న్యూఢిల్లీ: కొత్త వెంచర్ అయిన డెకరేటివ్ పెయింట్స్ వ్యాపార విభాగం నుంచి వచ్చే మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. అప్పటికల్లా లాభాల్లోకి మళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిర్లా ఓపస్ బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంతో పాటు మూడు పెయింట్ ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు.
పానిపట్ (హరియాణ), లూధియానా (పంజాబ్), చెయ్యార్ (తమిళనాడు)లో ఈ ప్లాంట్లు ఉన్నాయి. బిర్లా ఓపస్ పెయింట్లు మార్చి నుంచి పంజాబ్, హరియాణ, తమిళనాడులో లభ్యమవుతాయి. జూలై నుంచి 1 లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇవి లభిస్తాయని బిర్లా చెప్పారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 6,000 పట్టణాలకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు.
గ్రూప్‌లో కీలకమైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతేడాది డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి రూ. 10,000 కోట్లతో దేశీయంగా ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ. 5,000 కోట్లు వెచి్చంచినట్లు బిర్లా ఓపస్ బిజినెస్ హెడ్ హిమాంశు కపానియా తాజాగా చెప్పారు. దేశీయంగా డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్ దాదాపు రూ. 80,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ (డ్యూలక్స్) ఈ విభాగంలో దిగ్గజాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment