debt crisiss
-
వొడాఫోన్ భవిష్యత్‌పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) విషయంలో భవిష్యత్‌లో పాటించాల్సిన కార్యాచరణపై బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. దీనిపై తగు నిర్ణయం తీసుకునేందుకు త్వరలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు సూచనప్రాయంగా ఈ విషయాలు తెలిపారు. వీఐఎల్ విషయంలో కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బ్యాంకింగ్ పరిశ్రమకు కాస్త ఆందోళనకరమైనవి ఆయన పేర్కొన్నారు. వొడాఫోన్ ఐడియాకి తామిచ్చిన రుణాలు స్వల్పస్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ కేఎం బిర్లా చేసిన ప్రకటనకు సంబంధించి కార్యాచరణపై ఇతర బ్యాంకర్లతో కచ్చితంగా చర్చిస్తామని మల్లికార్జున రావు పేర్కొన్నారు. వీఐఎల్ని గట్టెక్కించడానికి ఆ సంస్థలో తనకున్న వాటాలను ప్రభుత్వం లేదా ఏ ఇతర కంపెనీకైనా అందించేందుకు తాను సిద్ధమంటూ కేఎం బిర్లా ప్రకటించడం తెలిసిందే. మరోవైపు, వీఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాంశు కపానియా ఈ పదవిలో నియమితులైనట్లు పేర్కొంది. లీజు బకాయిలు మొదలైనవన్నీ కలిపి 2021 మార్చి 31 నాటికి వీఐఎల్ స్థూల రుణభారం రూ. 1,80,310 కోట్లుగా ఉంది. ప్రైవేట్ టెల్కోలు మూడు ఉండాలి: ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ భారత్ వంటి పెద్ద దేశంలో ప్రైవేట్ టెలికం సంస్థలు 3 అయినా ఉండాలని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. రుణ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వొడాఫోన్ ఐడియా నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో విఠల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ వంటి పెద్ద దేశంలో.. ప్రైవేట్ రంగంలో 3 సంస్థలు మనుగడ సాగించడమే కాకుండా నిలదొక్కుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎయిర్టెల్ క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అత్యంత తక్కువగా ఉందని, ఇది రూ. 200, ఆ తర్వాత 300కి పెరగాల్సి ఉంటుందన్నారు. ఇది పెరిగితే పరిశ్రమ కచ్చితంగా తనంత తానుగా నిలదొక్కుకోగలదని విఠల్ తెలిపారు. -
కష్టాల్లో ‘కెప్టెన్’.. ఆస్తులు వేలం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చేత కెప్టెన్ అని ప్రేమగా పిలిపించుకునే డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. విజయకాంత్ చెల్లించాల్సిన రూ.5.50 కోట్ల అప్పుబకాయిని రాబట్టుకునేందుకు ఆయన ఇళ్లు, ఇంజినీరింగ్ కాలేజీని వేలం వేయనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. చెన్నై సాలిగ్రామంలోని లగ్జరీ ఇంట్లో ఆయన కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. అలాగే చెన్నై శివార్లు చెంగల్పట్టు సమీపంలోని మామండూరులో శ్రీ ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఆండాళ్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ ఆర్థిక అవసరాలకు అదనంగా డబ్బు అవసరమైంది. అలాగే ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నెలరోజులకు పైగా అమెరికాలో చికిత్స పొందారు. ఇలాంటి అదనపు ఆర్థిక అవసరాల కోసం ఆయన అప్పులు చేయాల్సి వచ్చింది. చెన్నై మౌంట్‌రోడ్డులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆయన అప్పు తీసుకున్నారు. మధురాంతకంలోని కాలేజీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. అలాగే కాలేజీ అవసరాల కోసం అప్పు అవసరం కావడంతో బ్యాంకు రుణానికి జామీనుదారులుగా విజయకాంత్ ఆయన సతీమణి ప్రేమలత సంతకాలు చేశారు. ఈ రుణం కోసం అదనంగా తన నివాసంతోపాటూ సాలిగ్రామంలోని మరో ఇళ్లను సైతం తనఖా పెట్టారు. ఇలా పలురూపాల్లో తీసుకున్న అప్పు వడ్డీతో కలుపుకుని రూ. 5,52,73,825 కు చేరుకుంది. ఇందుకు సంబంధించి డబ్బు లేదా కనీసం వడ్డీని కూడా విజయకాంత్ గత కొంతకాలంగా చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఇటీవల నోటీసులు జారీచేసినా ఆయన స్పందించలేదు. దీంతో తనఖా పెట్టిన విజయకాంత్ ఆస్తులను వేలం వేసి బకాయి రాబట్టుకునేందుకు బ్యాంకు నిర్ణయించుకుంది. విజయకాంత్‌కు చెందిన స్థిరాస్తులను జూలై 26వ తేదీన వేలం వేయనున్నట్లు శుక్రవారం బహిరంగ ప్రకటన చేసింది. చట్టపరంగా కాపాడుకుంటాం: ప్రేమలత విజయకాంత్ ఆస్తుల వేలం వార్త శుక్రవారం సాయంత్రానికి అన్ని మాధ్యమాల్లో మార్మోగిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఎదరువుతాయోనని ఆందోళన చెందారు. కెప్టెన్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అవేదనను వ్యక్తం చేశారు. పలు తమిళమీడియా ప్రతినిధులు సైతం సాలిగ్రామంలోని విజయకాంత్ ఇంటికి వద్దకు రాగా ఆయన సతీమణి ప్రేమలత మాట్లాడుతూ, విజయకాంత్ జీవితం తెరిచిన పుస్తకం, ఎలాంటి దాపరికాలు లేవని అన్నారు. ఆయన సినిమాలు చేయడం లేదు, రాజకీయాల కోసం డబ్బు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంజినీరింగ్ విద్యకు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో మా కాలేజీనే కాదు అన్ని కాలేజీల్లో సరైన అడ్మిషన్లు లేవు. ఇలా పలుకోణాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంకు బకాయిలు చెల్లించలేకపోయాం. అయినా మించిపోలేదు, ఆస్తులు వేలంలోకి వెళ్లకుండా చట్టపరంగా ఎదుర్కొంటాం అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కరీంనగర్: పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. అకాలవర్షానికి పంట నష్టంతో పాటు అప్పులబాధ ఎక్కువ కావడంతో ఆకుల శ్రీనివాస్(43) అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.