Ruchi Soya Industries
-
ఎఫ్‌పీవో యోచన లేదు: పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి (ఎఫ్‌పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్‌లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్‌నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్‌పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి. -
బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్ద ఫుడ్ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్ ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్నెస్ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది. పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్‌లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు. చదవండి: గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..! -
మాకు అప్పులే లేవు..బ్యాంకులకు వేలకోట్లు చెల్లించేశాం!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ రుణరహితంగా ఆవిర్భవించినట్లు తాజాగా ప్రకటించింది. బ్యాంకులకు చెల్లించవలసిన రూ.2,925 కోట్లను చెల్లించినట్లు తెలియజేసింది. దీంతో పూర్తిస్థాయిలో రుణ భారానికి చెక్ పెట్టినట్లు వెల్లడించింది. బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద గ్రూప్ కంపెనీ రుచీ సోయా ఇటీవల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)ను చేపట్టిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 4,300 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఈ నిధులతో కొంతమేర రుణ చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా తెలియజేసింది. రుచీ సోయా రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ తాజాగా ట్వీట్ చేశారు. కాగా..ఎఫ్‌పీవో కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో రుచీ సోయా రూ. 1,950 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు పేర్కొన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే రూ.2,925 కోట్లను ఇందుకు వెచ్చించడం గమనార్హం! స్టేట్‌బ్యాంక్ అధ్యక్షతన బ్యాంకు ల కన్సార్షియంకు చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా పేర్కొంది. ఈ కన్సార్షియంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నాయి. 2019లో దివాలా చట్ట ప్రక్రి యలో భాగంగా రుచీ సోయాను రూ. 4,350 కోట్లకు పతంజలి సొంతం చేసుకున్న విషయం విదితమే. కాగా, రుణ చెల్లింపుల వార్తల నేపథ్యంలో రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 938 వద్ద ముగిసింది. చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
రుచీ సోయా ఎఫ్‌పీవో ఓకే, కేటుగాళ్లకు చెక్‌పెట్టిన సెబీ!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ ఎఫ్‌పీవో పూర్తయ్యింది. ఇష్యూకి రూ. 650 ధరను ఖరారు చేసింది. అయితే 97 లక్షల బిడ్స్ ఉపసంహరణకు లోనయ్యాయి. షేరుకి రూ. 615–650 ధరలో రూ. 4,300 కోట్ల సమీకరణకు కంపెనీ ఎఫ్‌పీవో చేపట్టింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అవసరమైతే ఇన్వెస్టర్లు బిడ్స్‌ను ఉపసంహరించేందుకు వీలు కల్పించమని కంపెనీని ఆదేశించింది. షేర్ల విక్రయంపై అయాచిత ఎస్ఎంఎస్లు సర్క్యులేట్కావడంతో సెబీ అనూహ్యంగా స్పందించింది. దీంతో ఈ నెల 28న ముగిసిన ఇష్యూలో భాగంగా 30వరకూ బిడ్స్ ఉపసంహరణకు రుచీ సోయా అవకాశమిచ్చింది. బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని రుచీ సోయా ఎఫ్‌పీవో కోసం 4.89 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 17.6 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం రూ. 650 ధరను ఖరారు చేసింది. గత వారం ఈ సంస్థలకు 1.98 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1,290 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మహాకోష్, సన్‌రిచ్, రుచీ గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్లు పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచీ సోయా సొంతం. రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 937 వద్ద ముగిసింది. -
నంబర్ వన్‌పై రుచీ సోయా గురి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని లక్షిస్తున్నట్లు పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ చీఫ్ బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేదతోపాటు అనుబంధ సంస్థ రుచీ సోయా ఇండస్ట్రీస్ టర్నోవర్ రూ. 35,000 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. రుచీ సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) ప్రారంభంకానున్న సందర్భంగా రామ్‌దేవ్ విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. రానున్న కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ నుంచి ఫుడ్ బిజినెస్‌ను విడదీసి లిస్టెడ్ కంపెనీ రుచీ సోయాలో విలీనం చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయాను టాప్ ర్యాంక్ కంపెనీగా నిలపాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ రూ. 45,996 కోట్ల టర్నోవర్ సాధించినట్లు ప్రస్తావించారు. షేరుకి రూ. 615–650 గురువారం(24) నుంచి ప్రారంభమైన రుచీ సోయా ఎఫ్‌పీవో ఈ నెల 28న(సోమవారం) ముగియనుంది. షేరుకి రూ. 615–650 ధరల శ్రేణిలో ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 4,300 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా రుణరహితంగా మారాలని రుచీ సోయా ఆశిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,290 కోట్లు అందుకుంది. కాగా.. పతంజలి గ్రూప్‌లోగల పలు కంపెనీలను దశలవారీగా లిస్టింగ్ చేయనున్నట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేశాక పతంజలి గ్రూప్ నాన్‌ఫుడ్, సంప్రదాయ ఔషధాలు, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా 2019లో రుచీ సోయాను పతంజలి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌పీవో నేపథ్యంలో రుచీ సోయా షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 873 వద్ద ముగిసింది. -
24 నుంచి రుచి సోయా ఎఫ్‌పీవో
ముంబై: పతంజలి ఆయుర్వేద్ గ్రూప్‌లో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్ తాజాగా మార్చ్ 24న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి రానుంది. దీని ద్వారా సుమారు రూ. 4,300 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీవోకి సంబంధించి ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ. 615–650గా నిర్ణయించారు. దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కొన్న తర్వాత తిరిగి లిస్ట్ అవుతున్న తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి. లోయర్ బ్యాండ్ ప్రకారం 19 శాతం – 18 శాతం వాటాలను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మరో 6–7 శాతాన్ని 2022 డిసెంబర్‌లోగా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పబ్లిక్ వాటా ఉండాలి. ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపునకు రూ. 3వేల కోట్లు.. ఎఫ్‌పీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 3,300 కోట్లను రుణాలను తీర్చేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రాందేవ్ చెప్పారు. రుచి సోయా, పతంజలిని అంతర్జాతీయంగా ఫుడ్ బ్రాండ్స్‌గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. బ్రాండెడ్ ఫుడ్, న్యూట్రాస్యూటికల్స్, వంట నూనెలు, హెల్త్..వెల్నెస్ ఉత్పత్తుల కింద గ్రూప్ వ్యాపారాలు మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటాయని రాందేవ్ పేర్కొన్నారు. రుచి సోయా కథ ఇదీ.. అతి పెద్ద బ్రాండెడ్ వంట నూనెల సంస్థల్లో రుచి సోయా కూడా ఒకటి. రుచి గోల్డ్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే పామాయిల్ బ్రాండ్స్‌లో ఒకటి. మహాకోష్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి సన్‌లైట్ వంటి ఇతర బ్రాండ్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. ఇక న్యూట్రెలా పేరిట సోయా ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటా ఉంది. బ్యాంకులకు దాదాపు రూ. 9,345 కోట్ల మేర రుణాలు రుచి సోయా బాకీ పడటంతో 2017 డిసెంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో రుచి సోయాను పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు వెచ్చించింది. టేకోవర్ తర్వాత రుచి సోయా .. బిస్కెట్లు, కుకీలు, రస్కులు, నూడుల్స్ మొదలైన ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. -
రుచీ సోయా.. 5% డౌన్ సర్క్యూట్
ఇటీవల నిరవధికంగా ర్యాలీ చేస్తున్న వంట నూనెల కంపెనీ రుచీ సోయా ఇండస్ట్రీస్ కౌంటర్లో తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 76 నష్టపోయి రూ, 1444 దిగువన ఫ్రీజయ్యింది. కాగా.. ఈ షేరు జనవరిలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక వరుసగా అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తద్వారా వారాంతానికల్లా 9400 శాతం ర్యాలీ చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రుచీ సోయా రూ. 41 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు మాత్రం నామమాత్రంగా 1.4 శాతం పెరిగి రూ, 3191 కోట్లకు చేరాయి. దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్ఎస్ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో అంటే మే నెలలో ఆరు రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. తిరిగి నేటి ట్రేడింగ్‌లో అమ్మకాలు తలెత్తడంతో 5 శాతం పతనమైంది. కంపెనీ దివాళాకు చేరడంతో నవంబర్ 2019లో ఈ షేరు 3.30 స్థాయిలో డీలిస్టయ్యింది. పబ్లిక్కు 0.8 శాతమే రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వాటాదారుల వద్దనున్న ప్రతీ 100 షేర్లకుగాను 1 షేరునే కేటాయించింది. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలో పబ్లిక్కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. పబ్లిక్ వాటా పెరిగిన సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని వివరించారు. షేరు ర్యాలీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు అంబరీష్ బలీగా, ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సంస్థ క్రిస్.. డైరెక్టర్ అరుణ్ కేజ్రీవాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
ఆర్తి డ్రగ్స్- రుచీ సోయా.. కొత్త రికార్డ్స్
ఫార్మాస్యూటికల్ ప్రొడక్టుల సంస్థ ఆర్తి డ్రగ్స్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. వారాంతాన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1300ను తాకింది. ఇది సరికొత్త లైఫ్‌టైమ్ గరిష్టంకాగా.. చివరికి 8.3 శాతం జంప్‌చేసి రూ. 1282 వద్ద ముగిసింది. వెరసి గత మూడు నెలల కాలంలో ఈ షేరు ఏకంగా 166 శాతం పురోగమించింది. ఇదే కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 17 శాతమే బలపడటం గమనార్హం! ఫలితాలు భేష్ ఏపీఐ ఫార్ములేషన్ల తయారీ కంపెనీ ఆర్తి డ్రగ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 59 కోట్లకు చేరింది. ఇందుకు రూ. 8.4 కోట్ల అనుకోని ఆదాయంతోపాటు రూ. 15 కోట్ల పన్ను ప్రయోజనం సహకరించింది. అయితే మొత్తం ఆదాయం నామమాత్రంగా 2 శాతం క్షీణించి రూ. 450 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం 32 శాతం పుంజుకుని రూ. 81 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 3.7 శాతం బలపడి 15.9 శాతాన్ని తాకాయి. కొత్త ప్రొడక్టుల విడుదల ద్వారా రానున్న త్రైమాసికాలలో ఆర్తి డ్రగ్స్ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశమున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. మెట్ఫార్మిన్ తయారీ సామర్థ్యం పెంపు, యాంటీఇన్ఫ్లమేటరీ విభాగంలో విస్తరణ ఆదాయాలు, మార్జిన్లను బలపరిచే వీలున్నట్లు అభిప్రాయపడింది. చైనా సమస్యల నేపథ్యంలో ఏపీఐలకు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేసింది. రుచీ సోయా జోరు దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తోంది.ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్ఎస్ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో కొద్ది రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.46,000 కోట్లకు చేరింది. ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో విలువ కంటే అధికంకావడం గమనార్హం! పబ్లిక్ వాటా 0.8 శాతమే రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా నమోదవుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. కంపెనీలో పబ్లిక్కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని అభిప్రాయపడ్డారు. -
ఇసాబ్ భారీ డివిడెండ్- పతంజలి ఎన్సీడీలు హిట్
ప్రధానంగా నిర్మాణ రంగ కంపెనీలకు కీలక ప్రొడక్టులను విక్రయించే విదేశీ అనుబంధ కంపెనీ ఇసాబ్ ఇండియా వాటాదారులకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక మరోవైపు.. వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం బాబా రామ్‌దేవ్ గ్రూప్ కంపెనీ పతంజలి ఆయుర్వేద ఎన్సీడీల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ఇసాబ్ ఇండియా వెల్డింగ్, కటింగ్ ఎక్విప్మెంట్ తయారీ దిగ్గజం ఇసాబ్ ఇండియా వాటాదారులకు భారీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. షేరుకి 700 శాతం(రూ. 70) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. జూన్ 23కల్లా వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 108 కోట్లను కేటాయించినట్లు వివరించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లో భాగంగా ఆంక్షలను సడలించడంతో దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలకు తెరతీసినట్లు తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలోగల ప్లాంట్లు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇసాబ్ ఇండియా షేరు 19 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 1304 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1310 వరకూ ఎగసింది. పతంజలి ఆయుర్వేద ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఆయుర్వేద తొలిసారి జారీ చేసిన డిబెంచర్లు మూడు నిముషాలలోనే సబ్స్క్రయిబ్ అయ్యాయి. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 250 కోట్లను సమీకరించినట్లు పతంజలి ఆయుర్వేద పేర్కొంది. దరఖాస్తుదారులకు 10.1 శాతం కూపన్ రేటుతో మూడేళ్ల కాలానికి ఎన్సీడీలను కేటాయించినట్లు తెలియజేసింది. రిడీమ్ చేసుకునేందుకు వీలైన వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్చేసింది. పతంజలి ఎన్‌సీడీలకు బ్రిక్‌వర్క్ AA రేటింగ్‌ను ప్రకటించింది. వర్కింగ్ కేపిటల్ అవసరాలు, సప్లై చైన్ పటిష్టతకు నిధులను వినియోగించనున్నట్లు పతంజలి పేర్కొంది. కాగా.. దివాళా బాట పట్టిన వంట నూనెల కంపెనీ రుచీ సోయాను గతేడాది డిసెంబర్లో పతంజలి ఆయుర్వేద సొంతం చేసుకున్న విషయం విదితమే. న్యూట్రెలా, సన్ రిచ్, రుచీ గోల్డ్, మహాకోష్ బ్రాండ్లను కలిగిన రుచీ సోయా కొనుగోలుకి రూ. 4350 కోట్లను వెచ్చించింది. -
పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా
న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్.కె. తిజరీవాలా పేర్కొన్నారు. -
ఎన్సీఎల్టీలో పతంజలి పిటిషన్
న్యూఢిల్లీ: రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రూ.12,000 కోట్ల భారీ బ్యాంక్ రుణాల కారణంగా రుచి సోయా కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రుచి సోయాను టేకోవర్ చేయడానికి అదానీ విల్మర్‌తో పాటు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ కూడా బిడ్లు వేశాయి. రుచిసోయా రుణదాతలు రూ.6,000 కోట్ల అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలిపాయి. దీనిని ఎన్సీఎల్టీ ఆమోదించాల్సి ఉంది. అయితే రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)ను పతంజలి ఆయుర్వేద్ ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27న(సోమవారం) విచారణ జరిగే అవకాశాలున్నాయని అంచనా. వివాదమిది... రుచి సోయాను చేజిక్కించుకోవడానికి అదానీ విల్మర్, పతంజలిల మధ్య దీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. అదానీ విల్మర్ రూ.6,000 కోట్ల మేర బిడ్‌ను దాఖలు చేయగా, పతంజలి ఆయుర్వేద కంపెనీ రూ.5,700 కోట్ల మేర్ బిడ్‌ను దాఖలు చేసింది. రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు పచ్చజెండా ఊపారు. ఏ ప్రాతిపదికన అదానీ విల్మర్ బిడ్‌ను ఆమోదించారో వెల్లడించాలని పతంజలి ఆయుర్వేద్ ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ), శేలైంద్ర అజ్మీరకు న్యాయ సలహాదారుగా సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ నియామకాన్ని కూడా పతంజలి కంపెనీ తప్పుపట్టింది. అదానీ గ్రూప్‌నకు కూడా సిరిల్ అమర్‌చంద్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని వివరించింది. వ్యాఖ్యానించడానికి పతంజలి నిరాకరణ... ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నామని పతంజలి ప్రతినిధి ఎస్.కె. తిజరవాలా పేర్కొన్నారు. మరోవైపు అదానీ గ్రూప్ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
రుచి సోయాకు పతంజలి రూ. 4 వేల కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: దివాలా తీసిన వంటనూనెల సంస్థ రుచి సోయా కొనుగోలు కోసం కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేస్తున్నాయి. తాజాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద ఏకంగా రూ.4,000 కోట్ల పైచిలుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అదానీ విల్మర్, ఇమామి ఆగ్రోటెక్, గోద్రెజ్ ఆగ్రోవెట్ తదితర సంస్థలు రుచి సోయా కోసం పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఇండోర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుచి సోయా రుణభారం ప్రస్తుతం రూ.12,000 కోట్లకు పైగా ఉంది. న్యూట్రెలా, మహో కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్ తదితర బ్రాండ్స్ పేరిట ఉత్పత్తులు విక్రయిస్తోంది. భారీ మొండిబాకీల నేపథ్యంలో దివాలా చట్టం కింద చర్యలకు ఆదేశించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్... రుణ సమస్య పరిష్కారం దిశగా కంపెనీ అమ్మకానికి ప్రత్యేక నిపుణుడిని (ఐఆర్పీ) నియమించగా.. ప్రస్తుతం బిడ్స్ దాఖలు ప్రక్రియ జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రుచి సోయా షేర్లు 7 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ఇంట్రా–డేలో దాదాపు 20 శాతం పెరిగి 16.05 స్థాయిని తాకి, చివరికి 7.09 శాతం లాభంతో రూ. 14.35 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 4 శాతం లాభంతో రూ. 14 వద్ద ముగిసింది. బీఎస్ఈలో దాదాపు 33.89 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల మేర షేర్లు చేతులు మారాయి. -
రుచి సోయాపై దివాలా కేసు
ఎన్సీఎల్టీని ఆశ్రయించిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ న్యూఢిల్లీ: భారీగా రుణ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వంట నూనెల తయారీ సంస్థ రుచి సోయా ఇండస్ట్రీస్‌పై బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాయి. స్టాం డర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా కేసు దాఖలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను పరిశీలించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ బోర్డు ఇటీవలే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజా పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 13 లోగా రుణాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ పంపిన రెండో జాబితాలో రుచి సోయా సంస్థ ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కంపెనీ మొత్తం రుణాలు రూ. 12,232.22 కోట్లుగా ఉన్నాయి. రుచి సోయా ప్రధానంగా వంట నూనెల రిఫైనింగ్, విక్రయం, పవన విద్యుదు త్పత్తి మొదలైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో 74% వాటా వంట నూనెలదే ఉంది.