ప్రభుత్వ బ్యాంకులకు భారీ నిధులు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.17,800 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. బాండ్ల జారీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ తదితర మార్గాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు సమీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు యోచిస్తున్నాయి. టైర్–వన్, టైర్–టూ బాండ్ల ద్వారా రూ.6,350 కోట్లు సమీకరించడానికి శుక్రవారం జరిగిన యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లేదా రైట్స్ ఇస్యూ ద్వారా మరో రూ.4,950 కోట్లు సమీకరించాలని కూడా ఈ బ్యాంక్ యోచిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాసిల్–త్రి అదనపు టైర్–వన్ బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీఓ/రైట్స్ ఇష్యూ/క్విప్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించే విషయం వచ్చే వారం జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో పరిశీలనకు రానున్నదని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెల్లడించింది. షేర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు సమీకరించనున్నట్లు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పేర్కొంది.