జాబితాలో హ్యుందాయ్, ఆఫ్కన్స్, ఓలా ఎలక్ట్రిక్, స్విగ్గీ, ఎన్‌ఎస్‌డీఎల్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎమ్‌క్యూర్
రూ. 60,000 కోట్ల సమీకరణ బాట
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.
ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి.
వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
లిస్టింగ్‌వైపు చూపు...
రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్‌ఎస్‌డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్‌క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.
ఎల్‌ఐసీ రికార్డుకు చెక్!
దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment