4జీ స్మార్ట్‌ఫోన్‌ల జోరు
21% పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఐడీసీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో 4జీ స్మార్ట్‌పోన్‌ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 21 శాతం పెరిగి 2.83 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. చౌక ధర 4జీ ఫోన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఐడీసీ తెలిపింది. ఐడీసీ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం..,
* గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 2.33 కోట్లుగా ఉన్నాయి.
* ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఈ విక్రయాలు 2.65 కోట్లు.
* ఇంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. అమ్ముడైన ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 4జీ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇక అమ్ముడయ్యే ప్రతి రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 5 అంగుళాల కంటే ఎక్కువ డిస్‌ప్లే ఉన్నవే.
* ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్‌వంటి వంటి ఈ కామర్స్ సంస్థలు చైనా సంస్థల నుంచి భారీగా 4జీ స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి.
* 150 డాలర్ల కంటే తక్కువ ధరకే గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, గెలాక్సీ జే2, వంటి ఫోన్లను అందిస్తూ శామ్‌సంగ్ కంపెనీ 4జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది.
* స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో శామ్‌సంగ్ కంపెనీదే అగ్రస్థానం. 24 శాతం మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(17 శాతం), ఇంటెక్స్(11 శాతం), లెనోవొ గ్రూప్
(10 శాతం),లావా (5 శాతం) ఉన్నాయి.