![Q3 Results Swiggy Net loss widens to Rs 799 crore Mobikwik swings into red](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/swiggy-.jpg.webp?itok=yn867QKy)
ఫుడ్, గ్రోసరీ డెలివరీల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 799 కోట్లను దాటింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 574 కోట్ల నష్టం నమోదైంది.
కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,049 కోట్ల నుంచి రూ. 3,993 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,700 కోట్ల నుంచి రూ. 4,898 కోట్లకు పెరిగాయి. స్థూల ఆర్డర్ల విలువ(జీవోవీ) 38 శాతం బలపడి రూ. 12,165 కోట్లను తాకింది. క్విక్ కామర్స్ బిజినెస్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ జీవోవీ 88 శాతం జంప్‌చేసి రూ. 3,907 కోట్లకు చేరింది. కొత్తగా 96 స్టోర్లను జత కలుపుకోవడంతో యాక్టివ్ డార్క్ స్టోర్ల విస్తీర్ణం 2.445 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.
నష్టాల్లోకి మొబిక్విక్
ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ (Mobikwik) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. పేమెంట్ గేట్‌వే వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.
వన్ మొబిక్విక్ గేట్‌వే చెల్లింపుల వ్యయాలు మూడు రెట్లు పెరిగి రూ. 144 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 51 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 269 కోట్లను అధిగమించింది. పేమెంట్స్ స్థూల మెర్కండైజ్ విలువ మూడు రెట్లుపైగా జంప్‌చేసి రూ. 29,400 కోట్లయ్యింది. రిజిస్టర్డ్ వినియోగదారుల సంఖ్య 14 శాతం వృద్ధితో 17.2 కోట్లను తాకింది. పేమెంట్స్ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 196 కోట్లను దాటింది.
Comments
Please login to add a commentAdd a comment