
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ ఎఫ్‌పీవో పూర్తయ్యింది. ఇష్యూకి రూ. 650 ధరను ఖరారు చేసింది. అయితే 97 లక్షల బిడ్స్ ఉపసంహరణకు లోనయ్యాయి. షేరుకి రూ. 615–650 ధరలో రూ. 4,300 కోట్ల సమీకరణకు కంపెనీ ఎఫ్‌పీవో చేపట్టింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అవసరమైతే ఇన్వెస్టర్లు బిడ్స్‌ను ఉపసంహరించేందుకు వీలు కల్పించమని కంపెనీని ఆదేశించింది.
షేర్ల విక్రయంపై అయాచిత ఎస్‌ఎంఎస్‌లు సర్క్యులేట్‌కావడంతో సెబీ అనూహ్యంగా స్పందించింది. దీంతో ఈ నెల 28న ముగిసిన ఇష్యూలో భాగంగా 30వరకూ బిడ్స్ ఉపసంహరణకు రుచీ సోయా అవకాశమిచ్చింది. బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని రుచీ సోయా ఎఫ్‌పీవో కోసం 4.89 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 17.6 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి.
కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం రూ. 650 ధరను ఖరారు చేసింది. గత వారం ఈ సంస్థలకు 1.98 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1,290 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మహాకోష్, సన్‌రిచ్, రుచీ గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్లు పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచీ సోయా సొంతం. రుచీ సోయా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 937 వద్ద ముగిసింది.