వైఎస్‌ జగన్: ఏపీకి ప్రత్యేక బలం ఉంది | YS Jagan Review Meeting on Mana Palana - Mee Suchana - Sakshi Telugu
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్‌

Published Thu, May 28 2020 12:48 PM | Last Updated on Fri, May 29 2020 7:54 PM

Mana Palana Mee Suchana : YS Jagan Review On Industrial Sector - Sakshi

సాక్షి, తాడేపల్లి : హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్‌ చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ గ్రాఫిక్స్‌తో కాలం గడిపింది. గత ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టింది.

వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం.. 
గత ప్రభుత్వ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ అంటూ క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలు చేశారు తప్ప.. చేసిందేమీ లేదు. వారి అనుకూల మీడియా కూడా అబద్ధాలు ప్రచారం చేసింది. మాట ఇచ్చిందే చేస్తామని చెప్పాం. నిజాయితీ, నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం, ఇదే విషయాన్ని పరిశ్రమలకు చెప్పాం. మౌలిక సదుపాయల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్‌ఆర్‌ సీపీ ఉంది. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది.. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ ఉంది. నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయి. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుంది.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యుడిషీయల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటు చేశాం. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది.

కియా వెళ్లిపోయిందని ప్రచారం చేశారు..
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు.. బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రాథమికస్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తున్నాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. కియా వెళ్లిపోతుందంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్పచారం చేసింది. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీలో మంచి ప్రభుత్వం ఉంది.. మేమెందుకు వెళ్తామని చెప్పింది. 

కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 90వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఈ పరిశ్రమలను కాపాడుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు.. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించాం. మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సుమారు రూ.1200 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. రూ.15వేల కోట్లతో కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు. స్టీల్‌ప్లాంట్‌ అభివృద్ధి కోసం ప్రైవేట్‌ కంపెనీలు ముందుకొస్తే... వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 


ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది..
హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement