న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) విషయంలో భవిష్యత్‌లో పాటించాల్సిన కార్యాచరణపై బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. దీనిపై తగు నిర్ణయం తీసుకునేందుకు త్వరలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు సూచనప్రాయంగా ఈ విషయాలు తెలిపారు. వీఐఎల్ విషయంలో కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బ్యాంకింగ్ పరిశ్రమకు కాస్త ఆందోళనకరమైనవి ఆయన పేర్కొన్నారు.
వొడాఫోన్ ఐడియాకి తామిచ్చిన రుణాలు స్వల్పస్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ కేఎం బిర్లా చేసిన ప్రకటనకు సంబంధించి కార్యాచరణపై ఇతర బ్యాంకర్లతో కచ్చితంగా చర్చిస్తామని మల్లికార్జున రావు పేర్కొన్నారు. వీఐఎల్‌ని గట్టెక్కించడానికి ఆ సంస్థలో తనకున్న వాటాలను ప్రభుత్వం లేదా ఏ ఇతర కంపెనీకైనా అందించేందుకు తాను సిద్ధమంటూ కేఎం బిర్లా ప్రకటించడం తెలిసిందే. మరోవైపు, వీఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాంశు కపానియా ఈ పదవిలో నియమితులైనట్లు పేర్కొంది. లీజు బకాయిలు మొదలైనవన్నీ కలిపి 2021 మార్చి 31 నాటికి వీఐఎల్ స్థూల రుణభారం రూ. 1,80,310 కోట్లుగా ఉంది.
ప్రైవేట్ టెల్కోలు మూడు ఉండాలి: ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్
భారత్ వంటి పెద్ద దేశంలో ప్రైవేట్ టెలికం సంస్థలు 3 అయినా ఉండాలని టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. రుణ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వొడాఫోన్ ఐడియా నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో విఠల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ వంటి పెద్ద దేశంలో.. ప్రైవేట్ రంగంలో 3 సంస్థలు మనుగడ సాగించడమే కాకుండా నిలదొక్కుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎయిర్‌టెల్ క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) అత్యంత తక్కువగా ఉందని, ఇది రూ. 200, ఆ తర్వాత 300కి పెరగాల్సి ఉంటుందన్నారు. ఇది పెరిగితే పరిశ్రమ కచ్చితంగా తనంత తానుగా నిలదొక్కుకోగలదని విఠల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment