IDC report
-
భారత్‌లో 5జీ ఫోన్లను తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు (కంపెనీల నుంచి విక్రయదారులకు రవాణా) జనవరి–మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం తగ్గి 3.1 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో మొదటి త్రైమాసికంలో అతి తక్కువ షిప్మెంట్ ఇదేనని ఐడీసీ పేర్కొంది. రియల్మీ, షావోమీ ఫోన్ల షిప్మెంట్లో ఎక్కువ క్షీణత నమోదైంది. ఇవి మార్కెట్ వాటాను కూడా నష్టపోయాయి. 2023లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ఇక స్మార్ట్ఫోన్ల రవాణాలో క్షీణత ఉన్నప్పటికీ.. శామ్సంగ్ 20.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 17.7 శాతం వాటాతో వివో ఉంది. ఒప్పో 17.6 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో షిప్మెంట్ పరంగా వృద్ధిని చూపించిన ఏకైక సంస్థగా ఒప్పో నిలిచింది. షావోమీ షిప్మెంట్ 41.1 శాతం తగ్గి 50 లక్షల యూనిట్లుగా ఉంది. మార్కెట్ వాటా 2022 మొదటి త్రైమాసికంలో 23.4 శాతంగా ఉంటే, అది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 16.4 శాతానికి తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో 9.47 శాతం వాటాతో రియల్మీ ఉంది. 29 లక్షల యూనిట్లను రవాణా చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రియల్మీ మార్కెట్ వాటా 16.4 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. 2022 ద్వితీయ ఆరు నెలల్లో పండుగలకు ముందు విక్రేతలు స్టాక్ పెంచుకోవడంతో, వారి వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయి’’అని ఐడీసీ నివేదిక తెలిపింది. ఇక మొత్తం షిప్మెంట్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగింది. తక్కువ ధరల 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. -
భారత్‌లో గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్ దేశంలో జోరుగా సాగుతోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం.. 2022 జూలై–సెప్టెంబర్‌లో మొత్తం 3.72 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 56 శాతం అధికం కావడం విశేషం. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా 7.5 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. సగటు విక్రయ ధర ఏడాదిలో 13.6 శాతం తగ్గింది. స్మార్ట్‌వాచెస్ 179 శాతం వృద్ధితో 1.2 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇయర్‌వేర్ 33.6 శాతం అధికమై 2.5 కోట్ల యూనిట్లుగా ఉంది. 32.1 శాతం వాటాతో బోట్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 13.8 శాతం వాటాతో నాయిస్ రెండవ స్థానంలో ఉంది. ఫైర్ బోల్ట్ 8.9 శాతం వాటాతో మూడు, వన్‌ప్లస్ 8.2 శాతం వాటాతో నాల్గవ స్థానాన్ని అందుకున్నాయి. -
వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!
మన దేశంలో కొత్త మొబైల్స్‌తో పోటీగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ ఐసీఈఏ, పరిశోధన సంస్థ ఐడీసీ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 నాటికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 34,500 కోట్లు) ఉంటుందని అంచనా. వినియోగదారులు ఈ ఏడాదిలో 2.3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.17,250 కోట్లు) విలువ గల 25 మిలియన్ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు ఈ నివేదికలో తేలింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 94 డాలర్ల(సుమారు రూ. 7,050)గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. "ఈ మార్కెట్ పెరుగుదల వల్ల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు" ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదికను ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. మొత్తం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లలో 95 శాతానికి పైగా ఎలాంటి డ్యామేజ్ కాకముందే విక్రయస్తున్నారని, మిగిలిన ఐదు శాతం స్మార్ట్ఫోన్లను రిపేర్ వచ్చినప్పుడు విక్రయిస్తున్నారు. "వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అతిపెద్ద వాటా(90 శాతానికి పైగా)ను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు వంటి ఇతర పరికరాల విక్రయాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి" అని నివేదిక తెలిపింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో 78 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000 కంటే తక్కువగా ఉంటే, 18 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000-రూ.50,000గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. (చదవండి: షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!) -
రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం
న్యూఢిల్లీ: భారత సాఫ్ట్వేర్ మార్కెట్ ఆదాయం 2021 చివరికి 8.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 60 వేల కోట్లు) ను అధిగమిస్తుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేసింది. ‘‘భారత సాఫ్ట్వేర్ మార్కెట్ ఆదాయం 2021 మొదటి ఆరు నెలల్లో 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది వార్షికంగా చూస్తే 15.9 శాతం వృద్ధి’’ అని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్, చైనా మినహాయించి చూస్తే భారత్ వాటా 18.3 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2021 మొదటి ఆరు నెలల్లో భారత మార్కెట్లో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఎస్ఏపీ అగ్రపథంలో కొనసాగినట్టు వెల్లడించింది. భారత కంపెనీలు మరింత విస్తరించే లక్ష్యంతో డిజిటల్‌కు మారిపోతున్నట్టు, క్లౌడ్, ఏఐపై పెట్టుబడులు పెంచుతున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ మార్కెట్‌ను అప్లికేషన్స్, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ (ఏడీ అండ్‌డీ), సిస్టమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ (ఎస్ఐ) అనే మూడు భాగాలు ఐడీసీ వర్గీరించింది. మొత్తం పరిశ్రమ ఆదాయంలో అప్లికేషన్స్ నుంచే 61 శాతం వస్తోందని, ఆ తర్వాత ఏడీ అండ్‌డీ నుంచి 21 శాతం, ఎస్ఐ సాఫ్ట్వేర్ నుంచి 18 శాతం చొప్పున ఆదాయం వస్తున్నట్టు వివరించింది. -
రాబోయే నాలుగేళ్లలో 10.8 బిలియన్ డాలర్ల మార్కెట్.. ఎక్కడంటే ?
న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2020–2025 మధ్య కాలంలో ఈ మార్కెట్ (పీసీఎస్) ఏటా 24.1 శాతం వార్షిక వృద్ధితో 10.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) పీసీఎస్ మార్కెట్ ఆదాయాలు 2.2 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. నూతన ఆవిష్కరణలు, కొత్త భాగస్వామ్యాలు, డిజిటలీకరణ మొదలైన వాటికి క్లౌడ్ కీలకంగా ఉంటోందని ఐడీసీ తెలిపింది. త్వరితగతిన, సమర్ధమంతంగా అప్లికేషన్లను అభివృద్ధి చే?సేందుకు, కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు రాబోయే 12 నెలల్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ప్లాట్‌ఫామ్‌లపై భారీగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నాయని దేశీ సంస్థలు తెలిపినట్లు ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ రిషు శర్మ తెలిపారు. ‘కొంగొత్త టెక్నాలజీల ఊతంతో కంపెనీలు తమ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు పబ్లిక్ క్లౌడ్ సర్వీసులు తోడ్పడతాయి. రాబోయే రోజుల్లో పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం మరింతగా పుంజుకుంటుంది‘ అని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ హరీష్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు హైబ్రిడ్ పని విధానాలకు మళ్లే అవకాశాలు ఉన్నాయని.. దీనితో రిమోట్ కంప్యూటింగ్, స్టోరేజీ, కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. ఫలితంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసులపై పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్నారు. ఇతర ప్రధాన అంశాలు - ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్) సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్ఏఏఎస్) మొదలైనవి పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల పరిధిలోకి వస్తాయి. - ఈ ఏడాది ప్రథమార్ధంలో కోవిడ్–19 ప్రభావాలే క్లౌడ్ సేవలకు ఊతంగా నిల్చాయి. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం క్లౌడ్ ఇన్ఫ్రా, ప్లాట్‌ఫామ్‌లు, సాఫ్ట్వేర్ మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయి. - పీసీఎస్ మార్కెట్లో అత్యధికంగా ఎస్ఏఏఎస్ను వినియోగిస్తుండగా .. ఐఏఏఎస్, పీఏఏఎస్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. - భారీ సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం పెరుగుతోంది. ఎక్కువగా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం), కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), సెక్యూరిటీ మొదలైన క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లకు డిమాండ్ ఉంటోంది. -
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లు ఇవే!
ప్రపంచ మొబైల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తుంది. 2021 ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్ ఫోన్లలో నాలుగు ఐఫోన్లు, ఒక శామ్సంగ్ మొబైల్ నిలిచింది. ఐడీసీ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచ అమ్మకాల పరంగా చూస్తే ఐఫోన్ 12 మొదటి స్థానంలోను, శామ్సంగ్ ఏ12 రెండవ స్థానంలో, ఐఫోన్ 11 మూడవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ నాల్గవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ ఐదవ స్థానంలో నిలిచాయి. 2021 మొదటి మూడు నెలల్లో ఐఫోన్ 12 ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది. 2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌గా శామ్ సంగ్ గెలాక్సీ ఏ12 మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్లలో టాప్ 5లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఈస్మార్ట్ ఫోన్ 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీని ధర మన దేశంలో రూ.15,599గా ఉంది. గెలాక్సీ ఏ12 ఈ ర్యాంకింగ్ లో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్. మిగిలిన యాపిల్ మోడల్స్ ధరలు భారీగా ఉన్నాయి. 4 out of the 5 most sold smartphones in the first three quarters of 2021 are from @Apple pic.twitter.com/B750knoyZC — Francisco Jeronimo (He/Him) (@fjeronimo) November 22, 2021 (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ!) -
ఐటీ, బిజినెస్ సర్వీసెస్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది. నాలుగేళ్లలో ఇలా.. భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది. -
శాంసంగ్ కు పోటీగా దూసుకెళ్తున్న షియోమీ
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు. 2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. -
వైర్ నుంచి వైర్లెస్కు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్లెస్ డివైస్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ విషయానికి వస్తే వేరబుల్స్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్ ఊరిస్తోంది. అమ్మకాలు ఎందుకంటే... ఇయర్‌వేర్ డివైస్ వినియోగం పెరగడం, రిస్ట్ బ్యాండ్స్ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్ సేల్స్ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్ నుంచి వైర్లెస్ వైపు మార్కెట్ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్ రంగంలో ఇయర్‌వేర్ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది. రిస్ట్ బ్యాండ్స్ నుంచి.. గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్ బ్యాండ్స్ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు. తగ్గుతున్న ధరలు.. ఇయర్‌వేర్ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్టైన్మెంట్తోపాటు వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్లెస్ స్టీరియో డివైసెస్ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది. -
గంటలో మొబైల్ ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఏప్రిల్–జూన్ కాలంలో మొబైల్స్ అమ్మకాలు 50 శాతం తగ్గాయని ఐడీసీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌తో అమ్మకాలు లేక అద్దెలు, వేతనాల భారం కారణంగా ఆఫ్‌లైన్ రిటైల్ చైన్లు నష్టపోయాయి. అయితే ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్స్ ఆన్లైన్ సేల్స్‌ను ఆసరాగా చేసుకున్నాయి. చిన్న పట్టణాల్లోనూ స్టోర్లు, సొంత నెట్వర్క్ ఉండడం వీటికి కలిసి వస్తోంది. ఈ–కామర్స్‌కు ధీటుగా ఇవి పోటీకి సై అంటున్నాయి. ఔట్లెట్లు ఉన్న ప్రాంతాల్లో ఒక గంటలోనే మొబైల్‌ను డెలివరీ చేసి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. అంతేకాదు ఈ–కామర్స్ కంపెనీలు ఎంతకైతే విక్రయిస్తున్నాయో అదే ధరను ఇవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. మార్చి ముందుతో పోలిస్తే రిటైల్ చైన్ల ఆన్లైన్ అమ్మకాలు ఇప్పుడు గణనీయంగా అధికం కావడం విశేషం. కోవిడ్‌కు ముందు కొన్ని నగరాల్లో ఈ–కామర్స్ కంపెనీలు 24 గంటల్లో మొబైల్స్‌ను డెలివరీ చేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చిన్న పట్టణాల్లోనూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ సి, లాట్, బి న్యూ, హ్యాపీ, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ తమ స్టోర్లతో విస్తరించాయి. బిగ్ సి 225 కేంద్రాలు, లాట్ 125, బి న్యూ 75, హ్యాపీ 70, సెలెక్ట్ 70 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు ఇవి స్టోర్ ఉన్న ప్రాంతాల్లో గంటలోనే మొబైల్‌ను అందిస్తున్నాయి. 50 కిలోమీటర్ల లోపు డెలివరీని 90–120 నిముషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కరోన ముందు వరకు అంతంతే నమోదైన ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 10–20 శాతానికి చేరాయని ‘బిగ్ సి’ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా ఏకంగా 50 శాతం ఉందని చెప్పారు. 5 శాతంగా ఉన్న ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 25 శాతానికి వచ్చాయని ‘బి న్యూ’ ఫౌండర్ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. డిసెంబరుకల్లా ఇది 40 శాతానికి వెళ్తుందన్నారు. ఆన్లైన్ సేల్స్ వేగంగా పుంజుకున్నాయని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ వారం మరో అయిదు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. మార్చికి ముందు 2 శాతంగా ఉన్న ఆన్లైన్ వాటా ఇప్పుడు 10 శాతానికి ఎగసిందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ పేర్కొన్నారు. సర్వీస్ సపోర్ట్, యాక్సెసరీస్, బీమా సేవలూ కస్టమర్లు అందుకోవచ్చన్నారు. ట్యాబ్లెట్ పీసీల జోరు.. ప్రపంచవ్యాప్తంగా ట్యాబ్లెట్ పీసీలకు మళ్లీ జీవం వచ్చింది. 2020 ఏప్రిల్–జూన్‌లో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైందని పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. మొత్తం 3.75 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఆపిల్ 38 శాతం, శామ్సంగ్ 18.7, హువావే 12.7 శాతం వాటా దక్కించుకున్నాయి. అమెజాన్, లెనోవో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో అల్కాటెల్, సెల్కాన్, లావా వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. దేశంలో రిటైల్ స్టోర్లలో మార్చికి ముందు ఒక శాతంగా ఉన్న ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు నేడు 20 శాతానికి చేరాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు అధికం కావడంతో వీటికి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. ట్యాబ్లెట్స్కు దిగుమతి సుంకం లేకపోవడం కస్టమర్లకు ప్రయోజనంగా ఉంది. -
4జీ స్మార్ట్ఫోన్ల జోరు
21% పెరిగిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఐడీసీ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో 4జీ స్మార్ట్పోన్ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 21 శాతం పెరిగి 2.83 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. చౌక ధర 4జీ ఫోన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఐడీసీ తెలిపింది. ఐడీసీ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.., * గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 2.33 కోట్లుగా ఉన్నాయి. * ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఈ విక్రయాలు 2.65 కోట్లు. * ఇంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. అమ్ముడైన ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి 4జీ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇక అమ్ముడయ్యే ప్రతి రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి 5 అంగుళాల కంటే ఎక్కువ డిస్ప్లే ఉన్నవే. * ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్వంటి వంటి ఈ కామర్స్ సంస్థలు చైనా సంస్థల నుంచి భారీగా 4జీ స్మార్ట్ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి. * 150 డాలర్ల కంటే తక్కువ ధరకే గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, గెలాక్సీ జే2, వంటి ఫోన్లను అందిస్తూ శామ్సంగ్ కంపెనీ 4జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. * స్మార్ట్ఫోన్ల మార్కెట్లో శామ్సంగ్ కంపెనీదే అగ్రస్థానం. 24 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(17 శాతం), ఇంటెక్స్(11 శాతం), లెనోవొ గ్రూప్ (10 శాతం),లావా (5 శాతం) ఉన్నాయి.