భారత్‌లోకి ‘యూఎం’ బైక్స్ త్వరలో
⇒ ప్రీమియం బైక్‌లతో మార్కెట్లోకి ఎంట్రీ
⇒ స్కూటర్లు, 125 సీసీ బైక్‌లు కూడా
⇒ లోహియా సీఈవో ఆయుష్ లోహియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న అమెరికా కంపెనీ యూఎం మోటార్ సైకిల్స్ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. తొలి మోడల్ దసరా-దీపావళికళ్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత 400 సీసీ రెనిగేడ్ క్రూయిజర్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెడుతున్నట్టు సమాచారం.
హైదరాబాద్‌తో సహా 50 ప్రధాన నగరాల్లో షోరూంల ఏర్పాట్లలో కంపెనీ నిమగ్నమైంది. బైక్‌లు, స్కూటర్లు, క్రూయిజర్స్‌ను యూఎం మోటార్‌సైకిల్స్ 20కిపైగా దేశాల్లో విక్రయిస్తోంది. భారత్‌లో ఎంట్రీకై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోహియా ఆటో ఇండస్ట్రీస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ‘యూఎం లోహియా’ ఏర్పాటు చేసింది. ఈ జేవీలో చెరి 50 శాతం వాటా ఉంది. ఇరు సంస్థలు రూ.100 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నాయని లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
స్కూటర్లు కూడా..
త్రిచక్ర వాహనాలు, ఈ-స్కూటర్లు, ఇ-ఆటోల తయారీలో ఉన్న లోహియా ఆటోకు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ప్లాంటు ఉంది. ఏటా ఒక లక్ష ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది. ఇక యూఎం మోటార్‌సైకిల్స్ అన్ని విభాగాల్లో కలుపుకుని ప్రస్తుతం 16 మోడళ్లను తయారు చేస్తోంది. 125 సీసీ స్కూటర్లు, బైక్‌లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా 400 సీసీలోపు సామర్థ్యంగల విభాగంలో భారత్‌లో నిలవాలన్నది కంపెనీ ఆలోచన. ఇంజిన్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ వైశాల్యం పెద్దగా ఉండడం క్రూయిజర్ల ప్రత్యేకత. వినూత్న డిజైన్లు, అంతర్జాతీయ బ్రాండ్‌కుతోడు అందుబాటు ధరలో బైక్‌లు లభించడంతో భారత్‌లో అమ్మకాలు గణనీయంగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది.
మూడు నెలలకో బైక్..: ప్రతి మూడు నెలలకు ఒక మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టాలని జేవీ భావిస్తోంది. వాహనాల్లో వాడే విడిభాగాలను సాధ్యమైనంత వరకు దేశీయంగా సేకరిస్తారు. ఏడాదికి లక్ష వాహనాలను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం.