ముంబై: పతంజలి ఆయుర్వేద్ గ్రూప్‌లో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్ తాజాగా మార్చ్ 24న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి రానుంది. దీని ద్వారా సుమారు రూ. 4,300 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీవోకి సంబంధించి ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ. 615–650గా నిర్ణయించారు. దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కొన్న తర్వాత తిరిగి లిస్ట్ అవుతున్న తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి.
లోయర్ బ్యాండ్ ప్రకారం 19 శాతం – 18 శాతం వాటాలను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మరో 6–7 శాతాన్ని 2022 డిసెంబర్‌లోగా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పబ్లిక్ వాటా ఉండాలి. ఎస్‌బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.
రుణాల చెల్లింపునకు రూ. 3వేల కోట్లు..
ఎఫ్‌పీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 3,300 కోట్లను రుణాలను తీర్చేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రాందేవ్ చెప్పారు. రుచి సోయా, పతంజలిని అంతర్జాతీయంగా ఫుడ్ బ్రాండ్స్‌గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. బ్రాండెడ్ ఫుడ్, న్యూట్రాస్యూటికల్స్, వంట నూనెలు, హెల్త్..వెల్‌నెస్ ఉత్పత్తుల కింద గ్రూప్ వ్యాపారాలు మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటాయని రాందేవ్ పేర్కొన్నారు.
రుచి సోయా కథ ఇదీ..
అతి పెద్ద బ్రాండెడ్ వంట నూనెల సంస్థల్లో రుచి సోయా కూడా ఒకటి. రుచి గోల్డ్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే పామాయిల్ బ్రాండ్స్‌లో ఒకటి. మహాకోష్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి సన్‌లైట్ వంటి ఇతర బ్రాండ్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. ఇక న్యూట్రెలా పేరిట సోయా ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటా ఉంది. బ్యాంకులకు దాదాపు రూ. 9,345 కోట్ల మేర రుణాలు రుచి సోయా బాకీ పడటంతో 2017 డిసెంబర్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించింది. 2018 డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో రుచి సోయాను పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు వెచ్చించింది. టేకోవర్ తర్వాత రుచి సోయా .. బిస్కెట్లు, కుకీలు, రస్కులు, నూడుల్స్ మొదలైన ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment