ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్‌లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను కోరారు.
ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది.
అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త
కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్‌సీఎల్‌టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment