Business Services
-
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఫస్ట్‌మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
ఐటీ, బిజినెస్ సర్వీసెస్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది. నాలుగేళ్లలో ఇలా.. భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది. -
కాగ్నిజెంట్ లాభం 12% అప్
క్యూ3 ఫలితాలు.. న్యూయార్క్: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో 363 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన 324 మిలియన్ డాలర్లతో పోలిస్తే లాభం 12 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కన్సల్టింగ్, డిజిటల్, బిజినెస్ సర్వీసెస్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాలు పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడినట్లు తెలిపింది. భారత్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన కాగ్నిజెంట్... అమెరికా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కాగా, క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయం 16 శాతం ఎగబాకి 2.36 బిలియన్ డాలర్ల నుంచి 2.74 బిలియన్ డాలర్లకు చేరింది. కాగ్నిజెంట్ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ ఏడాది తొలి క్వార్టర్(జనవరి-మార్చి)లో ఆదాయం కనీసం 2.88 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. అదేవిధంగా పూర్తి సంవత్సరానికి 12.21 బిలియన్ డాలర్లకు ఎగబాకవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా, క్యూ4లో కంపెనీ నికరంగా 11,800 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో డిసెంబర్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,11,500కు చేరింది.