సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చేత కెప్టెన్ అని ప్రేమగా పిలిపించుకునే డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. విజయకాంత్ చెల్లించాల్సిన రూ.5.50 కోట్ల అప్పుబకాయిని రాబట్టుకునేందుకు ఆయన ఇళ్లు, ఇంజినీరింగ్ కాలేజీని వేలం వేయనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. చెన్నై సాలిగ్రామంలోని లగ్జరీ ఇంట్లో ఆయన కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. అలాగే చెన్నై శివార్లు చెంగల్పట్టు సమీపంలోని మామండూరులో శ్రీ ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఆండాళ్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ ఆర్థిక అవసరాలకు అదనంగా డబ్బు అవసరమైంది.
అలాగే ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నెలరోజులకు పైగా అమెరికాలో చికిత్స పొందారు. ఇలాంటి అదనపు ఆర్థిక అవసరాల కోసం ఆయన అప్పులు చేయాల్సి వచ్చింది. చెన్నై మౌంట్‌రోడ్డులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆయన అప్పు తీసుకున్నారు. మధురాంతకంలోని కాలేజీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. అలాగే కాలేజీ అవసరాల కోసం అప్పు అవసరం కావడంతో బ్యాంకు రుణానికి జామీనుదారులుగా విజయకాంత్ ఆయన సతీమణి ప్రేమలత సంతకాలు చేశారు. ఈ రుణం కోసం అదనంగా తన నివాసంతోపాటూ సాలిగ్రామంలోని మరో ఇళ్లను సైతం తనఖా పెట్టారు. ఇలా పలురూపాల్లో తీసుకున్న అప్పు వడ్డీతో కలుపుకుని రూ. 5,52,73,825 కు చేరుకుంది. ఇందుకు సంబంధించి డబ్బు లేదా కనీసం వడ్డీని కూడా విజయకాంత్ గత కొంతకాలంగా చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఇటీవల నోటీసులు జారీచేసినా ఆయన స్పందించలేదు. దీంతో తనఖా పెట్టిన విజయకాంత్ ఆస్తులను వేలం వేసి బకాయి రాబట్టుకునేందుకు బ్యాంకు నిర్ణయించుకుంది. విజయకాంత్‌కు చెందిన స్థిరాస్తులను జూలై 26వ తేదీన వేలం వేయనున్నట్లు శుక్రవారం బహిరంగ ప్రకటన చేసింది.
చట్టపరంగా కాపాడుకుంటాం: ప్రేమలత
విజయకాంత్ ఆస్తుల వేలం వార్త శుక్రవారం సాయంత్రానికి అన్ని మాధ్యమాల్లో మార్మోగిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఎదరువుతాయోనని ఆందోళన చెందారు. కెప్టెన్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అవేదనను వ్యక్తం చేశారు. పలు తమిళమీడియా ప్రతినిధులు సైతం సాలిగ్రామంలోని విజయకాంత్ ఇంటికి వద్దకు రాగా ఆయన సతీమణి ప్రేమలత మాట్లాడుతూ, విజయకాంత్ జీవితం తెరిచిన పుస్తకం, ఎలాంటి దాపరికాలు లేవని అన్నారు. ఆయన సినిమాలు చేయడం లేదు, రాజకీయాల కోసం డబ్బు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంజినీరింగ్ విద్యకు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో మా కాలేజీనే కాదు అన్ని కాలేజీల్లో సరైన అడ్మిషన్లు లేవు. ఇలా పలుకోణాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంకు బకాయిలు చెల్లించలేకపోయాం. అయినా మించిపోలేదు, ఆస్తులు వేలంలోకి వెళ్లకుండా చట్టపరంగా ఎదుర్కొంటాం అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment