Kumaramangalam Birla
-
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
Kumar Mangalam Birla: మూడేళ్లలో రూ. 10 వేల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: కొత్త వెంచర్ అయిన డెకరేటివ్ పెయింట్స్ వ్యాపార విభాగం నుంచి వచ్చే మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. అప్పటికల్లా లాభాల్లోకి మళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిర్లా ఓపస్ బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంతో పాటు మూడు పెయింట్ ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు. పానిపట్ (హరియాణ), లూధియానా (పంజాబ్), చెయ్యార్ (తమిళనాడు)లో ఈ ప్లాంట్లు ఉన్నాయి. బిర్లా ఓపస్ పెయింట్లు మార్చి నుంచి పంజాబ్, హరియాణ, తమిళనాడులో లభ్యమవుతాయి. జూలై నుంచి 1 లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇవి లభిస్తాయని బిర్లా చెప్పారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 6,000 పట్టణాలకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రూప్‌లో కీలకమైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతేడాది డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి రూ. 10,000 కోట్లతో దేశీయంగా ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ. 5,000 కోట్లు వెచి్చంచినట్లు బిర్లా ఓపస్ బిజినెస్ హెడ్ హిమాంశు కపానియా తాజాగా చెప్పారు. దేశీయంగా డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్ దాదాపు రూ. 80,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ (డ్యూలక్స్) ఈ విభాగంలో దిగ్గజాలుగా ఉన్నాయి. -
పరిశ్రమలకు రాచబాట
పారిశ్రామిక రంగంలో ఏపీ మరింత పురోగమించేలా బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎంతో ఆసక్తితో ఉన్నాం. ఏపీలోని విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మానవ వనరులకు తోడు అన్ని విధాలా సహకారం అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా. జగన్ మంచి విజన్ ఉన్న యువ ముఖ్యమంత్రి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పర్యవసానంగా ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేస్తున్నారని చెప్పారు. అనుమతులను సరళతరం చేయడంతో పాటు ఎలాంటి సాయం కావాలన్నా వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలన్నింటి వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్‌ను గురువారం ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి కంపెనీలు ఎంతో నమ్మకంతో రాష్ట్రంలో అడుగులు వేయడంతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. చాలా ఆనందంగా ఉంది ► ఈ రోజు ఒక మంచి రోజు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు. మొత్తం మూడు విడతల్లో పూర్తయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ► ప్రత్యక్షంగా 1,300, పరోక్షంగా 1,150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గొప్ప కార్యక్రమం ఇది. దేశ వ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్ విలువ, దాదాపుగా లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా. ఇలాంటి వాళ్లు మన ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడకు వచ్చి పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామం. ► నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇచ్చే విధంగా ప్రత్యేకంగా చట్టాన్నే తీసుకువచ్చాం. వీళ్లు (ఆదిత్య బిర్లా గ్రూపు) ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ పరిశ్రమ స్థాపనకు చూపిన చొరవతో దేశంలో మిగిలిన వారందరికీ గొప్ప ముందడుగు అవుతుంది. కాలుష్యానికి తావు లేకుండా చర్యలు ► ఇదివరకు 2010–12 మధ్య పరిశ్రమ ఏర్పాటులో కంపెనీ రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు దానిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. చివరకు గ్రాసిమ్ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టి అడుగులు ముందుకేసింది. ► పరిశ్రమలు ఏర్పాటైతే వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో నెలకొన్న భయాలను పొగొట్టకుండా గత పాలకులు ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు చేశారు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తూ ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్లు పెట్టుబడులు రావడమే కాకుండా, సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేశాం. ► కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే దాని వల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని, అందువల్ల ఆ ప్లాంట్‌ను పెట్టకూడదని ఆదిత్య బిర్లా గ్రూపు యాజమాన్యాన్ని ఒప్పించాం. స్థానికులలో ఉన్న భయాందోళనలు పోగొట్టి, పరిశ్రమకు అనుమతులు మంజూరు చేశాం. వ్యర్థాల వల్ల నీరు కలుషితం కాకుండా టెక్నాలజీలో అనేక మార్పులు చేయించాం. ► గతంలో ఇదే ప్లాంట్‌లో ఉన్న మెర్క్యురీ మెంబ్రేన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాత పద్దతిలో మార్పు చేయించాం. ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా అడుగులు ముందుకు వేశాం. ► జీరో లిక్విడ్ వేస్ట్ విధానంలో లిక్విడ్‌వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా ఉండకూడదని యాజమాన్యాన్ని ఒప్పించగలిగాం. వీటన్నింటి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ప్రధానంగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) నిధులతో పరిశ్రమ పరిసర గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి ముఖచిత్ర జ్ఞాపికను వైఎస్ జగన్‌కు అందజేస్తున్న బిర్లా 131 మందిపై కేసుల ఎత్తివేతకు జీవో ► కంపెనీ ప్రతినిధుల కోసం మీ (వేదిక దిగువన ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు) అనుమతితో కొన్ని విషయాలు ఇంగ్లిష్‌లో చెబుతున్నా. ఇది ఆసియాలో అత్యాధునిక ప్లాంట్. దేశంలో కాస్టిక్ సోడా ఉత్పత్తిలో ఏకైక అతి పెద్ద యూనిట్. భవిష్యత్‌లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుంది. ► గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ పరిసర గ్రామాల్లో 131 మంది అమాయకులపై పాలకులు పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు పెట్టించారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ అక్రమ కేసులన్నింటినీ ఎత్తి వేసేందుకు ఈ రోజే జీవో 321 జారీ చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు భరత్‌రామ్, వంగా గీత, చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్ మాధవిలత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్లాంట్‌లో కలియదిరిగిన సీఎం తొలుత చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రత్యేక వాహనంలో సీఎం వైఎస్ జగన్‌తో కలిసి కలియదిరుగుతూ ప్లాంట్ పని తీరును స్వయంగా చూపించారు. కాలుష్య రహిత పరిశ్రమ కోసం వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూపు తరఫున వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన జగన్ ముఖచిత్ర జ్ఞాపికను కుమార మంగళం బిర్లా సీఎంకు స్వయంగా అందజేశారు. -
తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌తో పాటు ఈ కార్యక్రమానికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా హాజరుకానున్నారు. సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. అక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను కుమార మంగళం బిర్లాతో కలిసి సందర్శించిన అనంతరం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
వేగంగా కోవిడ్ పూర్వ స్థాయికి ఎకానమీ
న్యూఢిల్లీ: కరోనావైరస్ కొత్త వేరియంట్లు, మరిన్ని వేవ్‌లు రావడంపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు వేగంగా కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుతున్నాయని పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహమ్మారిపరమైన ఆర్థిక సమస్యలను అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు తోడ్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇక టీకాల ప్రక్రియ పుంజుకుంటోండటంతో థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనే సామర్థ్యాలను భారత్ మెరుగుపర్చుకోగలదని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా బిర్లా ఈ విషయాలు తెలిపారు. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ ప్రాజెక్టులకు సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెట్టుబడులు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడా మహమ్మారిని ఎదుర్కొనడంలో చెప్పుకోతగ్గ స్థాయిలో సామర్థ్యాలు కనబర్చాయని బిర్లా వివరించారు. ఉత్పాదకత, డిజిటైజేషన్ చర్యలు వేగవంతంగా అమలు చేశాయని తెలిపారు. -
వొడాఫోన్ భవిష్యత్‌పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) విషయంలో భవిష్యత్‌లో పాటించాల్సిన కార్యాచరణపై బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. దీనిపై తగు నిర్ణయం తీసుకునేందుకు త్వరలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు సూచనప్రాయంగా ఈ విషయాలు తెలిపారు. వీఐఎల్ విషయంలో కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బ్యాంకింగ్ పరిశ్రమకు కాస్త ఆందోళనకరమైనవి ఆయన పేర్కొన్నారు. వొడాఫోన్ ఐడియాకి తామిచ్చిన రుణాలు స్వల్పస్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ కేఎం బిర్లా చేసిన ప్రకటనకు సంబంధించి కార్యాచరణపై ఇతర బ్యాంకర్లతో కచ్చితంగా చర్చిస్తామని మల్లికార్జున రావు పేర్కొన్నారు. వీఐఎల్ని గట్టెక్కించడానికి ఆ సంస్థలో తనకున్న వాటాలను ప్రభుత్వం లేదా ఏ ఇతర కంపెనీకైనా అందించేందుకు తాను సిద్ధమంటూ కేఎం బిర్లా ప్రకటించడం తెలిసిందే. మరోవైపు, వీఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాంశు కపానియా ఈ పదవిలో నియమితులైనట్లు పేర్కొంది. లీజు బకాయిలు మొదలైనవన్నీ కలిపి 2021 మార్చి 31 నాటికి వీఐఎల్ స్థూల రుణభారం రూ. 1,80,310 కోట్లుగా ఉంది. ప్రైవేట్ టెల్కోలు మూడు ఉండాలి: ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ భారత్ వంటి పెద్ద దేశంలో ప్రైవేట్ టెలికం సంస్థలు 3 అయినా ఉండాలని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. రుణ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వొడాఫోన్ ఐడియా నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో విఠల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ వంటి పెద్ద దేశంలో.. ప్రైవేట్ రంగంలో 3 సంస్థలు మనుగడ సాగించడమే కాకుండా నిలదొక్కుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎయిర్టెల్ క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అత్యంత తక్కువగా ఉందని, ఇది రూ. 200, ఆ తర్వాత 300కి పెరగాల్సి ఉంటుందన్నారు. ఇది పెరిగితే పరిశ్రమ కచ్చితంగా తనంత తానుగా నిలదొక్కుకోగలదని విఠల్ తెలిపారు. -
