ఫార్మాస్యూటికల్ ప్రొడక్టుల సంస్థ ఆర్తి డ్రగ్స్ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. వారాంతాన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1300ను తాకింది. ఇది సరికొత్త లైఫ్‌టైమ్ గరిష్టంకాగా.. చివరికి 8.3 శాతం జంప్‌చేసి రూ. 1282 వద్ద ముగిసింది. వెరసి గత మూడు నెలల కాలంలో ఈ షేరు ఏకంగా 166 శాతం పురోగమించింది. ఇదే కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 17 శాతమే బలపడటం గమనార్హం!
ఫలితాలు భేష్
ఏపీఐ ఫార్ములేషన్ల తయారీ కంపెనీ ఆర్తి డ్రగ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 59 కోట్లకు చేరింది. ఇందుకు రూ. 8.4 కోట్ల అనుకోని ఆదాయంతోపాటు రూ. 15 కోట్ల పన్ను ప్రయోజనం సహకరించింది. అయితే మొత్తం ఆదాయం నామమాత్రంగా 2 శాతం క్షీణించి రూ. 450 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం 32 శాతం పుంజుకుని రూ. 81 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 3.7 శాతం బలపడి 15.9 శాతాన్ని తాకాయి. కొత్త ప్రొడక్టుల విడుదల ద్వారా రానున్న త్రైమాసికాలలో ఆర్తి డ్రగ్స్ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశమున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. మెట్‌ఫార్మిన్ తయారీ సామర్థ్యం పెంపు, యాంటీఇన్‌ఫ్లమేటరీ విభాగంలో విస్తరణ ఆదాయాలు, మార్జిన్లను బలపరిచే వీలున్నట్లు అభిప్రాయపడింది. చైనా సమస్యల నేపథ్యంలో ఏపీఐలకు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేసింది.
రుచీ సోయా జోరు
దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తోంది.ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో కొద్ది రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్‌లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.46,000 కోట్లకు చేరింది. ఇది ఎఫ్‌ఎంసీజీ కంపెనీ మారికో విలువ కంటే అధికంకావడం గమనార్హం!
పబ్లిక్ వాటా 0.8 శాతమే
రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్‌కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా నమోదవుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. కంపెనీలో పబ్లిక్‌కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment