కాగ్నిజెంట్ లాభం 12% అప్
క్యూ3 ఫలితాలు..
న్యూయార్క్: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో 363 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన 324 మిలియన్ డాలర్లతో పోలిస్తే లాభం 12 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కన్సల్టింగ్, డిజిటల్, బిజినెస్ సర్వీసెస్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాలు పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడినట్లు తెలిపింది.
భారత్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన కాగ్నిజెంట్... అమెరికా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కాగా, క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయం 16 శాతం ఎగబాకి 2.36 బిలియన్ డాలర్ల నుంచి 2.74 బిలియన్ డాలర్లకు చేరింది. కాగ్నిజెంట్ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
ఈ ఏడాది తొలి క్వార్టర్(జనవరి-మార్చి)లో ఆదాయం కనీసం 2.88 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. అదేవిధంగా పూర్తి సంవత్సరానికి 12.21 బిలియన్ డాలర్లకు ఎగబాకవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా, క్యూ4లో కంపెనీ నికరంగా 11,800 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో డిసెంబర్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,11,500కు చేరింది.