మూడు నెలలైనా ఆగాల్సిందే : కేఎం బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: దూకుడు మీదున్న ఫైనాన్షియల్ మార్కెట్లలో పొంగు ఎంతమేరకు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఇదే ఉత్సాహం కొనసాగుతుందా, లేదా అన్నది తెలియాలంటే కనీసం మరో త్రైమాసికం అయినా వేచి చూడాలన్నారు. గడిచిన ఏడాది గురించి మాట్లాడుతూ..కరోనా మహమ్మారి ఎంతో నష్టానికి కారణమైందన్నారు. వ్యక్తిగత జీవితంలో అయినా, వ్యాపారంలో అయినా కోమార్బిడిటీల (ఒకటికి మించిన సమస్యలు)ను నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు.సంక్షోభాల నుంచి బలంగా అవతరించేందుకు విజ్ఞాన నిల్వలు, ఆలోచనలు, సహకారం, మంచి పేరును సంపాదించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎక్కువ మంది సమర్థిస్తున్న తరుణంలో.. కార్యాలయ ప్రాధాన్యం గురించి బిర్లా మాట్లాడారు. కార్యాలయం అన్నది ఉద్యోగులు వచ్చి పనిచేసే కేవలం ఒక స్థలం మాత్రమే కాదని.. ప్రజలు, ఆలోచనలు, సంభాషణలన్నింటినీ కరిగించి, ఫలితాన్ని వెలికితీసే వేదికగా పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పరుగు ఎంత కాలం పాటు కొనసాగుతుందీ చెప్పాలంటే, కనీసం మరో మూడు నెలలు చూస్తే కానీ చెప్పలేమన్నారు. అప్‌ట్రెండ్ పరిమితమే: బీఓఎఫ్ఐ అంచనా కాగా, భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అప్‌సైడ్ ట్రెండ్ కొంతకాలమే ఉంటుందని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. నిఫ్టీ 15వేల మార్కుని అందుకున్నప్పటికీ.., ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ స్థాయిలోపే ట్రేడ్ అవుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఆర్థిక, మెటల్, స్టీల్ రంగాలపై ‘‘ఓవర్‌వెయిట్’’ వైఖరిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లో (ఏబీఎఫ్ఆర్ఎల్) 7.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటాలు దక్కే విధంగా ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. షేరు ఒక్కింటి ధర రూ. 205గా ఉంటుందని పేర్కొంది. గురువారం నాటి షేరు ముగింపు ధర రూ. 153.4తో పోలిస్తే ఇది 33.6 శాతం అధికం. షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ప్రస్తుత ప్రమోటర్ల వాటా 55.1 శాతంగా ఉంటుంది. ‘భారత్‌లో దుస్తుల పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. భవిష్యత్ అవకాశాలపై గల ధీమాకు ఈ డీల్ నిదర్శనం. పటిష్టమైన ఫండమెంటల్స్ ఊతంతో దేశీయంగా ఫ్యాషన్ రిటైల్ గణనీయ వృద్ధి సాధించగలదు‘ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. డీల్ ద్వారా వచ్చే నిధులను వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ‘నాణ్యత, విలువను కోరుకునే దేశీ వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సేవలు అందించేందుకు తోడ్పడే కొత్త భాగస్వామ్యాలను నిర్మించుకోవడంపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 3,000 పైగా స్టోర్స్..: భారీ మార్జిన్లు ఉండే ఫ్యాషన్ వ్యాపారంలో స్థానం దక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏబీఎఫ్ఆర్ఎల్ పోర్ట్‌ఫోలియోలో పలు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు ఉండటం ఫ్లిప్‌కార్ట్‌కు లాభించనుంది. అమెజాన్‌డాట్‌కామ్, రిలయన్స్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, మార్చి 31 నాటికి దాదాపు రూ. 2,776 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఏబీఎఫ్ఆర్ఎల్కు కూడా ఈ డీల్ ఉపయోగకరంగా ఉండనుంది. ఫరెవర్ 21, అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్, రాల్ఫ్ లారెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయానికి అదిత్య బిర్లా ఫ్యాషన్‌కు హక్కులు ఉన్నాయి. ప్యాంటలూన్స్తో పాటు దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు స్టోర్స్ నెట్వర్క్ ఉంది. సుమారు 23,700 పైగా మల్టీబ్రాండ్ అవుట్‌లెట్స్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది. తమ వృద్ధి ప్రణాళికలకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఏబీఎఫ్ఆర్ఎల్ ఎండీ ఆశీష్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ షేరు సుమారు 8 శాతం పెరిగి రూ.165 వద్ద క్లోజయ్యింది. -
ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత
హైదరాబాద్: ఏపీలో బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. ఏపీలో బిట్స్ ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో భూములు కేటాయించేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారు.