సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికరంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలు చేపట్టారు. గత ఏడాది కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు)పై ఎక్కువ ప్రభావం పడింది. అయితే, రాష్ట్రంలోని పరిశ్రమలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేయూతనివ్వడంతో ఇక్కడి ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకోవడమే కాదు.. కొత్త పరిశ్రమలూ క్యూ కడుతున్నాయి.
కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రాయితీలు సకాలంలో ఇస్తుండటం, కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రెండు విడతల్లో రూ.2,086 కోట్లపైన ఇచ్చింది. ఇతరత్రా సహాయ సహకారాలు అందించింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం బకాయిలేమీ లేకుండా ప్రభుత్వ పరంగా చెల్లించాల్సినవి ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ప్రభుత్వ చర్యలతో అత్యధిక ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి రాష్ట్రం వేదికగా మారుతోంది. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం సీఎంగా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఏడాది (2021) డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 19,997 ఎంఎస్‌ఎంఈలు కొత్తగా ఏర్పాటయ్యాయి.
ఈ యూనిట్ల ద్వారా రూ.4,558.01 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1,09,829 మందికి ఉపాధి లభించింది. గడిచిన 12 నెలల్లోనే 6,875 యూనిట్ల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఏర్పాటు కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.2,055.01 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 45,932 మందికి ఉపాధి లభిస్తోంది. చిన్న పరిశ్రమలకు అందిస్తున్న సహకారం రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ప్రస్తుత పారిశ్రామిక బకాయిలు సకాలంలో అందిస్తున్నారని ఫ్యాఫ్సియా అధ్యక్షులు వి.మురళీకృష్ణ తెలిపారు. కోవిడ్ కారణంగా పరిశ్రమలు మూతపడే సమయంలో రాయితీలు ఇవ్వడం ద్వారా పరిశ్రమ నిలబడటానికి ప్రభుత్వం ఊతమిచ్చిందని చెప్పారు. కోవిడ్‌తో ఏర్పడిన సమస్యలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధి
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు అన్ని సదుపాయాలు ఒకేచోట లభించేలా మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధితో పాటు ఎంఎస్‌ఈసీడీపీ పథకం కింద వివిధప్రాజెక్టులను చేపట్టింది. రూ.214 కోట్లతో ఎంఎస్‌ఎం ఈ క్లస్టర్లు, కా మన్ ఫెసిలిటీ సెంటర్లను అభి వృద్ధి చేస్తోంది. రూ.27.60 కోట్లతో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఆరుచోట్ల రూ.75.76 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్స్‌ను, రూ.95.53 కోట్లతో మరో ఆరు ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తోంది. రూ.15.11 కోట్లతో ఫ్లాట ర్డ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోంది.రాష్ట్ర పారిశ్రామిక విధానం 2020–23లో ఎం ఎస్‌ఎంఈలకు ప్రత్యేక రాయితీలివ్వడం, కొత్తగా ఏర్పాటుచేసే సంస్థలకు ప్రతిపాదనలు ద గ్గర నుంచి ఉత్పత్తి మొదలయ్యేవరకు సహకా రం అందించేలా సిడ్బీతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రంవైపు చూసేలా చేస్తోందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment