
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది.
నాలుగేళ్లలో ఇలా..
భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment