4 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ | Four companies get Sebi approval for public issue listings | Sakshi
Sakshi News home page

4 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Apr 6 2023 12:58 AM | Last Updated on Thu, Apr 6 2023 12:58 AM

Four companies get Sebi approval for public issue listings - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల నిధుల సమీకరణ ప్రణాళికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాబితాలో సైయంట్‌ డీఎల్‌ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్‌విస్టా ఇండియా, జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సర్వీసెస్‌ ఉన్నాయి. ఇవన్నీ 2022 జూలై– 2023 జనవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. తద్వారా పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు మార్చి 29–31 మధ్య అనుమతి పొందాయి. వెరసి స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు దారి ఏర్పడింది.

ఐటీ సొల్యూషన్స్‌
సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అందించే రాశి పెరిఫెరల్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. పూర్తిగా షేర్ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 400 కోట్లను రుణ చెల్లింపులు, రూ. 200 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

ఎలక్ట్రానిక్స్‌ తయారీ
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ సర్వీసుల సంస్థ సైయంట్‌ డీఎల్‌ఎం సైతం రూ. 740 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీ జారీకి తెరతీయనుంది. ఈ నిధులను మూలధన అవసరాలు, విస్తరణ వ్యయాలు, రుణ చెల్లింపులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

హెల్త్‌కేర్‌ సేవలు
పోర్టీ బ్రాండుతో ఆసుపత్రుల బయట ఆరోగ్య పరిరక్షణ సేవలందించే హెల్త్‌విస్టా ఇండియా ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 5.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ మెడీబిజ్‌ ఫార్మా వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణ చెల్లింపులు, మెడికల్‌ పరికరాల కొనుగోళ్లు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనుంది.  

ఫైనాన్షియల్‌ సేవలు
ఐపీవోలో భాగంగా ఫైనాన్షియల్‌ సేవలందించే ఫిన్‌టెక్‌ కంపెనీ జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సర్వీసెస్‌ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1.05 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వినియోగదారులను పెంచుకోవడం, టెక్నాలజీ, ప్రొడక్టుల అభివృద్ధి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు
వినియోగించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement