఏర్పాటు చేసింది. ఈ జేవీలో చెరి 50 శాతం వాటా ఉంది. ఇరు సంస్థలు రూ.100 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నాయని లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్కూటర్లు కూడా.. త్రిచక్ర వాహనాలు, ఈ-స్కూటర్లు, ఇ-ఆటోల తయారీలో ఉన్న లోహియా ఆటోకు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ప్లాంటు ఉంది. ఏటా ఒక లక్ష ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది. ఇక యూఎం మోటార్‌సైకిల్స్ అన్ని విభాగాల్లో కలుపుకుని ప్రస్తుతం 16 మోడళ్లను తయారు చేస్తోంది. 125 సీసీ స్కూటర్లు, బైక్‌లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా 400 సీసీలోపు సామర్థ్యంగల విభాగంలో భారత్‌లో నిలవాలన్నది కంపెనీ ఆలోచన. ఇంజిన్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ వైశాల్యం పెద్దగా ఉండడం క్రూయిజర్ల ప్రత్యేకత. వినూత్న డిజైన్లు, అంతర్జాతీయ బ్రాండ్కుతోడు అందుబాటు ధరలో బైక్‌లు లభించడంతో భారత్‌లో అమ్మకాలు గణనీయంగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. మూడు నెలలకో బైక్..: ప్రతి మూడు నెలలకు ఒక మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టాలని జేవీ భావిస్తోంది. వాహనాల్లో వాడే విడిభాగాలను సాధ్యమైనంత వరకు దేశీయంగా సేకరిస్తారు. ఏడాదికి లక్ష వాహనాలను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం.