తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తున్న సీఎం జగన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. చిత్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు
పారిశ్రామిక రంగంలో ఏపీ మరింత పురోగమించేలా బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎంతో ఆసక్తితో ఉన్నాం. ఏపీలోని విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మానవ వనరులకు తోడు అన్ని విధాలా సహకారం అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా. జగన్ మంచి విజన్ ఉన్న యువ ముఖ్యమంత్రి.
– కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పర్యవసానంగా ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేస్తున్నారని చెప్పారు. అనుమతులను సరళతరం చేయడంతో పాటు ఎలాంటి సాయం కావాలన్నా వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలన్నింటి వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్‌ను గురువారం ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి కంపెనీలు ఎంతో నమ్మకంతో రాష్ట్రంలో అడుగులు వేయడంతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
చాలా ఆనందంగా ఉంది
► ఈ రోజు ఒక మంచి రోజు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు. మొత్తం మూడు విడతల్లో పూర్తయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.
► ప్రత్యక్షంగా 1,300, పరోక్షంగా 1,150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గొప్ప కార్యక్రమం ఇది. దేశ వ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్ విలువ, దాదాపుగా లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా. ఇలాంటి వాళ్లు మన ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడకు వచ్చి పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామం.
► నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇచ్చే విధంగా ప్రత్యేకంగా చట్టాన్నే తీసుకువచ్చాం. వీళ్లు (ఆదిత్య బిర్లా గ్రూపు) ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ పరిశ్రమ స్థాపనకు చూపిన చొరవతో దేశంలో మిగిలిన వారందరికీ గొప్ప ముందడుగు అవుతుంది.
కాలుష్యానికి తావు లేకుండా చర్యలు
► ఇదివరకు 2010–12 మధ్య పరిశ్రమ ఏర్పాటులో కంపెనీ రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు దానిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. చివరకు గ్రాసిమ్ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టి అడుగులు ముందుకేసింది.
► పరిశ్రమలు ఏర్పాటైతే వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో నెలకొన్న భయాలను పొగొట్టకుండా గత పాలకులు ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు చేశారు.
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తూ ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్లు పెట్టుబడులు రావడమే కాకుండా, సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేశాం.
► కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే దాని వల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని, అందువల్ల ఆ ప్లాంట్‌ను పెట్టకూడదని ఆదిత్య బిర్లా గ్రూపు యాజమాన్యాన్ని ఒప్పించాం. స్థానికులలో ఉన్న భయాందోళనలు పోగొట్టి, పరిశ్రమకు అనుమతులు మంజూరు చేశాం. వ్యర్థాల వల్ల నీరు కలుషితం కాకుండా టెక్నాలజీలో అనేక మార్పులు చేయించాం.
► గతంలో ఇదే ప్లాంట్‌లో ఉన్న మెర్క్యురీ మెంబ్రేన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాత పద్దతిలో మార్పు చేయించాం. ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా అడుగులు ముందుకు వేశాం.
► జీరో లిక్విడ్ వేస్ట్ విధానంలో లిక్విడ్‌వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా ఉండకూడదని యాజమాన్యాన్ని ఒప్పించగలిగాం. వీటన్నింటి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ప్రధానంగా సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) నిధులతో పరిశ్రమ పరిసర గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు.
ముఖ్యమంత్రి ముఖచిత్ర జ్ఞాపికను వైఎస్ జగన్‌కు అందజేస్తున్న బిర్లా
131 మందిపై కేసుల ఎత్తివేతకు జీవో
► కంపెనీ ప్రతినిధుల కోసం మీ (వేదిక దిగువన ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు) అనుమతితో కొన్ని విషయాలు ఇంగ్లిష్‌లో చెబుతున్నా. ఇది ఆసియాలో అత్యాధునిక ప్లాంట్. దేశంలో కాస్టిక్ సోడా ఉత్పత్తిలో ఏకైక అతి పెద్ద యూనిట్. భవిష్యత్‌లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుంది.
► గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ పరిసర గ్రామాల్లో 131 మంది అమాయకులపై పాలకులు పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు పెట్టించారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ అక్రమ కేసులన్నింటినీ ఎత్తి వేసేందుకు ఈ రోజే జీవో 321 జారీ చేస్తున్నాం.
► ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు భరత్‌రామ్, వంగా గీత, చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్ మాధవిలత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్లాంట్‌లో కలియదిరిగిన సీఎం
తొలుత చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రత్యేక వాహనంలో సీఎం వైఎస్ జగన్‌తో కలిసి కలియదిరుగుతూ ప్లాంట్ పని తీరును స్వయంగా చూపించారు. కాలుష్య రహిత పరిశ్రమ కోసం వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూపు తరఫున వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన జగన్ ముఖచిత్ర జ్ఞాపికను కుమార మంగళం బిర్లా సీఎంకు స్వయంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment